ఆశీర్వాద సభ కోసం గోడ కూల్చివేత..!

దిశ దశ, జగిత్యాల:

ప్రజా ఆశీర్వాద సభ కోసం మినీ స్టేడియం గోడలు కూలిపోయాయి. సభకు హాజరయ్యేందుకు వచ్చే ప్రజల కోసం ప్రత్యేకంగా ద్వారాలు తెరిచారు. జగిత్యాలలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అధినేత కేసీఆర్ హాజరు కానున్న ఈ వేదికపై మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి గులాభి కండువా కప్పుకోనున్నారు. ఈ కార్యక్రమం సక్సెస్ చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గాలకు ఇంఛార్జీలను కూడా నియమించింది. జీవన్ రెడ్డి కూడా ఊరు వాడా కలియ తిరుగుతూ సభ సక్సెస్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే జగిత్యాల జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన ఈ బహిరంగ సభకు వచ్చే ప్రజల కోసం ఏకంగా కంపౌండ్ వాల్ నే కూల్చేశారు. స్టేడియం చుట్టూ ఉన్న కంపౌండ్ వాల్ ను కూల్చివేసి ద్వారాలు ఏర్పాటు చేస్తున్నారు. ధర్మారం బస్ షెల్టర్ గోడలను కూడా కూల్చివేయడం చర్చనీయాంశంగా మారింది.

కట్టిస్తారట…

బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఈ కార్యక్రమం తరువాత కూల్చివేసిన చోట మళ్లీ నిర్మాణం జరిపి అధికారులకు అప్పగిస్తామని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. స్పోర్ట్స్ విభాగంపై ఆర్థిక భారం పడకుండా చూసుకుంటామని కూడా చెప్తున్నారు. అయితే కంపౌండ్ వాల్ కూల్చివేత కోసం అనుమతులు ఎలా ఇచ్చారన్న తర్జనభర్జనలు స్థానికంగా సాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ పరిధిలో ఉండే స్టేడియంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా అనుమతులు తీసుకోవల్సి ఉంటుందని తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న ప్రజా ఆశీర్వాద సభ కోసం మినీ స్టేడియం కంపౌండ్ వాల్ కూల్చివేసేందుకు పర్మిషన్ ఎవరు ఇచ్చారోనన్న విషయంపై మాత్రం స్పష్టత లేకుండా పోయింది.

పటిష్టత..?

మినీ స్టేడియం కంపౌండ్ వాల్ ను పలు చోట్ల కూల్చి వేయడం వల్ల దాని పటిష్టత దెబ్బతింటుందని అంటున్నారు. సభకు హాజరయ్యే ప్రజల రాకపోకల కోసం కూల్చివేసిన స్టేడియం గోడను తిరిగి నిర్మించినప్పటికీ తొలిసారి నిర్మించినంతగా గోడ పటిష్టంగా ఉండదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా బీఆర్ఎస్ బహిరంగ సభ కోసం కంపౌండ్ వాల్ ను పలు చోట్ల కూల్చివేసిన తీరుపై స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.