దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ కార్పొరేషన్ లో శనివారం రాత్రి ఏం జరిగింది..? అధికారికి, కాంట్రాక్టర్లకు మధ్య వాగ్వాదం ఎందుకు చోటు చేసుకుంది..? టెండర్లు ఓపెన్ చేస్తున్న సమయంలో చోటు చేసుకున్న ఈ గొడవకు అసలు కారణమేంటీ..? కరీంనగర్ కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం రాత్రి టెండర్లు ఓపెన్ చేస్తున్న సమయంలో కొంతమంది కాంట్రాక్టర్లు అక్కడకు చేరుకున్నట్టుగా సమాచారం. అయితే అక్కడ నిబంధనల ప్రకారం టెండర్లు ఓపెన్ చేసేప్పుడు అధికారులు తప్ప ప్రైవేటు వ్యక్తులు అక్కడ ఉండరాదన్న నిబంధనలు ఉన్నట్టుగా సమాచారం. దీంతో అక్కడ ఉన్న టెక్నికల్ ఆఫీసర్ వారిని అక్కడి నుండి వెళ్లిపోవాలని సూచించిన క్రమంలో వాగ్వాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో అధికారులకు, కాంట్రాక్టర్లకు మధ్య తీవ్ర స్థాయిలో వాదనలు జరిగినట్టుగా మునిసిపల్ వర్గాలు చెప్తున్నాయి. అక్కడి నుండి వెళ్లిపోవాలని సూచించిన అధికారిపై దురుసుగా ప్రవర్తించిన విషయంపై మునిసిపల్ కార్యాలయంలో చర్చించుకుంటున్నారు. తమపై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేసిన సదరు కాంట్రాక్టర్ల విషయం గురించి మేయర్, డిప్యూటీ మేయర్లకు కూడా అధికారులు చెప్పుకున్నట్టుగా సమాచారం. కమిషనర్ రాగానే అనుమతి తీసుకుని క్రిమినల్ కేసు పెట్టాలన్న యోచనలో మునిసిపల్ అధికారులు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే సదరు కాంట్రాక్టర్లు తమకు బలం, బలగం ఉందన్న రీతిలో వ్యవహరించిన తీరుపై మునిసిపల్ ఉద్యోగ వర్గాల్లో తీవ్రంగా చర్చ సాగుతోంది. కేసు పెట్టేందుకు అడ్డంకులు ఎదురైనట్టయితే సెలవుపై వెళ్లాలన్న యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. కరీంనగర్ కార్పొరేషన్ లో గతంలో కూడా అధికారులకు, కాంట్రాక్టర్లకు మధ్య విబేధాలు జరిగాయి. కొన్ని సందర్భాల్లో అధికారులతో మాట్లాడిన ఆడియోలు కూడా వైరల్ అయ్యాయి. తాజాగా మరో ఘటన కూడా వెలుగులోకి రావడం హాట్ టాపిక్ గా మారింది.