దిశ దశ, జగిత్యాల:
మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ అంటే కేక్ కట్ చేయడం, హంగూ ఆర్భాటాలతో దర్పం ప్రదర్శించడం ఉన్నత వర్గాలలో కామన్. కానీ దినసరి కూలీలు మ్యారేజ్ డే వేడుకలు జరుపుకున్న తీరు నెటిజన్లను ఫిదా చేస్తోంది. జగిత్యాల జిల్లాలో ఉపాధి కూలీలు అప్పటికప్పుడు మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ చేసిన తీరు గురించి నెట్టింట వైరల్ గా మారింది. జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల, బాలపల్లి గ్రామాలకు చెందిన ఉపాధి కూలీలు పని చేస్తున్నారు. ఈ క్రమంలో పోరండ్లకు చెందిన బుచ్చిరెడ్డి, సత్తమ్మ దంపతుల పెళ్లి రోజని తెలియడంతో అప్పటికప్పుడు వేడుక నిర్వహించారు సహచర కూలీలు.
సహజత్వం…
సమీపంలో ఉన్న ఓ మామిడి తోటలో బుచ్చిరెడ్డి, సత్తమ్మల వివాహ వార్షికోత్సవం ఘనంగా చేపట్టారు. అయితే ఈ సందర్భంగా ఆధునిక పోకడలకు భిన్నంగా సహజత్వం ఉట్టిపడేలా కూలీలు వేడుక జరిపారు. తలంబ్రాలు పోయడం వంటి తంతును కూడా నిర్వహించారు. భాజాభజంత్రీలకు బదులు వారి వద్ద ఉన్న వంటపాత్రలతోనే బ్యాండ్ మేళం బజాయించారు. వివాహ వార్షికోత్సవ వేడుకే అయినా పెళ్లి తంతును మరిపించారు. అతిథులందరికీ మటన్ బగారా, మక్క గుడాలు సిద్ధం చేసి భోజన ఏర్పాట్లు చేశారు. సహచర కూలీలందరూ కట్నకానుకలు కూడా చదివించారు. అనుకోకుండా జరిగిన ఈ మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ కు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

