దిశ దశ, వేములవాడ:
పేదల పాలిట కొంగు బంగారంగా నిలిచే వేములవాడ రాజన్న సామాన్య రైతుకు సంబంధించిన డబ్బులు తన అకౌంట్లో వేసుకుంటున్నాడు. భక్తులు కోరిన వరాలిచ్చే రాజన్న తమ విషయంలో ఎందుకిలా చేస్తున్నాడని వాపోతోందో కుటుంబం. తప్పువరిదైనా ఫలితం మాత్రం ఓ సాధారణ కుటుంబం అనుభవిస్తోంది. సాంకేతిక అందిపుచ్చుకుని సఫలం అవుతున్నామని చెప్తున్న అధికారులకు ఓ ఘటన సవాల్ విసురుతోంది. అన్నింటికి ఆధారంగా మారిన ఆధార్ కార్డు వారి పాలిట శాపంగా మారిపోయింది. వివరాల్లోకి వెల్తే… రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన ఏదుల సత్తమ్మకు సంబంధించిన ఆధార్ కార్డు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ బ్యాంక్ అకౌంట్ కు అనుసంధానం అయింది. దీంతో ఆమెకు వచ్చిన డబ్బులన్ని కూడా రాజన్న ఆలయ అకౌంట్ లో జమ అవుతున్నాయి. బ్యాంకు అధికారులు KYC చేసినప్పుడు జరిగిన పొరపాటో లేక సాంకేతికంగా ఎదురైన సమస్యో అంతు చిక్కడం లేదు కానీ సత్తమ్మ డబ్బులు మాత్రం ఆమె బ్యాంకు ఖాతాలో జమ కావడం లేదు. ఇటీవల సత్తమ్మ పండించిన పత్తిని సీసీఐ కొనుగోలు కేంద్రంలో విక్రయించగా రూ. 1.14 లక్షల డబ్బులు వస్తాయని అధికారులు తెలిపారు. అయితే రైతు బ్యాంకు ఖాతాలో జమ చేసే విధానం అమలు చేస్తుండడంతో సీసీఐ కొనుగోలు కేంద్రంలో విక్రయించినట్టుగా రశీదు తీసుకుని సత్తమ్మ వెళ్లిపోయారు. అయితే తాము విక్రయించిన పత్తికి సంబంధించిన డబ్బులు అకౌంట్ లో జమ కాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆరా తీశారు. సత్తమ్మ ఆధార్ కార్వుతో అనుసంధానం అయి ఉన్న అకౌంట్ వివరాలను సేకరించగా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అకౌంట్ నంబర్ అని గుర్తించారు. అయితే గత కొంతకాలంగా సత్తమ్మకు సంబంధించిన వంట గ్యాస్ సబ్సిడీ డబ్బులు కూడా రాజన్న ఆలయ అకౌంట్ లోనే జమ అవుతున్నాయని గుర్తించడం గమనార్హం. ఈ విషయంపై తమకు న్యాయం చేయాలని ఆలయ ఈఓ రమాదేవిని అభ్యర్థించగా బ్యాంకు అధికారులను కలవాలని సూచించారు. తమకు జరిగిన అన్యాయాన్ని సవరించి తమకు రావల్సిన డబ్బులు తమకు అకౌంట్ లో జమ అయ్యేలా చొరవ తీసుకోవాలని సత్తమ్మ కుటుంబ సభ్యులు సీసీఐ అధికారులను కూడా కోరారు. కష్టపడి పండించిన పత్తి విక్రయించగా వచ్చిన డబ్బులు రాజన్న ఆలయ అకౌంట్ లో జమ కావడంతో సాగు చేసేందుకు వెచ్చించిన ఖర్చులు చేతికి రాకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయం కోసం అప్పులు చేయగా పత్తి అమ్మినప్పటికీ డబ్బులు ఎందుకు చెల్లించడం లేదని అప్పు ఇచ్చిన వారు ప్రశ్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవాదాయ శాఖ, సీసీఐ, బ్యాంకు అధికారులు చొరవ తీసుకుని తమ డబ్బులు తమకు ఇప్పించాలని సత్తమ్మ కుటుంబ సభ్యులో వేడుకుంటున్నారు.


