అటవీ ప్రాంతాల్లో ఎకో టూరిజం
మలి దశ ఉద్యమానికి ఊపిరి పోసిన కరీంనగర్
రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి
దిశ దశ, చొప్పదండి:
గోదావరి నది పుష్కరాల నాటికి పరివాహక ప్రాంతంలోని ఆలయాలను అభివృద్ది చేసే బాధ్యత తీసుకుంటానని, అటవీ ప్రాంతాలను ఎకో టూరిజంతో పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దనున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రకటించారు. గురువారం కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ… రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని బాసర నుండి భద్రాచలం వరకు ఉన్న ఆలయాలను అభివృద్ది చేసేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటామన్నారు. టెంపుల్ టూరిజం చేపట్టి గోదావరి పరివాహక ప్రాంత ఆలయాల కోసం నిధులు వెచ్చించనున్నామన్నారు. అటవీ ప్రాంతాల్లో ఎకో టూరిజం అభివృద్దిపై కూడా దృష్టి సారించామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రైతు బంధు పథకం ద్వారా 9 రోజుల్లోనే 9 వేల కోట్ల నిధులు విడుదల చేశామని మునిసిపల్ ఎన్నికల తరువాత మరోసారి రైతు బంధు నిధులు రైతుల అకౌంట్లలో జమ కానున్నాయని ప్రకటించారు.
డంప్ యార్డ్…
మలిదశ ఉద్యమానికి ఊపిరి పోసిన కరీంనగర్ ప్రాంత అభివృద్ది విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని సీఎం స్పష్టం చేశారు. నగరంలోని డంప్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపనున్నామన్నారు. కరీంనగర్, వరంగల్ నగరాల మధ్య డంప్ యార్డ్ ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. కరీంనగర్ శివార్ల మీదుగా రింగ్ రోడ్డు నిర్మాణం జరపనున్నామని దీంతో ఈ ప్రాంత అభివృద్ది చెందనుందన్నారు.

బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే…
మరో వైపున ప్రతిపక్షాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విరుచకపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒకటేనని ఈ కారణంగానే కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ చేయాలని అసెంబ్లీలో తీర్మాణం చేసి పంపినా కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆరు నెలలు గడుస్తున్నా ఈ అంశం గురించి కేంద్ర ప్రభుత్వం నుండి స్పందన రావడం లేదని సీఎం దుయ్యబట్టారు. అలాగే ఫార్మూల ఈ కార్ రేస్ లో ఐఏఎస్ అధికారిని విచారించేందుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్న అభ్యర్థించినా లాభం లేకుండా పోయిందన్నారు. లోకసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అవయవదానం చేసి 8 స్థానాలను బీజేపీకి అప్పగించిందని విమర్శించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తమపై రంకెలు వేయడం కాదని కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేయించి కేసీఆర్ ను బొక్కలో వేయించాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్రానికి బండి, గుండు తెచ్చిందేమీ లేదని ప్రధాని మోడీ ముందు మాట్లాడే ధైర్యం వారికి లేదన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన కేసీఆర్ ఫార్మ్ హౌజ్ లో పడుకున్నాడని, ఆయన సడ్డకుని కొడుకు ఇసుకనే కాకుండా మిడ్ మానేరు ఇండ్లను కూడా వదిలిపెట్టలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మేడారం సమ్మక్క సారలక్క జాతరకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు రాలేదని పేదోళ్ల దేవుళ్లను మొక్కడానికి వారికి నామోషి అవుతుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీసేందుకే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కయి రాజకీయాలు చేస్తున్నాయని సీఎం దుయ్యబట్టారు.

ఎందుకొస్తున్నారు..?
బీజేపీ జాతీయ నాయకులు తెలంగాణకు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గతంలో పాలమూరుకు వచ్చినప్పుడు ప్రదాని మోడీ పాలుమూరు, రంగారెడ్డి ప్రాజెక్టకు జాతీయ హోదా కల్పిస్తామని ప్రకటించారని ఇంతవరకూ దాని ఊసే లేదన్నారు. రాష్ట్రంలో పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఈ విషయాన్ని, మెట్రో రైల్ రెండో విడుత, కాళేశ్వరం విచారణ అంశాల గురించే ఆయన ప్రస్తావించలేదన్నారు. మూసీ ప్రక్షాళన అంశం గురించి కూడా స్పందించలేదని సీఎం వ్యాఖ్యానించారు.

కొండగట్టు అభివృద్ది...
చొప్పదండి నియోజకవర్గంలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయాన్ని అబివృద్ది చేస్తామని ఇందుకు అవసరమైన నిధులు కూడా మంజూరు చేస్తామని సీఎం ప్రకటించారు. చొప్పదండి నియోజకవర్గంలో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలని స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రెండు పేజీల వినతి సమర్పించారని వాటన్నింటిని కూడా మంజూరు చేస్తానన్నారు. మేడిపల్లి సత్యంకు ఉజ్వల భవిష్యత్తు ఉందని ఆయన రాష్ట్ర స్థాయిలో ఎదగాల్సిన నాయకుడని సీఎం కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లు కూడా హాజరయ్యారు.

