దిశ దశ, గంగాధర:
భూగర్భ గనులు విస్తరించి ఉన్న కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో పేలుడు పదార్థాల అక్రమ రవాణాకు నియంత్రణ లేకుండా పోతోంది. పకడ్భందీ రక్షణ చర్యలు తీసుకుని, అనుమతులు పొంది తరలించాల్సిన మందుగుండు సామాగ్రిని సాధారణ ఆటోల్లో తరలించడం సంచలనంగా మారింది. గురువారం కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో జరిగిన ప్రమాదంతో అసలు గుట్టు రట్టయింది. సంఘటనా వివరాల్లోకి వెల్తే… గంగాధర మండలం మధురానగర్ వద్ద ఆటో, ఆర్టీసీ బస్సు డీ కొన్నాయి. కరీంనగర్ నుండి జగిత్యాల వైపునకు వెల్తున్న TG-02-T-1770 ఆర్టీసీ బస్సు, జగిత్యాల నుండి కరీంనగర్ వైపునకు వెల్తున్న ఆటో మధురానగర్ వద్ద ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో డ్యామేజ్ అయిన ఆటోను కూడా పట్టించుకోకుండా డ్రైవర్ అందులోని రెండు బాక్సులను తీసి పక్కనే ఉన్న మురుగు కాలవలో పడేశాడు. అనుమానం వచ్చిన స్థానికులు అతన్ని ప్రశ్నించడంతో అక్కడి నుండి పరార్ అయ్యాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టాగా 600 జిలిటెన్ స్టిక్స్ ఉన్న బ్యాగులతో పాటు కార్డెక్స్ వైర్ బెండెల్ ఉన్న కార్టన్ ను గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న ఆటో డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
వేర్వేరు నంబర్లు…
అయితే ప్రమాదానికి గురైన ఆటోతో పాటు సమీపంలోని కాలువ నుండి పోలీసులు మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్న తరువాత మరో సంచలన విషయం బయటపడింది. ఆటోకు ఓ వైపు AP-36-TB-5246 నంబర్ వేసి ఉండగా, మరో వైపున AP-36-W-6231 నంబర్ వేసి ఉన్న విషయాన్ని గమనించారు. ఇందులో AP-36-W-6231 నంబర్ ఆర్టీఏ రికార్డుల్లో లేదని గంగాధర పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. వేర్వేరు నంబర్లు వేసుకుని తిరుగుతున్న ఈ ఆటోను తరుచూ మందుగుండు సామాగ్రిని తరలించేందుకు ఉపయోగిస్తున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ కారణంగానే వేర్వేరు నంబర్లు వేసి ఆటోను నడుపుతున్నారని అంచనా వేస్తున్నారు.
స్మగ్లింగ్ కోసమేనా..?
మరో వైపున ఈ ఆటోను అక్రమంగా పేలుడు పదార్థాలు రవాణ చేసేందుకు మాత్రమే ఉపయోగిస్తున్నారా అన్న అనుమానం కూడా వ్యక్తం అవుతోంది. ఎవరికీ అనుమానం రాకుండా ఆటోలో మందుగుండు సామాగ్రిని తరలించేందుకు పక్కాగా స్కెచ్ వేసుకుని ఉంటారని భావిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ బావులను తవ్వేందుకు, ఇతరాత్ర అవసరాలకు వినియోగించేందుకు తరలించే పనిలో నిమగ్నం ఉంటారని తెలుస్తోంది. పేలుడు పదార్థాలను ఓ చోట బారీగా నిలువ ఉంచి వాటిని కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లోని గ్రామాలకు తరలించే ముఠా పనే అయి ఉంటుందని స్థానికంగా చర్చించుకుంటున్నారు. అయితే ఈ వ్యవహారం వెనక మందుగుండు సామాగ్రిని బారీగా సేకరించేందుకు అనుమతులు తీసుకున్న వారి హాస్తం ఉంటుందా లేక నేరుగానే పేలుడు పదార్థాలను స్టాక్ పాయింట్ల వద్దకు తరలించి అక్కడి నుండి గుట్టుగా తరలిస్తున్నారా అన్న విషయంపై పోలీసులు ఆరా తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు ఆటోలో తరలిస్తున్న మందుగుండు సామాగ్రి ప్రమాదవశాత్తు పేలినట్టయితే ప్రాణ, ఆస్థి నష్టం కూడా సంభవించే ప్రమాదం కూడా ఉండేది.