దిశ దశ, హైదరాబాద్:
దశాబ్దాల కాలంగా అడవులకే పరిమితమైన అన్నలు ఇంటి బాట పడుతున్నారు. భూమి కోసం భుక్తి కోసం అంటూ నినదిస్తూ అజ్ఞాత జీవితం గడిపిన విప్లవ నేతలు జనాల్లోకి వచ్చేస్తున్నారు. కీకారణ్యాలతో మమేకమైన వారిలో చాలా మంది జనారణ్యంలోకి వచ్చేస్తున్నారు. కేంద్ర కమిటీ సభ్యుల నుండి మొదలు సాదారణ దళ సభ్యుల వరకు ఇలా చాలా మంది బాహ్య ప్రపచంలోకి అడుగు పెడుతున్నారు. సైద్దాంతిక పోరాటానికే అంకితమైన చాలా మంది వనాల నుండి జనాలోకి వస్తున్నారు. తెలంగాణ, చత్తీస గడ్, మహారాష్ట్ర, ఏపీ, ఒడిశాతో పాటు పలు రాష్ట్రాల్లో పని చేసిన అగ్రనేతలంతా అడవులను వీడుతున్నారు.
మారుతున్న వైఖరి…
మావోయిస్టు పార్టీకే అంకితమై అజ్ఞాతంగా జీవనం సాగించిన మాజీలు జనాల్లోకి రాగానే వారిని ఆదరిస్తున్న తీరులో వైవిద్యత కనిపిస్తోంది. ఒకప్పుడు లొంగిపోయిన నక్సల్స్ అంటే ప్రభావిత ప్రాంతాలకు చెందిన వారు అంతరం మెయింటెన్ చేసేవారు. దీంతో గతంలో మాజీ నక్సల్స్ చాలా మంది పట్టణ ప్రాంతాలకు పరిమితమై తమ స్వగ్రామాలకు వెల్లినప్పుడు స్వీయ రక్షణ చర్యలు తీసుకునే వారు. వారి సొంత ఊర్లలో ఉన్న కుటుంబ సభ్యుల మినహా మిగతా వారంతా కూడా మాజీలతో సాన్నిహిత్యంగా మెదిలేందుకు సాహసించేవారు కాదు. కానీ ఇప్పుడా పరిస్థితుల్లో మార్పు వచ్చినట్టుగా స్పష్టమవుతోంది. అన్నలు, పోలీసుల ఎత్తులు, పై ఎత్తులతో అట్టుడికిపోయిన తెలంగాణ పల్లెల్లో నాటికి నేటికీ పూర్తి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మాజీలను అక్కున చేర్చుకునేందుకు స్థానికులు ఉత్సుకత చూపిస్తుండడం విశేషం.
సత్కారాలు…
మావోయిస్టు పార్టీలో సుదీర్ఘ కాలం పని చేసిన మావోయిస్టు నేతలతో ఆయా ప్రాంతాల్లోని వారు అత్యంత చనువుగా ఉంటుండడం విశేషం. ఇటీవల కాలంలో మావోయిస్టు పార్టీకి చెందిన ముఖ్య నాయకులంతా కూడా లొంగిపోగా ఒక్కొక్కరు తాము పుట్టి పెరిగిన ప్రాంతాలకు వచ్చి వెల్తున్నారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడుకాపూర్ గ్రామానికి చెందిన పుల్లూరి ప్రసాద రావు ఇటీవల జన జీవనంలోకి వచ్చారు. అనంతరం వడుకాపూర్ కు చేరుకున్న ఆయనకు గ్రామస్థులు ప్రత్యేకంగా సన్మానం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసగించారాయన. మంచిర్యాల జిల్లా మందమర్రిలో మరో కేంద్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాష్ కు ఆత్మీయ సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
సొంతవారిని కలుస్తూ…
కేంద్ర కమిటీ అధికార ప్రతినిధిగా పని చేసిన మల్లోజ్జుల వేణుగోపాల్ రావు, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యునిగా పని చేసిన కంకణాల రాజిరెడ్డి తమ కుటుంబ సభ్యులను కలిశారు. స్వస్థలాలకు వచ్చిన మావోయిస్టు మాజీ నాయకులను అలనాటి స్నేహితులు, ఇరుగు పొరుగు వారు వచ్చి కలిసేందుకు ప్రయారిటీ ఇచ్చారు. దీంతో మావోయిస్టు నేతలను వారి సొంత ప్రాంతాల్లో ఆదరించే సాంప్రాదాయం మొదలైనట్టయింది. గత సంవత్సరం చెన్నూరు సమీపంలోని పారుపెల్లికి చెందిన స్టేట్ కమిటీ మెంబర్ ఆత్రం లచ్చన్న దంపతులు లొంగిపోయిన తరువాత స్వగ్రామానికి వెళ్లారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఘన స్వాగతం పలకడంతో మొదలైన ఆనవాయితీ మిగతా మాజీ నేతల విషయంలోనూ కొనసాగుతుండడం విశేషం.