రావల్సింది ఎంత… వచ్చిందెంత? యూరియా కొరత తీరిలా…

దిశ దశ, హైదరాబాద్:

ఖరీఫ్ సీజన్ కు సరిపడా యూరియా అందించడానికి RFCLలో అవాంతరాలు ఎదురు కావడం తెలంగాణ రైతాంగానికి శాపంగా మారింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరతపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి యూరియా ఎంత రావల్సింది… ఇప్పటికీ ఎంత స్టాక్ వచ్చిందంటే?

వివరాలు ఇలా…

ఈ సీజన్ లో తెలంగాణ రాష్ట్రానికి 8.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇవ్వాలని ఎరువులు రసాయనాల విభాగం లక్ష్యం నిర్దేశించుకుంది. అయితే ఇప్పటి వరకు 5.32 లక్షల యూరియా మాత్రమే సరఫరా కాగా దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను అందించలేకపోయింది. చాలినంత యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఇటీవల కాలంలో యూరియా కొరత కోసం ఈ స్థాయిలో రైతులు ఇబ్బందులు పడిన దాఖలాలు లేవు. కానీ ఈ ఏడాది మాత్రం యూరియా కోసం రైతులు ఎదురు చూపులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతాంగం యూరియా కోసం క్యూ లైన్లలో నిలబడాల్సి వస్తుండడంతో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రత్యామ్నాయం…

తెలంగాణ రాష్ట్రానికి 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాలని కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. దీనివల్ల యూరియా కొరతను కొంతమేర అధిగమించే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కర్ణాటక నుండి 10 వేల 800 మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణాకు రానుండగా కోరమండల్ ఇంటర్నేషనల్ కంపెనీకి ద్వారా మరింత యూరియాను రవాణా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.

RFCL…

రామగుండం ఫెర్టిలైజర్స్ కార్పోరేషన్ లిమిటెడ్ అత్యంత కీలక సమయంలో మొరాయించడం వల్లే యూరియా కొరత తీవ్ర రూపానికి ఓ కారణమని తెలుస్తోంది. అమ్మోనియం పైప్ లైన్ లీకేజీ కారణంగా యూరియా ఉత్పత్తి నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీనివల్ల ఆర్ఎఫ్సీఎల్ లో ఉత్పత్తి నిలిచిపోవడంతో పలు రాష్ట్రాలతో పాటు తెలంగాణకు ఇబ్బందికరంగా మారింది. RFCLలో ఏర్పడిన సాంకేతిక సమస్యను పరిష్కరించే అవకాశం ఇప్పట్లో లేనట్టుగానే అనిపిస్తోంది. దేశంలోని వివధ ప్రాంతాలకు చెందిన నిపుణులు, డెన్మార్క్ కు చెందిన కంపెనీ ప్రతినిధులు క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అవాంతరాన్ని అధిగమించేందుకు అవసరమైన చర్యలు తీసుకునే పనిలో నిమగ్నం అయ్యారు RFCL ఉన్నతాధికారులు. అయితే ఈ నెల చివరి కల్లా ఉత్పత్తి ప్రారంభించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది కాని స్పష్టత మాత్రం రావడం లేదు. ఇప్పటి వరకు RFCL ద్వారా తెలంగాణకు వచ్చిన యూరియా వివరాలు ఇలా ఉన్నాయి. ఏప్రిల్ నెలలో 34 వేల మెట్రిక్ టన్నుల లక్ష్యం నిర్దేశించుకోగా, 39,852.270 మెట్రిక్ టన్నులు సరఫరా చేశారు. మే నెలలో 9,525 మెట్రిక టన్నులు లక్ష్యంగా పెట్టుకోగా 12,130.740 మెట్రిక్ టన్నుల యూరియాను అందించారు. జూన్ నెలలో 30 మెట్రిక్ టన్నులకు గాను 16,543.530 మెట్రిక్ టన్నులు, జులై నెలలో 30,880లకు గాను 14,315.220 మెట్రిక్ టన్నులు, ఆగస్టు నెలలో 65 వేల మెట్రిక్ టన్నులకు 24,632.280 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే సరఫరా అయింది. మొత్తంగా ఈ సీజన్ లో తెలంగాణ రాష్ట్రానికి 1,69,325 మెట్రిక్ టన్నుల యూరియాకు బదులు 1,07,474.040 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే ఆర్ఫీసీఎల్ తెలంగాణాకు సరఫరా చేసింది. RFCLలో ఎదురైన సాంకేతిక సమస్య కారణంగానే యూరియా ఉత్పత్తిపై తీవ్రంగా ప్రభావం పడినట్టుగా స్పష్టం అవుతోంది.