పెద్దపల్లిలో ‘‘మల్లోజ్జుల’’

దిశ దశ, పెద్దపల్లి:

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యునిగా, పొలిట్ బ్యూరో మెంబర్ గా పని చేసి జనజీవనంలోకి వచ్చిన మల్లోజ్జుల వేణుగోపాల్ రావు పెద్దపల్లికి వచ్చారు. నాలుగన్నర దశాబ్దాలుగా విప్లవ పంథాలో కొనసాగిన ఆయన గత అక్టోబర్ నెలలో సాయుధ విరమణ ప్రకటించారు. ఈ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి  దేవేంద్ర ఫడ్నవిస్ ముందు జనజీవనంలోకి వచ్చిన ఆయన గడ్చిరోలికే పరిమితం అయ్యారు. వేణుగోపాల్ రావు స్వస్థలం అయిన పెద్దపల్లికి ఎప్పుడు వస్తారోనన్న ఆతృత స్థానికంగా కనిపించింది. అయితే ఆదివారం ఆయన సోదరుడు అంజన్న అనారోగ్యంతో బాధపడుతున్న సమాచారం అందుకున్న వేణుగోపాల్ రావు పెద్దపల్లిలోని తన ఇంటికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన బంధువులు, పరిచయస్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు.

ఎన్నాళ్లకెన్నాళ్లకు…

దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం విప్లవ పాఠాలు నేర్పుతూ స్థానిక యువతను ఉద్యమాల వైపునకు నడిపించిన మల్లోజ్జుల ఇంతకాలం బాహాటంగా తిరిగిన సందర్భాలు అత్యంత అరుదేనని చెప్పాలి. దండకారణ్య అటవీ ప్రాంతంలో నక్సల్స్ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టిన ఆయన తెలంగాణతో ఉన్న అనుబంధాన్ని దాదాపుగా దూరం చేసుకున్నట్టయింది. మావోయిస్టులకు సంబంధించిన ఘటనలు జరిగినప్పుడు మాత్రం వేణుగోపాల్ రావు గురించి చర్చకు వచ్చేది. 2011 నవంబర్ 24న పశ్చిమ బెంగాల్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆయన సోదరుడు మల్లోజ్జుల కోటేశ్వర్ రావు ఎన్ కౌంటర్ లో చనిపోయిన తరువాత వేణుగోపాల్ రావు గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆయన తల్లి మధురమ్మ జనజీవనంలోకి రావాలన్న పిలుపుపై స్పందించారు వేణుగోపాల్ రావు. ఆ తరువాత ఆయన ఆయుధ విరమణ ప్రకటించిన తరువాత బయటకు వచ్చినప్పటికీ మహారాష్ట్రలోని గడ్చిరోలికే పరిమితం అయ్యారు. ఆదివారం పెద్దపల్లికి వేణుగోపాల్ రావు చేరుకోవడంతో సుదీర్ఘ కాలం తరువాత సొంత ఇంటికి వచ్చినట్టయింది.

మఫ్టీ పోలీసులు…

మల్లోజ్జుల వేణుగోపాల్ రావు పెద్దపల్లి పర్యటన అంతా కూడా మహారాష్ట్ర పోలీసుల కనుసన్నల్లోనే సాగుతోంది. ఆయన వెంట వచ్చిన మఫ్టీ పోలీసులు సునిశితంగా పరిశీలన చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసిన ఆయన నవ్వకుంటూ పరిచయం చేసుకోగా తన చిన్ననాటి తరానికి చెందిన వారిని ముచ్చటించారు. అయితే వేణుగోపాల్ రావు మాత్రం మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. ఇంటర్వ్యూల కోసం గడ్చిరోలికి రావాలని ఇక్కడ మీడియాతో మాట్లాడనని స్షష్టం చేశారు.

EX MAOISTLatest NewsMallojjula Venugopal Raomaoist newsPEDDAPALLY
Comments (0)
Add Comment