సివిల్ సప్లై విభాగం తీరుపై విమర్శలు…
ధాన్యం డబ్బులు దారి మళ్లించిన ఘనులు…
దిశ దశ, హైదరాబాద్:
సీఎంఆర్ అప్పగించే విషయంలో ప్రభుత్వంలోని పెద్దల అండదండలతో సివిల్ సప్లై అధికారులు మీనామేషాలు లెక్కించడం వల్లే రూ. వందల కోట్ల విలువైన బియ్యం సర్కారు గోదాములకు చేరుకుండా పోయాయి. ఏళ్లుగా సీఎంఆర్ చెల్లించకున్నా ధాన్యం అప్పగించడం వల్లే రూ. కోట్ల విలువైన బియ్యం దారి మళ్లించి మిల్లర్లు పక్కదారి పట్టించారన్న ఆరోపణలు ఉన్నాయి. సాధారణ మిల్లర్ సీఎంఆర్ చెల్లించనట్టయితే బ్లాకు లిస్టులో పెట్టి మరీ కఠిన చర్యలు తీసుకున్న సివిల్ సప్లై అధికారులు భారీగా ధాన్యం ఎగవేసిన ఘనులకు అండగా నిలవడానికి కారణమేంటన్నదే తేలాల్సిన అవసరం ఉంది. 2021-22 నుండి సీఎంఆర్ ద్వారా సేకరించిన ధాన్యానికి అనుగుణంగా బియ్యాన్ని గోదాములకు తరలించలేదు మిల్లర్లు. ఐదేళ్లుగా డిఫాల్టర్ అయిన మిల్లర్లపై ఎందుకు కనికరం చూపించారన్నదే అంతు చిక్కకుండా పోయింది. సర్కారు నిర్లక్ష్యం కారణంగా మిల్లర్లు మరో దందాలోకి ఈ డబ్బును మళ్లించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి.
రియల్ ఎస్టేట్…
సీఎంఆర్ విషయంలో సర్కారు పట్టించుకోని వైఖరి అవలంబించడం, బియ్యం గోదాములకు చేరుకున్నా పట్టించుకోకపోవడం వల్ల కొంతమంది మిల్లర్లు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా తయారైంది. చాలా మంది మిల్లర్లు సర్కారు డబ్బులతో సరికొత్త వ్యాపారం చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. సీఎంఆర్ బియ్యాన్ని ప్రైవేటు వ్యాపారులకు విక్రయించి ఆ డబ్బుతో రియల్ ఎస్టేట్ తో పాటు ఇతరాత్ర బిజినెస్ లు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఒక వేళ ప్రభుత్వం సీఎంఆర్ విషయంలో కఠినంగా వ్యవహరించినా తాము కొనుగోలు చేసిన ఆస్తులు అమ్మి వడ్డీతో సహా కట్టినా తాము మాత్రం లాభాల్లోనే ఉంటామన్న ధీమాతోనే సరికొత్త దందాకు తెరలేపినట్టుగా తెలుస్తోంది. సివిల్ సప్లై విభాగం వేసే నామ మాత్రపు వడ్డీతో తమకు ఎలాంటి నష్టం ఉండదని అంచనాలు వేసిన కొంత మంది మిల్లర్లు సీఎంఆర్ రైస్ డబ్బులు దర్జాగా దారి మళ్లించినట్టుగా సమాచారం. ఒక వేల క్రిమినల్ కేసులు పెట్టినా తమకేమీ నష్టం ఉండదని బాజాప్తాగానే కొంతమంది మిల్లర్లు చెప్పుకుంటున్నారని తెలుస్తోంది.
పీడీ యాక్ట్…
గత కొన్ని రోజులుగా సీఎంఆర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తూ మిల్లర్లపై కేసులు నమోదు చేస్తోంది. ఇప్పటికే కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేయగా మరికొంత మంది కోసం ఆరా తీస్తున్నారు. ఒకరిద్దరు బడా మిల్లర్ల విషయంలో పోలీసులు చూసీ చూడనట్టుగా వ్యవహరించడంతో ముందస్తు బెయిల్ తెచ్చుకుంటున్నట్టుగా సమాచారం. అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 20 కోట్లకుపైగా బకాయిలు ఉన్న మిల్లర్లపై పీడీ యాక్టులు నమోదు చేయాలని భావిస్తోంది. ఈ కేటగిరీలో 9 మంది మిల్లర్లు ఉన్నట్టుగా సివిల్ సప్లై అధికారులు తేల్చారు. అంతకు తక్కువగా బకాయి పడ్డ మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోనే సరి పెడ్తారని స్పష్టం అవుతోంది. ఇంతకాలం ఉదారంగా వ్యవహరించడానికి కారణమేంటన్నదే అంతు చిక్కకుండా పోతోంది. మొదట్లోనే వీరిపై కఠినంగా వ్యవహరించినట్టయితే ఇంత దూరం వచ్చేది కాదుకదా అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

