కరీంనగర్ బార్ లో కొత్త రకం బ్రాండ్
దిశ దశ, కరీంనగర్:
సాధారణంగా బీర్ కానీ లిక్కర్ కానీ కంపెనీ బ్రాండ్ పేరిట తయారు చేస్తుంటారు. వాటినే వైన్ షాప్, బార్ అండ్ రెస్టారెంట్లలో విక్రయిస్తుంటారు. కానీ కరీంనగర్ శివార్లలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ లో మాత్రం రెండు కంపెనీలకు చెందిన బీర్ విక్రయిస్తున్నారు. దీంతో కొత్త రకం బ్రాండ్ బీర్ విక్రయించేందుకు తెలంగాణ ఎక్సైజ్ విభాగం అధికారులు అనుమతి ఇచ్చారా బ్రూవరీస్ విభాగం మాత్రమే సప్లై చేస్తోందా అన్న అనుమానం మద్యపాన ప్రియుల్లో మొదలైంది. అయితే రెండు కంపెనీలు కలిసి బీర్ తయారు చేసేందుకు ఒప్పందం ఏమైనా కుదిరిందా అన్న చర్చ కూడా సాగుతోంది. ఎక్సైజ్ విభాగం పర్మిషన్ లేకుండా బీర్లు విక్రయిస్తున్నా పట్టించుకునేవారు లేకుండా పోయారా అన్న అనుమానం కూడా వ్యక్తం అవుతోంది. అల్గునూరులోని బార్ అండ్ రెస్టారెంట్ లో శనివారం విక్రయించిన బీర్ సీసాపై టు బర్గ్ అని ఉండగా, స్టిక్కర్ మాత్రం కింగ్ ఫిషర్ అని ఉంది. దీంతో ఖంగుతిన్న వినియోగదారుడు బార్ సిబ్బందిని పిలిచి అడిగితే అసలైన బీర్ ఇచ్చారు. అయితే కంపెనీలతో సంబంధం లేకుండా బీర్లు తయారు చేసి విక్రయిస్తున్నారా ఏంటీ అని ప్రశ్నిస్తే మీరేం చేసుకుంటారో చేసుకోండి మమ్మల్ని ఏమీ చేయలేరంటూ సమాధానం ఇచ్చారని వినయోగదారుడు వాపోతున్నాడు. జనతా బార్ అండ్ రెస్టారెంట్ లో నకిలీ బీర్ల విక్రయంపై ఎక్సైజ్ అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి తయారైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వానికి ఆదాయం రావాలన్న లక్ష్యంతో ఉన్న ఎక్సైజ్ విభాగానికి రెంటల్ ఎక్కువ చెల్లించిన బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వాహకులు తామేం చేసినా చెల్లుతుందన్న తీరుతో వ్యవహరించడం విస్మయానికి గురి చేస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.