ఫోన్ ట్యాపింగ్… ఏసీబీ… ఎక్సైజ్ కేసుల్లో భుజంగరావ్

మళ్లీ జైలుకు అడిషనల్ ఎస్పీ

దిశ దశ, హైదరాబాద్:

ఎస్సై స్థాయి నుండి అడిషనల్ ఎస్పీ అధికారిగా ఎదిగిన ఆయనను కేసులు వెంటాడుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాత్రమే అరెస్ట్ అయిన ఆ పోలీసు అధికారి తాజాగా ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయ్యారు. మరో వైపున ఆయన ఇంట్లో నిబంధనలకు విరుద్దంగా లిక్కర్ బాటిళ్లు లభ్యం కావడంతో ఎక్సైజ్ విభాగం కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది.

భుజంగరావ్…

ఫోన్ ట్యాపింగ్ కేసులో పలువురు పోలీసు అధికారులు అరెస్ట్ అయి జైలు జీవితం గడిపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అడిషనల్ ఎస్పీగా భూపాలపల్లిలో పని చేస్తున్న భుజంగరావును తెలంగాణ పోలీసులు మార్చి 23 2024న అరెస్ట్ చేశారు. ఈ కేసులో బెయిల్ రాకపోవడంతో చాలా కాలం జైళ్లోనే ఉండిపోయిన ఆయనపై తాజాగా అవినీతి నిరోధక శాఖా అధికారులు ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేశారు. బుధవారం ఏకకాలంలో 15 చోట్ల ఏసీబీ అధికారులు దాడులు చేసి భుజంగరావు ఆదాయినికి మించి ఆస్తులు సంపాదించారని నిర్దారించి అరెస్ట్ చేశారు.

ఆస్తులు ఇవే…

నల్గొండ, సూర్యపేట జిల్లాల్లో 27.29 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్ లో 5 ఓపెన్ ప్లాట్లు, హైదరాబాద్ లో 2 ఇండ్లు, హైదరాబాద్ నగరంలో ఓ కమర్షియల్ భవనం, రూ. 3.83 లక్షల నగదు, బ్యాంకు అకౌంట్లలో రూ. 8 లక్షలు, కిలో బంగారు నగలు, మారుతి స్విఫ్ట్, కియా సెల్టోస్ కారు ఉన్నాయని ఏసీబీ అధికారుల దాడుల్లో తేలింది. బుధవారం ఉదయం నుండి ఏసీబీ అధికారులు దాడులు చేసి ఈ లెక్కలు తేల్చారు. అయితే తుంగతుర్తిలోని భుజంగరావు మామా ఇంట్లో కూడా సోదాలు చేసేందుకు ఏసీబీ బృందం వెళ్లినప్పటికీ అక్కడ ఎవరూ లేకపోగా ఇంటికి తాళం వేసి ఉండడంతో వెనుదిరిగింది. ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు గుర్తించిన ఆస్తులు రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం రూ. 5.92 కోట్లు ఉంటుందని ఏసీబీ అధికారులు తెలిపారు. అయితే ఓపెన్ మార్కెట్ లో వీటి విలువు చాలా రెట్లు ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

లిక్కర్ బాటిల్స్…

మరో వైపున భుజంగరావు ఇంట్లో 29 లిక్కర్ బాటిల్స్ కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఎక్సైజ్ శాఖకు అప్పగించినట్టుగా ఏసీబీ వర్గాలు తెలిపాయి. ఎక్సైజ్ అధికారులు కూడా ఈ లిక్కర్ బాటిల్స్ కు సంబంధించిన వివరాలు సేకరించి నిబంధనలకు విరుద్దంగా మద్యం నిలువ ఉంచుకున్నారన్న కేసు కూడా నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. పరిమితికి మించి బాటిల్స్ ఉన్నాయన్న అబియోగంపై భుజంగరావుపై కేసు నమోదు చేస్తారని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఎక్సైజ్ అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

acb caseACB RAIDSACB searchesACB TELANGANATELANGANA ACB
Comments (0)
Add Comment