దిశ దశ కరీంనగర్:
కరీంనగర్ శివారు ప్రాంతాల్లో ఇంకా పులి సంచారం కొనసాగుతూనే ఉంది. నాలుగు రోజుల క్రితం కరీంనగర్ సమీపంలోని బహుదూర్ ఖాన్ పేట, వెదురుగట్ట ప్రాంతంలో పులి ఉనికి బయటపడడంతో అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారి. డీఎఫ్ఓ బాలమణి నేతృత్వంలో అటవీ శాఖ యంత్రాంగం బహుదూర్ ఖాన్ పేట ప్రాంతంలో పులి ఆనవాళ్లపై ఆరా తీసింది. కరీంనగర్ శివార్లలో సంచరిస్తున్నది మగ పులి అని ప్రకటించారు. మంగళవారం సాయంత్రం సమీపంలోని మొక్కజోన్న తోటలోకి వెల్లి తల దాచుకున్నట్టుగా అంచనా వేసిన అధికారులు డ్రోన్ కెమెరాల సహాయంతో దాని ఆచూకి కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అయితే పెద్దపులికి సంబంధించిన ఆధారం ఏమీ లభ్యం కాకపోగా సమీపంలోని గుట్టలోకి వెల్లి షెల్టర్ తీసుకుని ఉంటుందని అంచనా వేశారు. జన సామర్థ్యం లేని సమయంలో పెద్దపల్లి జిల్లా మీదుగా వెల్లిపోయి ఉంటుందని భావించారు. అయితే గ్రామాల్లో పులి సంచారం గురించి ప్రచారం చేస్తూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. దీంతో ఇంకా కరీంనగర్ జిల్లా పరిసర ప్రాంతాల్లోనే పులి సంచారం చేస్తోందని స్పష్టం అవుతోంది. అలాగే గత డిసెంబర్ 28న జూబ్లీనగర్ కు చెందిన రైతు బోగండ రాయుడు పెద్దపులి దాడిలో గేదె చనిపోయిందని ఫిర్యాదు చేశారని దానిని పోస్టు మార్టం చేయాలని పశు వైద్యాధికారికి అటవీ శాఖ అధికారులు లేఖ రాశారు.

ఎక్కడి నుండో..?
కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న పెద్దపులి ఏ అటవీ ప్రాంతం నుండి వచ్చిందోనన్న విషయంపై అధికారులు దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. కరీంనగర్ జిల్లాలో నామ మాత్రంగా ఉన్న అటవీ ప్రాంతంలో పెద్దపులుల ఉనికి ఏ మాత్రం లేదని అటవీ శాఖ రికార్డులు చెప్తున్నాయి. దాదాపు 25 ఏళ్ల క్రితం గుట్టలు విస్తరించి ఉన్న ప్రాంతాల్లో చిరుత పులులు, ఇతర వన్యప్రాణుల ఉనికి వెలుగులోకి వచ్చింది. గంగాధర మండలంలోని గుట్టల్లో విషాహారం తిన్న చిరుత పులులు చనిపోయిన సందర్బాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు పెద్దపులి ఉనికి మాత్రం వెలుగులోకి రాలేదు. గతంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సమీపంలోని నూకలమర్రి సమీపంలో ఇదే విధంగా పులి సంచారం వెలుగులోకి రాగా అది ఆదిలాబాద్ జిల్లా జన్నారం అటవీ ప్రాంతం నుండి వచ్చిందని అటవీ అధికారులు నిర్దారించారు. తాజాగా కరీంనగర్ జిల్లాలో తిరుగుతున్న పులి కవ్వాల్ అభయారణ్యం నుండి వచ్చిందా లేక… మహారాష్ట్ర అటవీ ప్రాంతం నుండి వచ్చిందా తెలియరావడం లేదు. అయితే కరీంనగర్ జిల్లాలో పులి సంచారం వెలుగులోకి వచ్చే ముందు మాత్రం మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో మాత్రం పులి తిరిగినట్టుగా ప్రచారం జరిగింది. ఏది ఏమైనా పెద్దపల్లి కరీంనగర్ సమీపంలోనే తచ్చాడుతుండడంతో ప్రజలు మాత్రం భయాందోళనలకు గురవుతున్నారు.

