కరీంనగర్ కలెక్టర్ కు వినతుల వెల్లువ…
దిశ దశ, కరీంనగర్:
ప్రజావాణిలో తమ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్న ఆశతో కలెక్టర్ కార్యాలయానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి భారీ సంఖ్యలో జనం వచ్చారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి తమ గోడు వెల్లబోసుకునేందుకు వందలాది మంది తమ ఆడిటోరియం వద్దకు చేరుకున్నారు. ఆడిటోరియం మార్గమంతా కిక్కిరిసిపోయింది. ఉదయం 10 గంటల నుండే తమ బాదలు చెప్పుకునేందుకు జిల్లా నలుమూలల నుండి ప్రజలు వినతులు తీసుకుని వచ్చారు. కలెక్టర్ పమేలా సత్పతికి తమ బాధ చెప్పుకుంటే పరిష్కారం దొరుకుతుందన్న ఆశతో వీరు ఇక్కడకు చేరుకున్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ఈ సారి పెద్ద ఎత్తున జనం రావడం గమనార్హం. గతంలో ఈ స్థాయిలో బాధితులు ప్రజావాణిలో దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన దాఖలాలు అంతగా లేవు. కానీ ఈ రోజు మాత్రం వందలాది మంది కలెక్టరేట్ కు చేరుకోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వీరిలో గతంలో ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్న తమ సమస్య పరిష్కారం కాలేదని మళ్లీ కలెక్టర్ కు చెప్పుకునేందుకు వచ్చిన వారు కూడా ఉన్నారు. సంబంధిత అధికారులు ప్రజావాణి ద్వారా సేకరించిన దరఖాస్తులను పరిష్కరించకపోవడం వల్లే జిల్లా వాసులు కలెక్టర్ కు మరోసారి విన్నవించేందుకు ఆడిటోరియం వద్దకు చేరుకున్నారు.