దిశ దశ, కరీంనగర్:
శాతవాహన యూనివర్శిటీ ప్రొఫెసర్, తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కమిషన్ సభ్యురాలు సూరపల్లి సుజాత క్షమాపణలు చెప్పారు. ఆపరేషన్ సింధూర్ పై సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఓ పోస్టుపై వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆర్మీ సాహసాన్ని, దాయాది దేశంలో ఉగ్ర మూకలను కూకటి వేళ్లతో పెకిలించిన అంశంపై వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకూడదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్ఫష్టం చేశాయి. దీంతో ప్రొఫెసర్ సుజాత చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఎదురు దాడి చేయడంతో పాటు బీజేపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. దేశ భక్తిని చాటుకోకుండా ప్రొఫెసర్ సుజాత వ్యవహరించారని ఇటువంటి వారికి ప్రాధాన్యత కల్పించడం ఎంతవరకు సమంజసం అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడం మొదలైంది. మరో వైపున ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఆమె వ్యవహరించిన తీరు సరికాదని కూడా బీజేపీ శ్రేణులు, జాతీయ వాదులు మండిపడ్డారు. మరోవైపున కరీంనగర్ బీజేపీ, ఎబీవీపీ నాయకులు పోలీసులకు చేసిన ఫిర్యాదు చేసి ప్రొఫెసర్ సుజాతపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
క్షమాపణలు చెప్తున్నా: సూరపల్లి సుజాత
ఆపరేషన్ సింధూర్ పై తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్తున్నానని ప్రకటించారు. ప్రొఫెసర్ సుజాత. తానూ ఈ దేశ పౌరురాలిగానే గుర్తించాలని కోరిన ఆమె ప్రధాని, ఆర్మీకి వ్యతిరేకంగా తాను ఈ కామెంట్లు చేయలేదని వెల్లడించారు. హక్కుల నాయకురాలిగా తాను అంతర్జాతీయంగా తిరిగినప్పుడు అక్కడి ప్రజల వేదనను దృష్టిలో పెట్టుకుని యుద్దం జరిగితే ఎలాంటి దయనీయమైన పరిస్థితులు ఉంటాయోనన్న వేదనతో మాత్రమే తానా పోస్టు పెట్టాను తప్ప మరో ఉద్దేశ్యం మాత్రం లేదని సూజత స్పష్టం చేశారు. అయితే ఆపరేషన్ సింధూర్ అనగానే యుద్దం జరుగుతుందేమోనని భావించి ఆ పోస్టు షేర్ చేశాను కానీ బారత ఆర్మీ పాకిస్తాన్ లోని కేవలం ఉగ్రవాదుల షెల్టర్లను మాత్రమే టార్గెట్ చేసుకుందని తెలిసిందన్నారు. ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న తనకు అన్ని విషయాలపై అవగాహన ఉందని, తాను షేర్ చేసిన కామెంట్ తప్పుడు సంకేతాలను పంపిస్తుందని భావించలేదని సుజాత అన్నారు. తాను షేర్ చేసిన పోస్టుతో మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నట్టయితే క్షమాపణలు కోరుతున్నానన్నారు. బాధ్యత పౌరురాలిగా దేశభక్తిని చాటుతాను కానీ వ్యతిరేకత ప్రదర్శించడం తన నైజం కాదని, కేవలం సమాజం పట్ల ఉన్న అవగాహనతో మాత్రమే రాసిందన్నారు. తనకు ఏ సంఘంలో కానీ, ఏ పార్టీలో కానీ సభ్యత్వం లేదని, కేవలం సమాజం పట్ల ఉన్న అవగాహనతో మాత్రమే రాసానని అందరూ అర్థం చేసుకోవాలని కోరారు. కొన్ని సందర్భాలలో వాటి గురించి రాయకూడదని తనకు ఇవ్వాళే అర్థం అయిందని, తరుచూ కామెంట్స్ చేస్తుంటానని అందులో భాగంగానే తాను షేర్ చేసినట్టుగా అర్థం చేసుకోవాలని ప్రొఫెసర్ సుజాత అభ్యర్థించారు. తాను చేసిన పోస్టుపై చేసిన కామెంట్ల తీరు సరికాదని, దేశాన్ని గౌరవించే వాళ్లు ఎవరూ కూడా మహిళలను అంతగా కించపర్చరని, అంతా చెడ్డ వ్యక్తిని అయితే తాను కాదని అన్నారు. సామాజిక కార్యక్రమాలు ఎన్నో నిర్వహించడంతో పాటు తాను చేసిన రచనలను కూడా సామాజిక సృహతో రాసినవేనని వివరించారు. తప్పు చేశానని మీరు అనుకుంటున్నారు కాబట్టి క్షమాపణలు కోరుతున్నాను, తనపై కామెంట్లు చేసిన వారు కూడా ఆలోచించాలని సుజాత కోరారు.