దిశ దశ, కరీంనగర్:
తెలంగాణలోని ఓ పోలీస్ స్టేషన్ అది… చీకట్లు కమ్ముకున్న సమయమది… ఠాణాలో లైట్లు వెలుగుతున్నాయ్… అంతలో అక్కడకు అపరిచిత వ్యక్తి గేటు వద్దకు చేరుకున్నాడు… సెంట్రీ పోస్టులో ఉన్న వ్యక్తి అప్రమత్తమై అరుస్తున్నాడు. ఎవరది… ఏం చేస్తున్నారక్కడ… ఎందుకొచ్చారంటూ గట్టిగా ప్రశ్నిస్తున్నాడు. తాము ఫలానా వారమని చెప్పగానే లోపలకు అతన్ని అనుమతించాడు. మరో ఠాణాలో ఓ వాహనం రయ్ మని దూసుకొని స్టేషన్ గేట్ ముందుకు రాగానే స్టేషన్ లో ఉన్న స్టాఫ్ అంతా అలెర్ట్ అయింది. విజిల్స్ మోతలతో సెంట్రీ హై అలెర్ట్ చేస్తూ సెంట్రీ పోస్టులోంచి తుపాకి ఎక్కుపెట్టగా… మిగతా సిబ్బందిలో కొందరు ఠాణాపై భాగంలోకి వెళ్లి, మరికొంత మంది సేఫ్టీ ప్లేస్ లోకి చేరుకుని కాల్పులు జరిపేందుకు సిద్దమయ్యారు. రాష్ట్రంలో ఒకప్పుడు పోలీసులు తీసుకున్న స్వీయ రక్షణ చర్యలు ఇవి. సాధారణ హోంగార్డు బయటకు వెళ్లాలన్నా జాగ్రత్తలు పాటించేవారు. టార్గెట్ అయిన పోలీస్ ఆఫీసర్ అయితే రక్షణ వలయంలోనే జీవనం సాగించే వారు. దశాబ్దాల క్రితం తుపాకులు లేకుండా సెంట్రీ డ్యూటీ చేసే పోలీస్ స్టేషన్ లంటేనే విచిత్రంగా చర్చించుకునే వారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కొన్ని పోలీస్ స్టేషన్ లో లాఠీతో కానిస్టేబుల్ సెంట్రీ డ్యూటీ చేసిన సందర్భాలు, తుపాకులకు రక్షణ లేదని భావించి వాటిని సమీప పోలీస్ స్టేషన్ లకు తరలించడం వంటి చర్యల గురించి కథకథలు చెప్పుకున్న సందర్భాలున్నాయి. అయితే ఇప్పుడా పరిస్థితి అన్ని పోలీస్ స్టేషన్ లలో నెలకొంది. ఎస్సై ఆపై స్థాయి అదికారి తప్ప మిగతా పోలీసు సిబ్బంది వద్ద తుపాకులు లేకుండా పోయాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్ ప్రోగ్రాంలో భాగంగా పోలీసులు నిరాయుధులుగా మారారు. తమను తాము రక్షించుకోవాలంటే వేసుకున్న యూనిఫాం, చేతిలో ఉన్న లాఠీ తప్ప మరోకటి కనిపించకుండా పోయింది.
పీఎంజే జ్యువెలరీస్…
కరీంనగర్ నడిబొడ్డున మే 3న జరిగిన సంఘటన ఇప్పుడు పోలీసు వ్యవస్థను అంతర్మథనంలో పడేసింది. సాయుధులుగా వచ్చిన అగంతకులు దర్జాగా దోపిడీ చేసుకుని వెళ్లడమే కాకుండా తుపాకులతో బెదిరించి ఎదురుతిరిగిన వారిపై కాల్పులు జరిపి వెల్లిన తీరుతో తమ పరిస్థితి ఏంటన్న వేదన పోలీసుల్లో వ్యక్తం అవుతోంది. నక్సల్స్ కార్యకలాపాలు గణనీయంగా తగ్గిపోయినప్పటికీ అసాంఘీక శక్తులను నిలువరించడమేలా అన్నదే వారి మదిలో మెదులుతున్న ప్రశ్న.
అలా అయితే…
పీఎంజే జ్యువెలరీస్ షోరూంలోనే ముఠాను పట్టుకునేందుకు పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఎదురైతే ఎలా అన్నదే అంతు చిక్కకుండా పోతోంది. స్టేషన్ లలో ఏర్పాటు చేసిన సెంట్రీ పోస్టులు కూడా నిర్వీర్యంగా మారిపోగా… ఒకప్పుడు డేగ కళ్లతో డ్యూటీ చేసిన పోలీసులు ఇప్పుడు సాదాసీదా జీవనం గడపాల్సిన పరిస్థితి తయారైంది. షోరూంలోకి చొరబడ్డ దోపిడీ ముఠా గురించి వెంటనే సమాచారం అందినా వారిని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగే పరిస్థితి లేకుండా పోయేది. లోపల ఉన్న అగంతకుల వద్ద ఆయుధాలు ఉన్నాయన్న సమాచారం అందుకున్న తరువాత ఎస్సై ఆపై స్థాయి అధికారుల వద్ద ఉన్న షార్ట్ వెపన్స్ దోపిడీ ముఠాను కట్టడి చేసే పరిస్థితి ఉండేదా లేదా అన్నది ఉన్నతాధికారులకే తెలియాలి. ప్రతికూల పరిస్థితులు ఎదరైతే… పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఉన్న బెల్ ఆఫ్ ఆర్మ్స్ లో ఉన్న ఆయుధాలను తీసుకునేందుకు పోలీసు అధికారుల అనుమతులు తీసుకోవల్సి ఉంటుంది. ఆ తరువాత తుపాకులు పని చేస్తున్నాయో లేదో పరిశీలించడంతో పాటు ఆయుధాల వివరాలు, ఇచ్చిన మ్యాగ్జిన్ వివరాలు రికార్డుల్లో రాసుకున్న తరువాత పోలీసులు రంగంలోకి దిగాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా అయ్యే వరకూ అసాంఘీక శక్తులు ఎంతటి అలజడులు సృష్టించే అవకాశం ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కాల్పుల మోతలతో భయానక వాతావరణం సృష్టించే వారు. పీఎంజే జ్యువెలరీస్ లో చొరబడ్డ ముఠా ఇంతటి అఘాయిత్యానికి పాల్పడకున్నప్పటికీ అలాంటి గ్యాంగులు రంగంలోకి దిగితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోనన్న విషయంపై పోలీసు ఉన్నతాధికారులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. శాంతి భద్రతల పరిరక్షణ విభాగం పరిస్థితి ఇలా ఉంటే… ఆర్మ్ డ్ రిజర్వూ విభాగంలోనూ ఇలాగే నెలకొంది. ఉన్నతాధికారుల నుండి ప్రముఖుల భద్రత, పోలీసు వ్యవస్థకు సంబంధించిన అన్నింటికి కాపాల… అండర్ ట్రయల్ ఖైదీలను కోర్టుల్లో హాజరు పర్చడం… తిరిగి జైళ్లకు తరలించడం వంటి పనుల్లో నిమగ్నం కావల్సి ఉంటుంది ఏఆర్ విభాగం. అయితే వీరికి కొన్ని సందర్భాల్లో మినహాయిస్తే మాత్రం చాలా సందర్భాల్లో ఏఎస్ఐ వరకు మాత్రమే వెపన్ ఇస్తున్నారు. ఒక వేళ స్ట్రాంగ్ ఎస్కార్ట్ అని రాస్తే మాత్రం జైళ్లకు తరలించే ఖైదీలను తరలించే సిబ్బందికి తుపాకులు ఇస్తున్నారు. మిగతా సందర్భాల్లో కేవలం యూనిఫారంతోనే సరిపెట్టాల్సిన పరిస్థితి తయారైంది. కోర్టులకు తరలించి తీసుకొచ్చే క్రమంలో ఖైదీలు ఎదురుదాడికి దిగితే ఎలా అన్నదే మిస్టరీగా మారింది. అసాంఘీక శక్తులు దాడి చేస్తే వారిని వెంటనే నిలువరించేగలిగే అవకాశం తెలంగాణ పోలీసుల చేతుల్లో ఉందా లేదా అన్నదే ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పోలీసు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.