దిశ దశ, కరీంనగర్:
తిమ్మాపూర్ మండలంలోని అంగారిక టౌన్ షిప్ అభివృద్దే లక్ష్యంగా ప్రణాళికలు తయారు చేశామని శాతవాహన అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ఛైర్మన్ కోమటి రెడ్డి నరేందర్ రెడ్డి వెల్లడించారు. శనివారం అంగారిక టౌన్ షిప్ నివాసులు ఆయనను కలిసి కాలనీ అభివృద్ది కోసం నిధులు వెచ్చించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ విక్రయించిన ప్లాట్ల ద్వారా రూ. 150 కోట్లు ప్రభుత్వ ఖజానాలో జమ అయ్యాయని ఆ నిధులతో టౌన్ షిప్ అభివృద్ది చేయకుండా దారి మళ్లించారన్నారు. అయితే నూ. 2 కోట్లతో ఫార్మేషన్ రోడ్లు వేశామని, రూ. 20 కోట్లు కెటాయించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. టౌన్ షిప్ లో విక్రయించేందుకు ఉన్న 32 ప్లాట్లను అమ్మగా వచ్చిన నిధులచే టౌన్ షిప్ అభివృద్ది చేయాలని జిల్లా కలెక్టర్ ద్వారా హౌజింగ్ విభాగానికి ప్రతిపాదనలు పంపించినట్టు వెల్లడించారు.
నిరసన…
ప్రభుత్వం ఏర్పాటు చేసిన టౌన్ షిప్ ద్వారా ప్లాట్లు కొనుగోలు చేసినప్పటికీ తమకు సౌకర్యాలకు కల్పించడం లేదని టౌన్ షిప్ వాసులు నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టి అంగారిక టౌన్ షిప్ అభివృద్దిపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. వేలం ద్వారా ప్లాట్లు విక్రయించిన ప్రభుత్వం సౌకర్యాలను కల్పించడంలో మాత్రం విఫలం అయిందని మండి పడ్డారు. వెంటనే నిధులు వెచ్చించి అంగారికా టౌన్ షిప్ ను అభివృద్ది చేయాలని డిమాండ్ చేశారు.

