కాంగ్రెస్, బీజేపీ నేతల సవాళ్లు… కామారెడ్డిలో ఉద్రిక్తత…

దిశ దశ, కామారెడ్డి:

కామారెడ్డిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాలేజీ భూమి విషయంలో బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్ల నేపథ్యంలో అట్టుడికిపోతోంది. పరిస్థితిని అంచనా వేసిన పోలీసులు శనివారం ఉదయం నుండి సెక్షన్ 163 అమలు చేస్తున్నామని ప్రకటించారు. అంతేకాకుండా భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. ప్రభుత్వ కాలేజీ, సరస్వతి శిశు మందిర్, ఎమ్మెల్యే ఇళ్లు, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ప్రత్యేకంగా పోలీసులు బందోబస్తు చేపట్టారు. ప్రభుత్వ కాలేజీ భూమి విషయంలో ఇరు పార్టీల నాయకుల మధ్య మాటల యుద్దం చోటు చేసుకోవడంతో శనివారం సరస్వతి శిశు మందిర్ వద్దకు బహిరంగ చర్చకు రావాలని, తాను ఆధారాలతో వస్తానని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి సవాల్ విసిరారు. కాంగ్రెస్ నాయకులు కూడా తాము సిద్దంగా ఉన్నామని ప్రకటించారు. శనివారం చర్చ జరగనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించేందుకు చేరుకోగా బీజేపీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య తోపులాట జరగగా పోలీసులు ఇరు పార్టీల వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ కాంగ్రెస్ నాయకుని కారు అద్దాలను ధ్వంసం చేయడం, కారును నెట్టేశారు. జిల్లా ఎస్సీ రాజేశ్ చంద్ర రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య నెలకొన్న యుద్ద వాతావరణంతో కామారెడ్డి జిల్లా కేంద్రం అట్టుడికిపోతోంది. కాంగ్రెస్ పార్టీ నాయకులను పలువురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు.

40 ఏళ్ల ఇష్యూ…

కామారెడ్డి ప్రభుత్వ కాలేజీ స్థలంపై దాదాపు 40 ఏళ్లుగా ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. అప్పటి నుండి కూడా ఈ భూమి విషయంలో రచ్చ రచ్చ సాగుతూనే ఉంది. కోర్టులో విచారణ కూడా కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. మునిసిపల్ ఎన్నికల వరకూ ప్రశాంత వాతావరణం ఉండగా ఫలితాల తరువాత కాలేజీ భూమి విషయంపై ఇరు పార్టీల నాయకులు విమర్శలు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.