దిశ దశ, జగిత్యాల:
తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా పూజలందుకున్న గణనాథుల నిమజ్జనం కోసం జగిత్యాల పోలీసులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. శోభాయాత్రతో పాటు నిమజ్జనం జరిగే ప్రాంతంలో ప్రతిమలను త్వరితగతిన పంపించేందుకు పోలీసులతో పాటు థర్డ్ జెండర్స్ చే సేవలు చేయిస్తున్నారు. పట్టణంలోని పలు వీధుల గుండా శోభాయాత్రంగా తరలలి వెలుతున్న ప్రతిమలను వీలైనంత తొందరగా నిమజ్జనం చేసేందుకు చింతకుంట వద్ద హిజ్రాలను వాలంటీర్లుగా ఉపయోగించుకుంటున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో నిమగ్నం అయిన క్రమంలో ప్రతిమల నిమజ్జనం ఆలస్యం జరగకుండా ఉండడంతో పాటు అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా ఉండేందుకు థర్డ్ జెండర్స్ ను వాలంటీర్లుగా నియమించారు జగిత్యాల పోలీసులు. జగిత్యాల టౌన్ సీఐ కరుణాకర్ సరికొత్తగా ఆలోచించి ఈ సారి గణేష్ నిమజ్జనంలో థర్డ్ జెండక్స్ సేవలు వినియోగించాలని భావించారు. శుక్రవారం మద్యాహ్నం నుండి సేవలు అందిస్తున్న థర్డ్ జెండర్స్ నిర్విఘ్నంగా విఘ్నేశ్వరుని నిమజ్జనోత్సవం జరిగేందుకు తమవంతుగా బాధ్యతలు అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లో థర్డ్ జెండర్స్ చే ట్రాఫిక్ క్రమబద్దీరణ కోసం ఉపయోగించుకుంటుంటే జగిత్యాల పోలీసులు గణేష్ నిమజ్జనం కోసం వాలంటీర్లుగా నియమించడం గమనార్హం. పోలీసులతో కలిసి సేవలందిస్తున్న థర్డ్ జెండర్స్ అందిస్తున్న సేవలను చూసిన స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తొలిసారిగా తీసుకున్న ఈ నిర్ణయం మేరకు దాదాపు 10 మంది థర్డ్ జెండర్స్ సేవలు వినియోగించుకుంటున్నామని సీఐ తెలిపారు.


