దిశ దశ, కరీంనగర్:
జిల్లాలో పెద్ద పులి సంచారం నిజమేనని అటవీ శాఖ అధికారులు నిర్దారించారు. పులి సంచరించిన ప్రాంతాల్లో అడుగుల ఆనవాళ్లను సేకరించి పరిశీలించిన తరువాత ఈ ప్రాంతంలో మగ పులి సంచరిస్తున్నట్టుగా అధికారులు ప్రకటించారు. బహుదూర్ ఖాన్ పేట, వెదురుగట్ట పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తోందని అటవీ శాఖ జిల్లా అధికారి బాలమణి వెల్లడించారు. సమీపంలోని మొక్కజొన్న తోటలో పులి షెల్టర్ తీసుకుందని భావిస్తున్నామని సమీప గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. భారీ శబ్దాలు చేయడం, సైలెన్సర్లు మార్పిడి చేసిన వాహనాలను ఈ ప్రాంతంలో నడపడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. పెద్దపులి గందరగోళానికి గురై దాడులకు పాల్పడే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తలు పాటించాలని, పులి సంచరించినట్టయితే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
జాయింట్ ఆపరేషన్…
పెద్దపులి సంచారం విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే పోలీసు, అటవీ శాఖలకు చెందిన అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది. బహుదూర్ ఖాన్ పేట, వెదురుగట్ట పరిసర ప్రాంతాల్లో గస్తీ కఠినతరం చేశారు. పెద్దపులి ఈ ప్రాంతం నుండి వెళ్లిపోయే వరకూ అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించారు.
డ్రోన్లతో సెర్చింగ్…
మొక్కజొన్న తోటలో షెల్టర్ తీసుకున్న పులి గురించి సమగ్రంగా తెలుసుకునేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. డ్రోన్ కెమెరాలను కూడా ఉపయోగించి పులి కదలికలను గుర్తించే పనిలో నిమగ్నం అయ్యారు.
ఎక్కడి నుండి వచ్చిందో..?
ఉన్నట్టుండి పులి కరీంనగర్ శివార్లలో ప్రత్యక్ష్యం కావడం సంచలనంగా మారింది. ఈ పులి ఎక్కడి నుండి వచ్చింది అన్న వివరాలు తెలియాల్సి ఉంది. కీకారణ్యాల్లో ఉండాల్సిన పులి దారి తప్పి ఇటుగా వచ్చి ఉంటుందన్న అంచనా అయితే వేస్తున్నారు. షెల్టర్ కోసం తచ్చాడుతూ ఇటుగా వచ్చి ఉంటుందా..? అన్న విషయంపై కూడా దృష్టి సారించారు. మగ పులి అయినందున ఆడ పులి కోసం గాలిస్తూ దారి తప్పి ఉంటుందా అన్న చర్చ కూడా సాగుతోంది. అయితే ఈ ప్రాంతం నుండి పులి తిరిగి వెల్లిపోయే వరకు మాత్రం హై అలెర్ట్ గా ఉండాలని అధికార వర్గాలు నిర్ణయించాయి.

