చెక్ పోస్టుల ఏర్పాటు…
ముమ్మరంగా గాలింపు చర్యలు…
దిశ దశ, భూపాలపల్లి:
తెలంగాణ, చత్తీస్ గడ్ రాష్ట్రాల సరిహధ్దుల్లో నాలుగు రోజులుగా పోలీసులు హై అలెర్ట్ గా వ్యవహరిస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గత మూడు నాలుగు రోజులుగా బలగాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టడంతో సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
చెక్ పోస్టులు…
ములుగు, భూపాలపల్లి జిల్లాల్లోని సరిహధ్దు ప్రాంతాల్లో డిస్ట్రిక్ట్ గార్డ్, స్పెషల్ పార్టీ పోలీసులు అప్రమత్తం అయ్యారు. నాలుగు రోజులుగా ఆయా ప్రాంతాల మీదుగా వచ్చి వెల్లే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి వదిలేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా సర్వాయిపేట, కమలాపూర్, గండి కామారం, ములుగు జిల్లాలోని పెద్దాపూర్, కొప్పుగుట్ట, అడ్డగుట్ట తదితర గ్రామాల్లో భారీ ఎత్తున బలగాలను మోహరించారు పోలీసు అధికారులు. భూపాలపల్లి జిల్లా కమలాపూర్ తో పాటు ములుగు జిల్లాలోని సరిహధ్దు గ్రామాల్లో ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది.
అదే కారణమా..?
అయితే నాలుగు రోజుల క్రితం పోలీసులకు మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు కొరియర్లు చిక్కినట్టుగా స్థానికంగా ప్రచారం జరుగుతోంది. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా ములుగు, భూపాలపల్లి జిల్లా సరిహధ్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు షెల్టర్ తీసుకుని ఉన్నారని వారికి రేషన్ సరుకులు ఇచ్చి వస్తున్నారని తెలుసుకున్నారు. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం దాదాపు పది రోజులకు సరిపడా రేషన్ సరుకులు మాత్రమే మావోయిస్టులకు చేరాయని అంచనా వేస్తున్నారు. నిత్యవసరాలు అయిపోయిన తరువాత మావోయిస్టులు షెల్టర్ జోన్ నుండి బయటకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆహారం కోసం ఖచ్చితంగా నక్సల్స్ అడవులు వీడే అవకాశం ఉంటుందన్న అంచనాతోనే ఆ ప్రాంతాన్ని రౌండప్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే మావోయిస్టు పార్టీ నక్సల్స్ ను ఏన్ కౌంటర్ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించుకున్న నేపథ్యంలో వారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడమో లేక లొంగుబాటు చూపించడమో చేసే అవకాశాలే మెండుగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. మరో వైపున మావోయిస్టు పార్టీ పీఎల్జీఏ నాయకుడు బార్సె దేవా లొంగుబాటుకు ముందు కూడా ఇదే విధంగా పోలీసులు సరిహద్దు అడవుల్లో కూంబింగ్ నిర్వహించారు. ఆ తరువాత బార్సె దేవాతో పాటు పలువురు మావోయిస్టు పార్టీ నాయకులు జనజీనవంలో కలిశారు. ఇప్పుడు కూడా ముఖ్య నాయకులు ఎవరైనా బాహ్య ప్రపంచలోకి వస్తున్నారేమోనన్న చర్చ కూడా స్థానికంగా సాగుతోంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే దామోదర్ అలియాస్ చొక్కారావు జనజీవనంలోకి వస్తున్నాడంటూ అటవీ గ్రామాల్లో ప్రచారం సాగుతోంది. గత నాలుగు రోజులుగా భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో కొనసాగుతున్న బలగాల చర్యల గురించి పోలీసు అధికారులు మాత్రం వివరాలు వెల్లడించం లేదు.

