దిశ దశ, కరీంనగర్:
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ట్రస్మా ఎత్తులు ఎవరికి అంతు చిక్కకుండా పోయాయా..? ప్రదాన పార్టీల అభ్యర్థులు తమ ప్రత్యర్థిగా కూడా పరిగణించిన శేఖర్ రావు వ్యూహం పని చేసిందా..? చాపకింద నీరులా ప్రచారం చేసిన ఆయన భారీగా ఓట్లు చీల్చుకునే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ట్రస్మా సభ్యులు. మొదట బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఆశించినప్పటికీ పార్టీ అభ్యర్థిని బరిలో నిలపకపోవడంతో స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసేందుకు కూడా వెనకాడ లేదు శేఖర్ రావు. గతంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా టికెట్ ఆశించినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చివరి నిమషంలో పోటీ నుండి తప్పించడంతో కొంతమేర అపవాదును మూటగట్టుకున్నారు. పరిస్థితుల ప్రభావంతో పోటీ చేయలేకపోయానని శేఖర్ రావు చెప్పుకొచ్చినప్పటికీ ఆయన ప్రత్యర్థులు చేసిన ప్రచారంతో తీరని డ్యామేజ్ అయింది. అయితే ఈ సారి ఎన్నికల్లో కూడా శేఖర్ రావు పోటీ నుండి తప్పుకుంటారని ప్రత్యర్థులు ప్రచారం చేయడంతో తిరిగి తనపై నిందలు మోపుతున్నారన్న విషయాన్ని గుర్తించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను బరిలో నిల్చుని తీరుతానని ఘంటా పథంగా చెప్పిన శేఖర్ రావు లక్ష్యంగా కొంత దుష్ప్రచారం అయితే జరిగింది. ఈ క్రమంలో ఆయన ప్రధాన పోటీ దారుల జాబితాలో లేరని భావించిన అభ్యర్థులు ఆయన వ్యూహాలపై దృష్టి సారించలేకపోయారని ట్రస్మా ప్రతినిధులు అంటున్నారు.
వాదనలు ఇలా…
కరీంనగర్ పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన యాదగిరి శేఖర్ రావు ట్రస్మా సభ్యులందరిని ఏకతాటిపైకి తీసుకరావడంలో సక్సెస్ అయ్యారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ట్రస్మా ప్రతినిధిగా ఆయనను మండలిలోకి పంపించాలన్న సంకల్పంతో పావులు కదిపారు ట్రస్మా నేతలు. దాదాపు 2500 పాఠశాలలు ట్రస్మాలో కొనసాగుతున్నాయని, ఆయా పాఠశాలల యజమానులు, అక్కడ పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ద్వారా మౌత్ టు మౌత్ పబ్లిసిటీ చేయించడంలో తాము సక్సెస్ అయ్యామని చెప్తున్నారు. ట్రస్మా సభ్యులుగా ఉన్న పాఠశాలలు ప్రతి మండలంలో ఉండడం కూడా తమకు లాభించిందని, ఏ పార్టీతో సంబంధం లేకుండా శేఖర్ రావు కోసం పని చేశామని చెప్తున్నారు. ట్రస్మా స్కూల్స్ ద్వారా 50 వేల వరకు, ప్రతినిధుల ప్రచారం ద్వారా 25 నుండి 30 వేల వరకూ శేఖర్ రావుకు ఫస్ట్ ప్రయారిటీ కింద ఓట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రధాన పోటీదారులుగా ఉన్న అభ్యర్థలంతా కూడా పార్టీల భాగస్వామ్యంతో ప్రచారం చేస్తే తనకు మాత్రం ట్రస్మా ప్రతినిధులు జీవం పోశారని వ్యాఖ్యానించారు యాదగిరి శేఖర్ రావు. రెండో ప్రాధాన్యత ఓట్లు కూడా తనకు ఆయా పార్టీల అబ్యర్థులకు ధీటుగానే వేశారని అంచనా వేస్తున్నామని వెల్లడించారు.
అదే నిజమైతే…
ఇప్పటి వరకు కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణల మధ్యే పోటీ సాగిందన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ట్రస్మా ప్రతినిధులు చెప్తున్న గణాంకాల ప్రకారం తమ ప్రతినిధి కూడా టఫ్ ఫైట్ ఇచ్చారని ఘంటాపథంగా చెప్తున్నారు. ఈ లెక్కన యాదగిరి శేఖర్ రావుకు అనుకూలంగా పట్ట భద్రులు ఓట్లు వేస్తే మాత్రం అందరి అంచనాలు తలకిందులు అయ్యే ప్రమాదం లేకపోలేదు. ప్రధాన అభ్యర్థులు ముగ్గురు కూడా గెలుపుపై వ్యక్తం చేస్తున్న ధీమాకు ఫలితాలు వచ్చిన తరువాత చెక్ పెట్టినట్టే అవుతుంది. ట్రస్మా ప్రతినిధులు మాత్రం తమ లక్ష్యం కోసం తీవ్రంగా శ్రమించిన ఫలితం ఖచ్చితంగా ఉంటుందని బల్లగుద్ది చెప్తున్నారు. ఇదే నిజమైతే మాత్రం ట్రస్మా ఇచ్చిన ఝలక్ సంలచనంగా మారే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా బ్యాలెట్ పేపర్లలో దాగి ఉన్న ఫలితాలు వెలువడితే తప్ప వాస్తవాలు తెలిసే అవకాశం లేదు.