దిశ దశ, చిగురుమామిడి:
పట్టు మని పది వేల మంది కూడా లేని ఆ గ్రామంలో పదుల సంఖ్యలో బెల్టు షాపులు… విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగిస్తున్న తీరుకు ఈ ఘటన తార్కాణం. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి ప్రభుత్వ పాఠశాలలో రెండు రోజుల క్రితం చోటు చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. 8వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు మద్యాహ్న భోజనం తరువాత బెల్టుషాపుకు వెల్లి మద్యం, కూల్ డ్రింక్ కొనుగోలు చేసుకుని తరగతి గదిలోనే మద్యం తాగిన ఘటన విస్మయానికి గురి చేసింది. అయితే బెల్టుషాపులకు వెళ్లిన మైనర్లకు లిక్కర్ విక్రయించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. తరగతి గదికి చేరుకున్న విద్యార్థులు మద్యంలో కూల్ డ్రింక్ కలుపుకుని తాగుతున్న క్రమంలో తరగతి గదికి టీచర్ రావడంతో హడావుడిగా మద్యం బాటిళ్లను తమ బ్యాగుల్లో దాచి పెట్టారు. అయితే మద్యం లీక్ కావడంతో క్లాస్ రూంలో వాసన రావడంతో ఏంటా అని అరా తీస్తే లిక్కర్ తీసుకొచ్చిన విషయం వెలుగులోకి వచ్చింది.
ఎక్సైజ్ దాడులు…
తరగతి గదిలో మద్యం లభ్యం అయిన విషయం వెలుగులోకి రాగానే విద్యార్థులకు లిక్కర్ విక్రయించిన బెల్ట్ షాపుతో పాటు మరిన్ని షాపులపై ఎక్సైజ్ అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేశారు. వాస్తవంగా గ్రామంలో పెద్ద సంఖ్యలో బెల్టు షాపులు నడుస్తున్నాయని, ప్రభుత్వ పాఠశాల పరిసర ప్రాంతాల్లో కూడా కొనసాగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందుర్తిలోని అన్ని బెల్టు షాపులపై దాడులు చేయకపోవడంతో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతాయన్న ఆందోళన స్థానికంగా వ్యక్తం అవుతోంది.
కమిటీ సమావేశం…
క్లాస్ రూంలో లిక్కర్ లభ్యం అయిన తరువాత పాఠశాల పేరెంట్స్, టీచర్స్ కమిటీ సమావేశం అయింది. పాఠశాల నుండి విద్యార్థులు సాయంత్రం వరకూ బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించింది. పాఠశాల గేట్లకు తాళం వేసి ఉంచాలని సాయంత్రం వరకూ స్టూడెంట్స్ బటయకు వెళ్లకుండా కఠినంగా వ్యవహరించాలని సమావేశం నిర్ణయించింది. విద్యార్థులు బయటకు వెళ్లాలంటే వారి పేరెంట్స్ లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వడంతో పాటు ఇందుకు సంబంధించిన రిజిస్టర్ కూడా మెయింటెన్ చేయనున్నారు. అలాగే తల్లిదండ్రులు కూడా విద్యార్థులకు డబ్బులు ఇవ్వకుండా వారికి అవసరమైన స్టేషనరీ, ప్రింట్ వంటివి వారే కొనుగోలు చేసి ఇవ్వాలని సమావేశం కోరింది.

