పంచాయితీ కార్యదర్శి అదృశ్యం..!

రాజన్న సిరిసిల్లలో ఘటన

దిశ దశ, రాజన్న సిరిసిల్ల:

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంచాయితీ కార్యదర్శి అదృశ్యం సంచలనంగా మారింది. ఓ నాయకుని కారణంగా విధులు నిర్వర్తించలేక పోతున్నాని ఆవేదన వ్యక్తం చేస్తూ తండ్రికి లేఖ రాసి పంపడం చర్చనీయాంశంగా మారింది. సంఘటనా వివరాల్లోకి వెల్తే… జిల్లాలోని తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి గ్రామానికి చెందిన పంచాయితీ కార్యదర్శి అదృశ్యం అయ్యారు. ఓ రాజకీయా పార్టీకి చెందిన నాయకుని కారణంగా తాను విధులు నిర్వర్తించే పరిస్థితి లేకపోవడంతో మనోవేదనకు గురై తాను వెళ్లిపోతున్నానని తన తండ్రికి లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. సోమవారం జిల్లా పంచాయితీ అధికారి, తంగళ్లపల్లి ఎంపీడీఓలకు వాట్సప్ ద్వారా రాజీనామా చేస్తున్నట్టుగా లేఖ పంపించడం కలకలం సృష్టిస్తోంది. లేఖ అందుకున్న పంచాయితీ సెక్రటరీ కుటుంబ సభ్యులు సిరిసిల్ల డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కార్యదర్శి ఆచూకి కోసం ఆరా తీసే పనిలో నిమగ్నం అయ్యారు. అయితే సదరు కార్యదర్శి ఏపీలో ఉన్నట్టుగా స్థానికంగా ప్రచారం జరుగుతోంది. పోలీసు అధికారులు కూడా ఈ విషయాన్ని ధృవీకరించడంతో సెక్రటరీ కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేష్ కు హుటాహుటిన బయలు దేరారు. అయితే సదరు పంచాయితీ కార్యదర్శి తండ్రికి రాసిన లేఖలో ఏ నాయకుని కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నానో కూడా వివరించినట్టుగా తెలుస్తోంది. కానీ లేఖ మాత్రం బయటకు రావడం లేదు. ప్రభుత్వ పథకాల విషయంలోనే నాయకునితో బాధిత కార్యదర్శి విధులు నిర్వర్తించలేని పరిస్థితి ఎదురయిందన్న ప్రచారం అయితే స్థానికంగా సాగుతోంది. కార్యదర్శిని క్షేమంగా సిరిసిల్లకు తరలించిన తరువాత పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.

You cannot copy content of this page