కాల్పులు జరిపింది మావోయిస్టులేనా..?
దిశ దశ, దండకారణ్యం:
వాజేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని పెనుగోలు పెద్ద గుట్ట వద్ద రెండు రోజుల క్రితం అసలేం జరిగింది..? గ్రే హౌండ్స్ బలగాలపై దాడులు చేసిందెవరూ..? ఇందులో మావోయిస్టులకూ నష్టం వాటిల్లిందా..?
పెనుగోలుకు 4 కిలోమీటర్ల దూరంలోని పెద్ద గుట్ట వద్ద సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్న తెలంగాణ గ్రేహౌండ్స్ బలగాలపై ఒక్క సారిగా కాల్పులు మొదలయ్యాయి. ఇతర కమెండోలు తేరుకునేలోగానే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే గురువారం వేకువ జామున జరిగిన ఈ ఘటనలో గ్రేహౌండ్స్ కమెండోలు ముగ్గురు మృత్యువాత పడగా, ఆర్ఎస్ఐ ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మొదట మందుపాతర పేల్చారని, ఆ తరువాత ఎదురు కాల్పులు జరిగాయని ప్రచారం జరిగింది. చత్తీస్ గడ్ వైపు నుండి కూంబింగ్ చేసుకుంటూ వచ్చిన బలగాలకు, తెలంగాణ గ్రేహౌండ్స్ కమెండోలకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడడంతో క్రాస్ ఫైరింగ్ జరిగి ఉంటుందన్న ప్రచారం జరిగింది. కానీ వాస్తవంగా అక్కడ జరిగింది మాత్రం మావోయిస్టులకు పోలీసులకు మధ్యే ఎదురు కాల్పులేనని తెలుస్తోంది. గ్రేహౌండ్స్ బలగాలు సెర్చింగ్ చేస్తుండగా షెల్టర్ తీసుకున్న మావోయిస్టులు కాల్పులకు పాల్పడ్డరని స్పష్టమవుతోంది.
PLGA ప్లాటూన్..?
గ్రేహౌండ్స్ బలగాలపై కాల్పులకు పాల్పడింది పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(PLGA)కి చెందిన ప్లాటూన్ సభ్యులుగా అనుమానిస్తున్నారు. ఫైరింగ్ జరిపిన వారిలో కొంతమంది మహిళలు కూడా ఉన్నారని వారంతా ఏక కాలంలో కాల్పులు జరపడంతోనే గ్రేహౌండ్స్ కమెండోలు ఊహించని విధంగా నష్టపోయారు. అయితే మావోయిస్టుల వైపు నుండి కాల్పులు ప్రారంభం కావడంతో సహచర కమెండోలు కూడా ఎదురు కాల్పులు జరపడంతో మావోయిస్టులు అక్కడి నుండి వెల్లిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు. కూంబింగ్ చేస్తున్న బలగాల సంఖ్య ఎక్కువగా ఉంటుందని భావించే నక్సల్స్ అక్కడి నుండి సేఫ్టీ జోన్ కు తరలి వెల్లిపోయి ఉంటారని తెలుస్తోంది.
ముఖ్య నాయకులా..?
పెద్దగుట్ట విస్తరించిన ప్రాంతం అంతా కూడా చత్తీస్ గడ్ లోని ఊసూర్ డివిజన్ అడవులే. గత 15 రోజులుగా బలగాలు పెద్ద ఎత్తున కర్రె గుట్టలతో పాటు పరిసర ప్రాంతాల్లో నక్సల్స్ కోసం గాలింపు చర్యలు చేపట్టడంతో ఆ ప్రాంతంలో షెల్టర్ తీసుకున్న మావోయిస్టులు పెద్ద గుట్ట వైపునకు వచ్చి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎదురు కాల్పులు జరిగిన పెద్ద గుట్టలకు ప్రాంతానికి, కర్రె గుట్టలకు మధ్య సుమారుగా 20 కిలో మీటర్ల మేర దూరం ఉంటుంది. సాధారణంగా బలగాలు పెద్ద మొత్తంలో గాలింపు చర్యలు చేపడుతున్నప్పుడు మావోయిస్టులు స్వీయ రక్షణ చర్యలకే ప్రాధాన్యత ఇస్తారని తెలుస్తోంది. కర్రె గుట్టల్లో వేల సంఖ్యలో బలగాలు మోహరించినట్టు, తెలంగాణ సరిహద్దుల్లో గాలింపు చర్యలు చేపట్టినట్టుగా బాహటంగానే చర్చ జరుగుతున్న క్రమంలో నక్సల్స్ కాల్పులు జరపడం వెనక బలమైన కారణం ఉంటుందని అనుకుంటున్నారు. ఈ ప్రాంతంలో మావోయిస్టు పార్టీకి చెందిన ముఖ్య నాయకత్వం సంచరిస్తోందని సేఫ్టీ జోన్ ను ఎంచుకుని షెల్టర్లు ఏర్పాటు చేసుకున్నారని తెలుస్తోంది. పార్టీ కీలక నాయకత్వం కోసం బలగాలు గాలింపు చేపట్టి ఉంటాయని తమ ఉనికిని గుర్తించి బలగాలు కాల్పులు జరిపినట్టయితే తీరని నష్టం వాటిల్లుతుందన్న కారణంగానే నక్సల్స్ ముందుగా కాల్పులు జరిపినట్టుగా అంచనా వేస్తున్నారు.
పుకార్లేనా..?
గ్రేహౌండ్స్ కమెండోలు ఎదురు కాల్పులు జరిపినప్పుడు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాద రావు అలియాస్ చంద్రన్న, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు, సికాస ఇంఛార్జీ బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ లతో పాటు మరికొంత మంది మావోయిస్టు పార్టీ నక్సల్స్ చనిపోయారన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. కానీ ఈ ఘటనలో మావోయిస్టు పార్టీకి నష్టం అంతగా జరగనట్టుగా తెలుస్తోంది. ఘటన జరిగి మూడు రోజులు కావస్తున్నా మావోయిస్టు పార్టీకి సంబంధించిన క్యాడర్ చనిపోయినట్టుగా వెలుగులోకి రాకపోవడం గమనార్హం. ఒక వేళ మావోయిస్టు పార్టీ నేతలు చనిపోయినట్టయితే ఇందుకు సంబంధించిన వివరాలను పార్టీ ప్రకటన ద్వారా ఇప్పటికే విడుదల చేసేది. ఊసూరు డివిజన్ ఫారెస్ట్ ఏరియాలోనే కేంద్ర కమిటీకి సంబంధించిన ముఖ్య నాయకులు డెన్ ఏర్పాటు చేసుకున్నారని చత్తీస్ గడ్ పోలీసులకు సమాచారం ఉన్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆ ఏరియాలో కూడా గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టినట్టుగా సమాచారం.