అనుభవం నేర్పిన పాఠాన్ని అస్వాదించిన ట్రైనీ డీఎస్పీలు…

పీఎంజే జ్యువెలరీ రాబరీ కేస్ స్టడి క్లాసుల తీరు…

దిశ దశ, హైదరాబాద్:

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షాప్ రాబరీ కేసులో పోలీసులు ఎలా దర్యాప్తు చేశారు..? నిందితులను గుర్తించడంలో ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగారు..? సుబోధ్ గ్యాంగ్ ను ట్రేస్ చేయడంలో సక్సెస్ ఎలా అయ్యారు..? అన్న విషయాలపై సమగ్రంగా వివరించారు కరీంనగర్ సీపీ గౌష్ ఆలం. దేశంలోని వివిధ రాష్ట్రాలలో దోపిడీలకు పాల్పడిన ఈ ముఠా గురించి కరీంనగర్ పోలీసులు పడ్డ శ్రమ గురించి వివరించేందుకు తెలంగాణ పోలీస్ అకాడమీ వేదికైంది. ఇక్కడ శిక్షణ పొందుతున్న ట్రైనీ గ్రూప్ వన్ ఆఫీసర్లకు కేస్ స్టడీగా వివరించాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా శనివారం కరీంనగర్ సీపీ గౌష్ ఆలం, ఏసీపీలు వెంకట స్వామి, విజయ్ కుమార్, సీఐలు సృజన్ రెడ్డి, తిరుమల్, శ్రీనివాస్ ల బృందం హైదరాబాద్ లోని TGPAలో ప్రత్యేకంగా తరగతులు నిర్వహించారు. దాదాపు వంద మందికిపైగా డీఎస్పీలు శిక్షణ పొందుతున్న నేపథ్యంలో పీఎంజే జ్యువెలరీ షాపు రాబరీ కేసు ఇన్వెస్టిగేషన్ చేసిన తీరుపై అవగాహన కల్పించినట్టయితే డ్యూటీలో చేరిన తరువాత వారికి ఎంతో లాభిస్తుందని ఆశించారు పోలీసు ఉన్నతాధికారులు. ఈ మేరకు శనివారం ప్రత్యేకంగా 2 గంటల పాటు సమయం కెటాయించారు తెలంగాణ పోలీస్ అకాడమీ అధికారులు. డీజీపీ సివి ఆనంద్ సూచన మేరకు ట్రైనీ డీఎస్పీలకు అవగాహ న కల్పించేందుకు ఈ చొరవ తీసుకున్నారు. కరీంనగర్ జ్యోతినగర్ లోని పీఎంజే జ్యువెలరీ షాపులో మే 3వ తేదిన జరిగిన రాబరీ, షోరూం స్టాఫ్ వారిని అడ్డుకోవడంతో కాల్పులు జరిపి పరార్ అయిన తరువాత అసలేం జరిగింది అన్న విషయాలపై సవివరంగా బోధించారు కరీంనగర్ సీపీ గౌష్ ఆలం. టెక్నాలజీ ఆధారంగా పోలీసులు పట్టుకునే అవకాశం ఉందని భావించిన దోపిడీ ముఠా సభ్యులు మొబైల్ ఫోన్లు విసిరేసి పరార్ అయినప్పటికీ వారి ఆచూకి ఎలా దొరకబట్టుకున్నామో వివరించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో షెల్టర్ తీసుకున్న ముఠా సభ్యులు గురించి తెలుసుకోవడంతో పాటు షోరూంలో దోపిడీ చేసే ముందు గోల్డ్ చైన్ ఫోటో ఒకటి బీహార్ లోని సుబోధ్ గ్యాంగ్ కు పంపించారని గుర్తించామని తెలిపారు. ఎన్ క్రిప్టెడ్ యాప్ ద్వారా రాబరీకి సంబంధించిన స్కెచ్ వేసుకున్నారని సీపీ వివరించారు. ఒక్కో అడుగు ముందుకు వేస్తూ మొత్తం 8 రాష్ట్రాలలో గాలింపు చర్యలు చేపట్టి బీహార్ కు చెందిన సుబోధ్ గ్యాంగేనని నిర్థారించుకున్నామని వివరించారు. కరీంనగర్ నుండి ప్రత్యేక బృందాలను బీహార్, పశ్చిమ బెంగాల్ కు పంపించినట్టు వెల్లడించారు. సుబోధ్ గ్యాంగ్ నెట్ వర్క్ ను ఛేదించిన హిస్టరీ ఎక్కడా లేదని, దానిని ట్రేస్ చేసి సక్సెస్ అయిన హిస్టరీ కరీంనగర్ పోలీసులకే దక్కుతుందని సీపీ వివరించారు. అప్పటికే జైలులో ఉన్న సుబోధ్ సింగ్ పాత్ర కూడా ఉందని నిరూపించి ఆరు కోర్టుల నుండి అనుమతి తీసుకుని అతన్ని కరీంనగర్ తరలించి రాబరీ కేసులో నిందితునిగా చేర్చగలిగామన్నారు. ఈ విషయంలో డీజీపీ సివి ఆనంద్ ప్రత్యేక శ్రద్ద వహించి బీహార్ రాష్ట్ర ఉన్నతాధికారులతో మాట్లాడారని తెలిపారు. సుబోధ్ గ్యాంగ్ కు సంబంధించిన ఎనిమిది మందిని అరెస్ట్ చేశామని సీపీ వివరించారు.

ప్రోత్సాహం…

దోపిడీ ముఠాను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసు అధికారులను వెన్నుతట్టి ప్రొత్సహించాలని సీపీ గౌష్ ఆలం సూచించారు. సబ్ డివిజనల్ పోలీస్ అధికారులుగా బాధ్యతలు చేపట్టనున్న మీరంతా కూడా ముఠాలను పట్టుకునేందుకు వెళ్లిన వారిని ప్రోత్సహిస్తే సత్ఫలితాలు సాధించగలుగుతామన్న విషయ గుర్తు పెట్టుకోవాలన్నారు. ముఖ్యంగా లాడ్జిలలో గదులు అద్దెకు తీసుకున్న వారి వివరాలు సమగ్రంగా రాసుకోవాలని, కాంటాక్ట్ నంబర్లు ఇవ్వగానే రిజిస్టర్లలో రాసుకునేందుకు ఆ నెంబర్లు సరైనవా కాదా అన్న విషయాన్ని ధృవీకరించుకోవల్సిన అవసరం ఉందన్న విషయాన్ని నిర్వాహాకులకు చెప్పాలన్నారు. అలాగే వారి ఫోటోలు కూడా స్మార్ట్ ఫోన్లలో తీసుకోవాలని కూడా చెప్పాలన్నారు. ధర్మపురి, పెద్దపల్లిలలో షెల్టర్ తీసుకున్న ఈ ముఠా సభ్యులు ఇచ్చిన నంబర్లు పని చేయడం లేదని ఆధార్ కార్డులు కూడా క్రియేట్ చేసుకున్నవే కావడంతో వారి ఆచూకి దొరకబట్టుకోవడం అసాధ్యంగా మారినా కరీంనగర్ పోలీసులు సుసాధ్యం చేశారన్నారు. ఈ కేసును ఛేదించడంలో తనతో పాటు కమిషనరేట్ పోలీసు అధికారులు సమిష్టి దర్యాప్తు వల్లే సక్సెస్ అయ్యామని వెల్లడించారు సీపీ గౌష్ ఆలం.

ప్రతి క్షణం…

ప్రతి క్షణం ఉత్కంఠతను ఎదుర్కొంటూ బీహార్ లో దోపిడీకి పాల్పడిన ముఠా సభ్యులను పట్టుకున్నామని, తెలంగాణ నుండి వెళ్లిన పోలీసు బృందాలను గురించి ప్రతి కదలికనూ తెలుసుకుంటూ సుబోధ్ గ్యాంగ్ తప్పించుకుని తిరుగుతున్నా… అక్కడి పోలీసు అధికారుల సహకారంతో పాటు సాంకేతికతను అందిపుచ్చుకుంటూ అప్పటికప్పుడు ఇన్ ఫార్మర్ వ్యవస్థను క్రియేట్ చేసుకోవల్సి వచ్చిందని వెల్లడించారు. బీహార్ కు వెళ్లిన కరీంనగర్ పోలీసు టీమ్స్ ఏ మాత్రం అదమరిచినా రాబరీ గ్యాంగ్ తమపై పైచేయి సాధించుకునే విధంగా ప్లాన్ చేసుకున్నప్పటికీ అలాంటి అవకాశం వారికి ఇవ్వలేదని వివరించారు. దోపిడీలో పాల్గొన్న ఈ ముఠా సభ్యుడిని పట్టుకునేందుకు వెళ్లిన క్రమంలో అతని ఇంటి నుండి తప్పించుకుని వెళ్లాడని అతని షెల్టర్ తెలుసుకున్నప్పటికీ అతని వద్ద ఆయుధాలు ఉంటే ఎలా..? పట్టుకునే క్రమంలో కాల్పులు జరిపితే ఎలా అని ఆలోచించి అవసరమైన స్వీయ రక్షణ చర్యలు తీసుకుని సక్సెస్ అయ్యామని చెప్పారు. ఒక దశలో పోలీసులుగా కాకుండా స్థానికుల వేషంలో నిందితుల కోసం గాలించామని, పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బాధితులుగా కూడా మారాల్సి వచ్చిందన్నారు.

గుర్తించేందుకు…

స్థానికులు కాదు… ఎక్కడి వారో తెలియదు… కానీ రాబరీ గ్యాంగ్ ను పట్టుకోవాలన్న సంకల్ప బలమే తమలో ఎక్కువైందని, దీంతో దోపిడీ తరువాత ఎటు వైపు నుండి ముఠా సభ్యులు వెళ్లారన్న కోణంలో ప్రధాన రహదారులు కాకుండా పల్లెల్లో తిరుగుతూ ఆధారాలు సేకరించామని తెలిపారు కరీంనగర్ పోలీసు అధికారులు. గ్రామీణ ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన ఫుటేజీని సేకరించి ముఠా ఎటువైపు నుండి వచ్చిందో అటు వైపు నుండే వెళ్లిందని నిర్దారించుకున్నామని, ఆ తరువాత ధర్మపురి వరకు చేరుకున్నామని వివరించారు. ధర్మపురి శివార్లలో పడేసిన బైక్, మరో చోట మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న తరువాత వారు ఎటువైపు వెళ్లారో అర్థం కాకుండా పోయిందని అయినప్పటికీ కూపీ లాగడంలో ప్రత్యేక దృష్టి సారించి సక్సెస్ అయ్యామని వెల్లడించారు.

ఎన్నికలు…

కరీంనగర్ రాబరీ జరిగిన సమయంలోనే పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు జరగడం, అక్కడి సీఎం పీఏ హత్యకు గురి కావడం వల్ల సంబంధిత పోలీసులు సహకరించే పరిస్థితి లేకుండా పోయిందని దీంతో తామే స్వయంగా సమాచార వ్యవస్థను తయారు చేసుకోవల్సి వచ్చిందని వివరించారు కరీంనగర్ పోలీసులు. పశ్చిమబెంగాల్, నేపాల్ సరిహద్దుల్లోని అసాన్ సోల్ గ్రామంలో ఎదుర్కొన్న ప్రతికూల పరిస్థితులను, అనుమానిత వ్యక్తి గురించి వివరాలు సేకరించినా అతనికి ఈ రాబరీతో సంబంధం లేదని తెలుసుకున్న తరువాత నిరుత్సాహానికి గురి కాకుండా మరింత లోతుగా ఆరా తీశామని చెప్పారు.

ఆహారం…

బీహార్ లో దొరికే ఆహారం తినలేని పరిస్థితులు ఎదురయినా ముఠాను పట్టుకుని తీరాలన్న సంకల్పమే తమను ముందుకు నడిపించిందని, కరీంనగర్ పోలీసులంటే ఓ బ్రాండ్ ఉందని ఈ ఇమేజ్ మరింత పెంచేందుకు శ్రమించాల్సిన అవసరం ఉందని భావించామని పోలీసు అధికారులు వివరించారు. అక్కడి పరిస్థితులపై అవగాహన ఉండడంతో పచ్చళ్లు తీసుకెళ్లి ఆహారం తీసుకున్నామని కూడా వివరించారు.

2 గంటలు…

ట్రైనీ డీఎస్పీల కోసం కెటాయించింది 2 గంటల సమయమే అయినప్పటికీ కరీంనగర్ సీపీ గౌష్ ఆలంతో పాటు ఏసీపీ విజయ్ కుమార్, సీఐలు సృజన్ రెడ్డి, తిరుమల్, శ్రీనివాస్ లు దోపిడీ ముఠాను పట్టుకునేందుకు వేసుకున్న వ్యూహాలు… అమలు చేసిన తీరు గురించి వివరించేందుకు 3.30 గంటలకు పైగా సమయం తీసుకున్నా ట్రైనీ డీఎస్పీలు శ్రద్దగా విన్నారు.

ప్రశ్నలు…

పీఎంజే జ్యువెలరీ రాబరీ కేసు దర్యాప్తు విధానం గురించి విన్న తరువాత ట్రైనీ డీఎస్పీలు కూడా పలు ప్రశ్నలు సంధించగా వాటన్నింటికి సమాధానాలు చెప్పారు. నగల షాపు దోపిడి కేసు తమకు అద్భుతమైన అనుభూతిని మిగిల్చిందని ట్రైనీ డీఎస్పీలు సంతోషం వ్యక్తం చేశారు.

crime storyGaush Alam IPSGold Thief Subodh SinghKARIMNAGAR POLICEtg police
Comments (0)
Add Comment