దిశ దశ, కరీంనగర్:
మావోయిస్టులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని శాంతి చర్చల కమిటీ చైర్మన్, రిటైర్డ్ జస్టిస్ చంద్ర కుమార్ పిలుపునిచ్చారు. శనివారం కరీంనగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విలువైన ప్రాణం ఎవరిదైనా సరే పోకూడదన్నదే తమ అభిప్రాయమన్నారు. మావోయిస్టులు, పోలీసులు సీజ్ ఫైర్ పాటిస్తూ చర్చల జరిపేందుకు ముందుకు రావాలని సూచించారు. ఈ విషయంలో ఇరు వర్గాలకు తాము సంధానకర్తలుగా వ్యవహరిస్తామని, అన్నింటికన్నా విలువైన మనిషి ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఉందని వ్యాఖ్యానించారు. కర్రె గుట్టల్లో ఎంతో మంది పోలీసులు, మావోయిస్టులు ఇప్పటికే చాలా మంది చనిపోయారని, మానవీయ కోణంలో మావోయిస్టులు, ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పాక్ దాడుల వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు సానుభూతిని ప్రకటించారు జస్టిస్ చంద్ర కుమార్. బీఆర్ఎస్ అదినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మావోయిస్టులతో చర్చలు జరపాలన్నారని, కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపేందుకు సిద్దంగా లేమని ప్రకటించిందంటే మనుషుల ప్రాణాలు పోవాలని కోరుకుంటున్నట్టా అని ప్రశ్నించారు. చర్చలకు అవకాశం లేకపోవడం వల్ల ఇరు వైపులా ప్రాణ నష్టం జరుగుతోందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉందని, పోయిన ప్రాణాలు తిరిగి రావని, చావుల వల్ల సమస్యకు పరిష్కారం కాదన్న విషయాన్ని ప్రభుత్వం, మావోయిస్టులు గుర్తించాల్సిన అవసరం ఉందని శాంతి చర్చల కమిటీ ఛైర్మన్ అభిప్రాయపడ్డారు. భారత్, పాక్ ల మధ్య కాల్పుల విరమణను తాము స్వాగతిస్తున్నామని, ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో దేశ అంతర్గత ఘర్షనలను నివారించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, మావోయిస్టులు బే షరుతుగా చర్చలు జరిపేందుకు ముందుకు రావాలని చంద్ర కుమార్ సూచించారు. ఈ సందర్భంగా మే 14న జరగనున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌరహక్కుల సంఘం బహిరంగ సభకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. కరీంనగర్ ఫిల్మ్ భవన్ లో జరగనున్న ఈ సభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంద కుమారస్వామి, శ్రీపతి రాజగోపాల్, పుల్ల సుచరిత, నారా వినోద్, బొడ్డుపల్లి రవి, గడ్డం సంజీవ్ కుమార్, బి లక్ష్మణ్, యాదవనేని పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.
రాహుల్ తో భేటీ…
మావోయిస్టులతో శాంతి చర్చల అంశం ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచాలని భారత్ బచావో ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లి ఖార్జున ఖర్గేలను కలిశారు. న్యూ డిల్లీకి వెల్లిన బృందం ప్రతినిధులు ఈ మేరకు వినతి పత్రాలు అందించారు. ప్రొఫెసర్ హర గోపాల్, డాక్టర్ ఎంఎఫ్ గోపినాథ్, ప్రొఫెసర్ నందిని సుందర్, క్రాంతి చైతన్య, గాదె ఇన్నయ్యలతో పాటు పలువురు ఉన్నారు.