టార్గెట్ పొలిటికల్ లీడర్..! అవే ఆయన లక్ష్యం…

గోల్డ్ థీఫ్ సుబోధ్ సింగ్

దిశ దశ, కరీంనగర్:

దోపిడీల కోసం వ్యవస్థను క్రియేట్ చేసిన గోల్డ్ థీఫ్ సుబోధ్ సింగ్ లక్ష్యాలు అంతుచిక్కకుండా ఉన్నాయి. భారీగా డబ్బు సంపాదించాలి… రాజకీయాల్లో చేరాలన్న లక్ష్యంతో పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తోంది. పలు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సుబోధ్ సింగ్ ఎంచుకున్న మార్గం అత్యంత విచిత్రంగా ఉందనే చెప్పాలి. కోల్ కత్తాకు వెళ్లిన తరువాత దోపిడీలు చేయాలని నిర్ణయించుకున్న సుబోధ్ సింగ్ ఇందుకు సంబంధించిన నెట్ వర్క్ ను ఏర్పాటు చేసుకున్నాడు. అయితే తన టార్గెట్ గా మాత్రం బ్యాంకులు, గోల్డ్ లోన్ ఇచ్చే సంస్థలు, జ్యువెలరీ షాపులను మాత్రమే ఎంచుకున్నాడు. సామాన్యులను లక్ష్యం చేసుకుని దోపిడీలు చేసినట్టయితే వారిపై ఆర్థిక భారం పడుతుందని, అదే పెద్ద మాల్స్, బ్యాంకులు, గోల్డ్ లోన్ ఇచ్చే సంస్థలయితే వాటికి ఇన్సూరెన్స్ కవర్ అయ్యే అవకాశం ఉంటుందని భావించి వాటిని ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది. అంతా పకడ్భందీగా స్కెచ్ వేసే సుబోధ్ సింగ్ 2018 నుండి బీహార్ రాష్ట్రంలోని పలు జైళ్లలోనే ఉంటూ తన నెట్ వర్క్ ద్వారా రాబరీ చేయిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది.

వ్యాపారాలు…

సుబోధ్ సింగ్ ముఠా దోపిడీలు చేసే నగలను నేపాల్ కు తీసుకెళ్లి విక్రయించడం, దోపిడీలలో పాల్గొన్న వారి కుటుంబాలకు కొంత చేర్చడంతో పాటు మిగతా డబ్బును పలు రకాల వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టినట్టుగా తెలుస్తోంది. పెట్రోల్ బంకులు, ఇటుకబట్టీలతో పాటు పలు రకాల వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టిన సుబోధ్ సింగ్ పరోక్ష భాగస్వామిగా ఉంటూ ఆర్థికంగా ఎదిగేందుకు వ్యూహ రచన చేసుకున్నట్టుగా సమాచారం. ఇలా చాలా రకాల వ్యాపారాల్లో భాగస్వామిగా ఉన్న సుబోధ్ సింగ్ అంతిమ లక్ష్యం మాత్రం రాజకీయాలేనని తెలుస్తోంది. ఆర్థికంగా బలపడి రాజకీయాల్లో చేరి ముఖ్య నాయుడిగా ఎదగాలన్న లక్ష్యంతో ఉన్నట్టుగా సమాచారం.

వందలాది మంది…

సుబోధ్ సింగ్ చాలా గ్యాంగులను మెయింటైన్ చేస్తున్నట్టుగా సమాచారం. ఇందులో డైరక్ట్ గా అతనితో కాంటాక్టు అయ్యేవారి సంఖ్య 30 వరకు ఉంటుందని తెలుస్తోంది. మిగతా వారంతా కూడా గ్యాంగ్ ఇంఛార్జీల ద్వారా పనులు చేసుకుంటూ వెల్తారని తెలుస్తోంది.

ఉచ్చు బిగిసినట్టే..!

గోల్డ్ థీఫ్ సుబోధ్ సింగ్ ను కరీంనగర్ పోలీసులు విచారించిన నేపథ్యంలో ఒక్క కరీంనగర్ రాబరీ కేసే కాకుండా దేశంలోని పలు కేసులకు సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరించినట్టుగా తెలుస్తోంది. ఇంతకాలం సుబోధ్ సింగ్ ను పట్టుకునేందుకు లీగల్ గా ప్రూవ్ చేయలేమని ఆయా రాష్ట్రాల పోలీసులు భావించి మిన్నకుండి పోగా కరీంనగర్ దోపిడీ విషయంలో మాత్రం పోలీసులు టెక్నికల్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయడంలో రికార్డ్ సృష్టించారు. దీంతో సుబోధ్ సింగ్ ను అరెస్ట్ చేసి కస్టడీ విచారణ చేసిన పోలీసులు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేయడంతో గతంలో చేసిన దోపిడీలు, ఏయే రాబరీల్లో ప్రమేయం ఉంది అన్న వివరాలను కూడా కరీంనగర్ పోలీసుల ముందు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇదే నిజమైతే మాత్రం ఒక్క కరీంనగర్ కేసే కాకుండా దేశంలోని పలు సంచలనాత్మక దోపిడీ కేసుల మిస్టరీ వీడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Gold ThiefKARIMNAGAR POLICEPMJ Jewellery ShowroomRobbery GangTG NEWS
Comments (0)
Add Comment