దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ ఉమ్మడి జిల్లా కేంద్రంగా రవాణా అవుతున్న గ్రానైట్ అక్రమాలపై మరో విభాగం దృష్టి సారించింది. ఇప్పటి వరకూ విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఇచ్చిన అప్రైజల్ రిపోర్ట్ ఆధారంగా పెనాల్టీ వసూలు చేయాలన్న డిమాండ్ వినిపించింది. కానీ తాజాగా మరో విభాగం కూడా రంగంలోకి దిగడంతో ప్రభుత్వానికి రావల్సిన ఆదాయానికి ఎలా గండిపెడుతున్నారో స్పష్టం అవుతోంది. Directorate of GST Intelligence (DGGI) అధికారులు కూడా గ్రానైట్ అక్రమాలపై తవ్వడం మొదలు పెట్టారు. CGST Act సెక్షన్ 132(1)(a)సెక్షన్ 69 కింద ఆసిఫ్ నగర్, కరీంనగర్‌కు చెందిన శ్రీకాంత్ దాసరి అనే వ్యక్తిని అరెస్ట్ చేసి హైదరాబాద్ నాంపల్లి ఆర్థిక నేరాల కోర్టులో హాజరు పరిచారు DGGI అధికారులు. రెండు రోజుల పాటు కరీంనగర్ సమీపంలోని గ్రానైట్ రవాణా చేసే ట్రాన్స్ పోర్టర్లు, గ్రానైట్ వ్యాపారుల వద్ద నిర్వహించిన విస్తృత సోదాలు జరిపారు. ఇందులో M/s Manoj Enterprises అనే డమ్మీ GST అనే సంస్థను నిర్వహిస్తున్న శ్రీకాంత్ దాసరి GST చెల్లించకుండా గ్రానైట్ రాళ్లు, స్లాబులను అక్రమంగా రవాణఆ చేసినట్టుగా అధికారులు గుర్తించారు.
రూ. 100 కోట్లు..!
M/s Manoj Enterprises అనే డమ్మీ సంస్థ పేరిట రూ. 80-100 కోట్ల విలువైన ఈ వే బిల్లులు క్రియేట్ చేసినప్పటికీ జీఎస్టీ రిటర్న్స్ లో మాత్రం వీటి వివరాలను వెల్లడించలేదని అధికారులు గమనించారు. Nil రిటర్న్స్ దాఖలు చేసి పన్ను చెల్లించకపోవడంతో రూ. 16.96 కోట్ల మేర GST ఎగవేసినట్టుగా గుర్తించారు. కరీంనగర్ కు చెందిన పలు గ్రానైట్ ఫ్యాక్టరీలు, ట్రాన్స్ పోర్టర్లను సమన్వయం చేస్తున్న శ్రీకాంత్ దాసరి తన భార్య మొబైల్ నంబర్ ద్వారా నకిలీ ఇన్వాయిసులు, ఈ వే బిల్లులు సృష్టించినట్టుగా DGGI అధికారుల విచారణలో తేలింది. డమ్మీ GST సంస్థ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు తన స్నేహితుడి బ్యాంక్ అకౌంట్ ను లింక్ చేసినట్టుగా అధికారులు తేల్చారు.
ట్విస్ట్ ఇదే…
అయితే DGGI అధికారులు అసలు విషయాన్ని తెలుసుకుని షాక్ అయ్యారు. డమ్మి సంస్థ అయిన M/s Manoj Enterprises మనోజ్ తారా అనే అతన్ని ప్రొపైటర్ గా చూపించినప్పటికీ ఓ సంస్థ అతని పేరిట రిజిస్టర్ అయి ఉన్న విషయమే తెలియదని అధికారుల విచారణలో తేలింది. మనోజ్ తారా ఆధార్, PAN కార్డులతో పాటు ఇతర ఆధారాలను గ్రానైట్ సిండికేట్ దుర్వినియోగం చేసినట్టుగా గుర్తించారు. కరీంనగర్ ప్రాంతం నుండి హైదరాబాద్ కు తరలించేందుకు ఇన్వాయిసులు, ఈ వే బిల్లులు లేకుండానే గ్రానైట్ స్లాబులను అక్రమంగా రవాణా చేసేందుకు ఈ సంస్థను సృష్టించినట్టుగా DGGI అధికారులు గుర్తించారు. గ్రానైట్ సిండికేట్ నిర్వహించిన రహస్య సరఫరా నెట్‌వర్క్ ప్రణాళిక నిర్వహణలో తన చురుకైన పాత్ర ఉందని శ్రీకాంత్ దాసరి అంగీకరించడని అధికారులు ప్రకటించారు. ఈ అక్రమ వ్యవహారంలో శ్రీకాంత్ తో పాటు రాజస్థాన్‌కు చెందిన మరికొందరి ప్రమేయం కూడా ఉందని గుర్తించామన్నారు.
స్వాధీనం…
అక్రమంగా రవాణా చేసిన గ్రానైట్ ను DGGI అధికారులు షేర్ లింగంపల్లి, ఘట్ కేసర్ ప్రాంతాల్లోని పలు దుకాణాల్లో స్వాధీనం చేసుకోగా, ప్రజ్ఞాపూర్ పరిసర ప్రాంతంలో గ్రానైట్ స్లాబులను అక్రమంగా తరలిస్తున్న లారీలను కూడా స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని DGGI అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా ఆర్థిక లావాదేవీలు డ్రైవర్ల ద్వారా నగదు చెల్లింపుల ప్రక్రియ కూడా కొనసాగిస్తున్నారని గుర్తించామన్నారు. తాము చేపట్టి ఈ ఆపరేషన్ లో బ్రోకర్లు, గ్రానైట్ మార్కర్లు, గ్రానైట్ ఫ్యాక్టరీలు కలిసి నకిలీ ఈ-వే బిల్లులు, నకిలీ ఇన్వాయిసుల రాకెట్ నడుపుతూ, ప్రభుత్వానికి కోట్ల రూపాయల పన్ను ఎగవేస్తున్నట్టుగా గుర్తించారు. ఈ సోదాలతో కరీంనగర్ నుండి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలకు గ్రానైట్‌ను అక్రమంగా రవాణా చేస్తున్న భారీ నెట్‌వర్క్ బయటపడింది. DGGI హైదరాబాద్ అధికారులు ఈ అక్రమ రవాణా దందాపై దర్యాప్తు చేస్తున్నారు.