Telangna: ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో దరఖాస్తులు…

దిశ దశ, కరీంనగర్:

ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులను అప్ లోడ్ చేసేందుకు కూడా యంత్రాంగానికి తీరక లేకుండా పోతోందా లేక, సాంకేతికతపై పట్టు లేకుండా పోయిందో తెలియదు కానీ ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఆన్ లైన్ చేయిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రజా సమస్యలను గుర్తించి వారికి కావల్సిన అవసరాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గ్రామ సభలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రజల నుండి తీసుకున్న దరఖాస్తుల్లోని వివరాలను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసినట్టయితే ప్రభుత్వం లబ్దిదారులను ఎంపిక చేసే అవకాశం ఉంది. అయితే గంగాధర మండలంలోని కాసారం గ్రామానికి సంబంధించిన ప్రజా పాలన దరఖాస్తులు ఓ జిరాక్స్ సెంటర్ లో ప్రత్యక్ష్యం అయ్యాయి. నెల రోజుల క్రితం నిర్వహించిన గ్రామ సభల్లో సేకరించిన ఈ దరఖాస్తులు ఆన్ లైన్ చేసేందుకు జిరాక్స్ సెంటర్ నిర్వాహకులు స్థానిక అధికారులు ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. ప్రజల నుండి సేకరించిన వివరాలను ఆన్ లైన్ చేయాలని అత్యంత నమ్మకంగా వ్యవహరించే అదికార యంత్రాంగానికి అప్పగిస్తే వారు మాత్రం ప్రైవేటు వారికి అప్పగించడం ఏంటన్న చర్చ మొదలైంది. జిరాక్స్ సెంటర్ కు వెల్లిన వారు ప్రజా పాలన దరఖాస్తులను గమనించి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులకు వీటిని అప్పగించినట్టయితే బాధ్యత రాహిత్యంగా వ్యవహరించే ప్రమాదం ఉంటుదన్న ఆందోళన కూడా వ్యక్తం అవుతోంది. వివరాలను అప్ లోడ్ చేసేప్పుడు జాగ్రత్తలు పాటించనట్టయితే మరిన్ని లబ్దిదారులు కూడా నష్టపోయే ప్రమాదం ఉంటుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. నెల రోజుల క్రితం ప్రజల నుండి సేకరించిన దరఖాస్తుల వివరాలను ఇప్పటికీ అప్ లోడ్ చేయకపోతే లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ ఎప్పటికి అవుతుందోనని అంటున్న వారూ లేకపోలేదు. 

You cannot copy content of this page