ఎస్పీ, డీఎస్పీ, ఎస్సైలపై తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వండి
నేషనల్ ఎస్సీ కమిషన్ ఆదేశం…
దిశ దశ, హైదరాబాద్:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలోని మద్దులపల్లికి చెందిన చకినారపు రవి అనే యువకుడికి ఒడిషాలోని బడ్మాల్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగం వచ్చింది. అయితే పోలీసు వెరిఫికేషన్ సర్టిఫికెట్ కోసం రవి దరఖాస్తు చేసుకోగా లేని కేసులను ఉన్నట్టుగా వెరిఫికేషన్ సర్టిఫికెట్ లో పేర్కొన్నారని బాధితుడు ఆరోపించారు. రామగుండం కమిషనరేట్ పరిధిలోని చెన్నూరు పోలీస్ స్టేషన్ లో క్రైం నంబర్ 166/2020తో పాటు మొత్తం ఆరు కేసులు ఉన్నాయని కాళేశ్వరం ఎస్ఐ తమాషా రెడ్డి సర్టిఫై చేశారు. అయితే తనపై లేని కేసులు ఉన్నట్టుగా చూపించారని ఆవేదన చెందిన రవి తనకు న్యాయం చేయాలని కాటారం డీఎస్పీ రాంమోహన్ రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరేలను అభ్యర్థించాడు. దీంతో ఒడిషా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో వచ్చిన ఉద్యోగం పోగొట్టుకోవల్సి వచ్చిందని ఆందోళన చెందిన రవి సమాచార హక్కు చట్టం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశాడు. సమాచార హక్కు చట్టంలో రవిపై ఎనిమిది కేసులు ఉన్నాయని పోలీసులు అధికారు రిప్లై ఇచ్చారు. వెరిఫికేషన్ సర్టిఫికెట్ లో ఆరు కేసులు ఉన్నాయని పేర్కొన్న పోలీసులు సమాచార హక్కు చట్టం ద్వారా ఎనిమిది కేసులు ఉన్నట్టుగా పేర్కొనడంతో ఖంగుతిన్న బాధితుడు రవి తనపై లేని కేసులు ఉన్నట్టుగా చూపించి తన ఉపాధిని కోల్పోయేలా చేసిన పోలీసుల తీరును వెలుగులోకి తెచ్చేందుకు మీడియాను ఆశ్రయించాడు. ఈ విషయాన్ని గమనించిన నేషనల్ ఎస్సీ కమిషన్ ఆఫీసర్ ప్రసాద్ సుమోటోగా కేసు నమోదు చేసుకుని రవి నుండి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అయితే గతంలో తాను కాళేశ్వరం ఎస్సై తమాషా రెడ్డిపై ఉన్నతాధికారులకు, నేషనల్ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేసిన విషయాన్ని మనసులో పెట్టుకుని తనపై లేని కేసులు ఉన్నట్టుగా వెరిఫికేషన్ సర్టిఫికెట్ లో పేర్కొన్నాడని రవి ఆందోళన వ్యక్తం చేశాడు.
తప్పు పట్టిన ఎస్సీ కమిషన్…
అయితే చకినారపు రవి చేసుకున్న అభ్యర్థన తరువాత జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే కాళేశ్వరం ఎస్ఐ ఇచ్చిన నివేదిక సరైందనని నమ్మినట్టుగా తెలుస్తోంది. కాటారం డీఎస్పీ రాంమోహన్ రెడ్డి కూడా కాళేశ్వరం ఎస్ఐ తమాషారెడ్డి ఇచ్చిన రిపోర్టు సరైందేనని చెప్పినట్టుగా తెలుస్తోంది. దీంతో ఎస్పీ చకినారపు రవి అభ్యర్థన సరైంది కాదని నిర్ణయించకున్నట్టుగా సమాచారం. నేషనల్ ఎస్సీ కమిషన్ ఫైల్ నంబర్ APCR/SM/TG/2025/287338 ద్వారా ఇచ్చిన నివేదికలో పోలీసు అధికారుల తీరును తప్పు పట్టింది. కమిషన్ అధికారులు పలుమార్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీకి పూర్తి నివేదిక ఇవ్వాలని లేఖ రాయగా ఆయన స్పందించకపోవడంతో ఇందుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఉన్నతాధికారులను కోరారు. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారులు ఇచ్చిన రిపోర్టులో మద్దులపల్లికి చెందిన చకినారపు రవికి ఆ కేసులతో ఏ మాత్రం సంబంధం లేదని, చెన్నూరు స్టేషన్ లో నమోదయిన కేసులో ఉన్న నిందితుడు రవి, చకినారపు రవి కాదని తేల్చి చెప్పడంతో పాటు ఈ కేసు కూడా 2022లోనే క్లోజ్ అయినట్టు స్పష్టం చేశారు. ఈ మేరకు రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా C.NO. 26/PE/C2-CCRB/RGM/2025 లేఖ ద్వారా నేషనల్ ఎస్పీ కమిషన్ కు నివేదిక పంపించారు. రవికి జరిగిన అన్యాయం వల్ల అతను ఉద్యోగం కోల్పోవల్సి వచ్చిందని, చెన్నూరు పోలీస్ స్టేషన్ లో నమోదయిన కేసుతో పాటు కాళేశ్వరం ఠాణాలో క్రైం నంబర్ 29/2017, 90/2020లలో కూడా నిందితునిగా ఉన్నాడని భూపాలపల్లి జిల్లా పోలీసులు నిర్దారించడం సరికాదని పేర్కొంది.
విచారణ చేయిస్తే…
బాధితుడు చకినారపు రవి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే మొదట సమగ్ర విచారణ చేయిస్తే సమస్య పరిష్కారం అయ్యేది కానీ, దళిత యువకుడైన రవి పట్ల వివక్ష చూపారని నేషనల్ ఎస్సీ కమిషన్ అభిప్రాయపడింది. కాటారం డీఎస్సీగా పనిచేసిన రాంమోహన్ రెడ్డి, కాళేశ్వరం ఎస్సై తమాషా రెడ్డిలను ఎస్పీ సమర్థించిన తీరు కూడా సమంజసం కాదని పేర్కొంది. ఐపీఎస్ అధికారులు సమాజంలో న్యాయ నిష్ట, కర్తవ్య నిబద్దతకు ప్రతీకలుగా నిలుస్తారని, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ ఈ విధంగా నడుచుకోలదని నేషనల్ ఎస్పీ కమిషన్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఎస్పీ కిరణ్ ఖరే, అప్పటి కాటారం డీఎస్పీ రాంమోహన్ రెడ్డి, కాళేశ్వరం ఎస్ఐ తమాషా రెడ్డిలపై BNS 3(1)(P)తో పాటు ఇందుకు వర్తించే సెక్షన్లలో కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. చకినారపు రవికి జరిగిన అన్యాయంపై పోలీసు ఉన్నతాధికారులు యాక్షన్ టెకెన్ రిపోర్టును (ATR) 15 రోజుల్లో నేషనల్ ఎస్సీ కమిషన్ కు పంపించాలని కోరింది. ఈ నెల 17న నేషనల్ ఎస్సీ కమిషన్ నుండి శాంతి భద్రతల విబాగం అడిషనల్ డీజీపీకి ఈ మేరకు లేఖ పంపించారు. దీనిని అత్యంత తీవ్రమైన అంశంగా పరిగణించాలని లేనట్టయితే భారత రాజ్యంగంలోని ఆర్టికల్ 338 ప్రకారం నేషనల్ ఎస్సీ కమిషన్ కు ఉన్న సివిల్ కోర్టు అధికారాలను వినియోగించి సమన్లు జారీ చేయాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేసింది. అప్పుడు వ్యక్తిగతంగా కానీ ప్రతినిధి కానీ కమిషన్ ముందు హాజరు కావల్సి ఉంటుందని కూడా వెల్లడించింది.
అడిషనల్ డీజీ భేష్…
శాంతి భద్రతల పర్యవేక్షణ చేస్తున్న అడిషనల్ డీజీపీ ఈ విషయంలో ముఖ్య పాత్ర పోషించారని, ఈ విషయాన్ని సరిదిద్దడంలో తీసుకున్న చొరవ కారణంగా బాధితునికి న్యాయం జరిగినట్టయిందని నేషనల్ ఎస్సీ కమిషన్ అభిప్రాయపడింది. లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ సకాలంలో జోక్యం చేసుకున్న తీరు బావుందని కమిషన్ పేర్కొంది.


