ప్రకోపించకు మాతా… ప్రశాంతంగా దీవించు తల్లి…

జగిత్యాలలో భూదేవికి ప్రత్యేక పూజలు…

దిశ దశ, జగిత్యాల:

పంచ భూతాలతో మమేకమై జీవనం సాగించే మనవాళి వాటిని ఆరాధించే సంస్కృతి, సాంప్రాదాయలు అనాదిగా కొనసాగుతోంది. ప్రకృతి వైపరిత్యాలు చోటు చేసుకున్నప్పుడు ఇలాంటి ఆనవాయితిని పాటిస్తుంటారు. ప్రాణకోటికి మూలాధారమైన భూదేవికి ప్రత్యేక పూజలు చేశారు అక్కడి ప్రజలు. జగిత్యాల జిల్లా కేంద్రంలో గురువారం భూమాత శాంతించాలని వేడుకున్నారు. మే 5వ తేదిన ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భూమిలో ప్రకంపనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. రిక్టర్ స్కేల్ పై 3.8గా భూకంప తీవ్రత నమోదు కాగా జగిత్యాల జిల్లాలోని ఓ రెండంతస్తుల భవనం కూడా కదిలింది. భూమి పొరల్లో వచ్చిన మార్పుల వల్లే పకపంనలు చోటు చేసుకున్నాయని సిస్మోలాజికల్ నిపుణులు చెప్తున్నారు. అయితే సాధారణ జనం మాత్రం తమ పూర్వీకుల ఆచరించే విధానాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. జగిత్యాలలో ఇటీవల వచ్చిన భూకంపం మళ్లీ సంభవించకుండా ఉండాలని, భూమాత ప్రకోపాన్ని తగ్గించుకుని ప్రశాంతంగా ఉండాలని కోరుతూ భూదేవికి ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోని శంకులపల్లి వాసులంతా భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా కుటుంబాల్లోని వారంత తల స్నానాలు చేసి ఇండ్ల ముందు కల్లాపి చల్లి, ముగ్గులు వేసి ధూప, దీప నైవైద్యాలు సమర్పించారు. బూరెలు సమర్పించిన తరువాత భూమాతా… ఆగ్రహం చూపించకుండా, అనుగ్రహం చూపించు తల్లి అని వేడుకుంటూ  భక్తిని ప్రదర్శించారు.

జిల్లాలోనూ… 

జిల్లాలోని కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో కూడా బూరెలతో బూదేవికి పూజలు నిర్వహించారు. గ్రామస్తులంతా అనుకూలమైన చోటుకు వెళ్లి చెట్టు సమీపంలో ప్రత్యేకంగా ఓ గుంతను తవ్వి, బూరెలు ప్రసాదంగా పెట్టి పూజలు నిర్వహించారు. గమ పూర్వీకుల ఆచారంలో భాగంగానే ఈ కార్యక్రమం నిర్వహించామని గ్రామస్తులు తెలిపారు. ఇటీవల వచ్చిన భూకంపం మరోసారి రాకుండా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ తంతు నిర్వహించామని తెలిపారు.

You cannot copy content of this page