దిశ దశ, జగిత్యాల:
టీడీపీలో ఒకప్పుడు వెలుగు వెలిగిన ఆ నేతలంతా ఒకే గూటికి చేరుతున్నారు. దశాబ్దాల క్రితం ఒకే పార్టీలో పని చేసిన వారంతా తిరిగి ఒకే రాజకీయ పార్టీ తరుపున రాజకీయాలు చేయనున్నారు.
టీడీపీ నుండి…
తెలుగు దేశం పార్టీలో పని చేసిన ఆ ముగ్గురు నాయకులు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కలిసి పనిచేయనున్నారు. సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్న ఈ ముగ్గురు నాయకులు కూడా జగిత్యాలకు చెందిన వారే కావడం విశేషం. టీడీపీ హయాంలో మంత్రులుగా పని చేసిన ఈ ముఖ్య నాయకులు ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో పార్టీలు మారాల్సి వచ్చింది. ముగ్గురు కూడా ప్రత్యర్థులుగా పోటీ చేసి గెలుపోటముల కోసం సవాళ్లు విసురుకున్న వారే. చివరకు వీరు ముగ్గురు కూడా ఒకే పార్టీ జెండా కింద పనిచేయాల్సి వస్తుందని కలలో కూడా ఉహించుకున్నారో లేదో.
ప్రత్యర్థులుగా…
మల్యాల సమితి అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన తాటిపర్తి జీవన్ రెడ్డి ఎన్టీరామారావును విబేధించి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1983 ఎన్నికల్లో జగిత్యాల నుండి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఎక్సైజ్ మంత్రిగా పని చేశారు. 1985 ఎన్నికల నాటికి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో టీడీపీ జి రాజేశం గౌడ్ కు అవకాశం కల్పించింది. అప్పుడు జీవన్ రెడ్డి ఓటమి చవి చూడగా ఆయనపై గెలిచిన జి రాజేశం గౌడ్ న్యాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1994 ఎన్నికల వరకూ జీవన్ రెడ్డికి అనుచరుడిగా ఉన్న ఎల్ రమణ టీడీపీ తరుపున పోటీ చేసి అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. గెలిచిన వెంటనే ఆయన రాష్ట్ర చేనేత, జౌళి శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇక్కడి నుండి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఈ ముగ్గురు నాయకులు కూడా ఎన్టీ రామారావు క్యాబినెట్ లో మంత్రులుగా పని చేయడం స్పెషాలిటీ. జగిత్యాల ఎమ్మెల్యేలుగా ప్రత్యర్థులుగా బరిలో నిలిచిన ఈ ముగ్గురు నేతలు ఇప్పుడు గులాభి కండువా కప్పుకుని ఒకే గూటిలో ఉండబోతున్నారు.
మరో ప్రత్యేకత…
బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్న టి జీవన్ రెడ్డి కరీంనగర్ ఎంపీగా రెండు సార్లు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఉద్యమ నేత కేసీఆర్ పై పోటీ చేసిన జీవన్ రెడ్డి ఇప్పుడు ఆయన నాయకత్వంలోనే పనిచేయనున్నారు. అయితే ఎంపీ కావాలని ప్రయత్నించి జీవన్ రెడ్డి విఫలం కాగా… అనూహ్యంగా జగిత్యాల రాజకీయాల్లోకి వచ్చిన ఎల్ రమణ కరీంనగర్ ఎంపీగా గెలవడం మరో విశేషం. టీడీపీ రాష్ట్ర అధ్యక్షునిగా పని చేసిన ఎల్ రమణ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో చేరి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. టీడీపీలో మంత్రిగా, జడ్పీ ఛైర్మన్ గా పని చేసిన రాజేశం గౌడ్ తెలంగాణ ఆర్థిక సంఘం ఛైర్మన్ గా కూడా పని చేశారు. తాజాగా జీవన్ రెడ్డి కూడా ఇదే పార్టీలో చేరుతుండడంతో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. సెక్రటరీ జనరల్ పదవిని జీవన్ రెడ్డికి కట్టబెట్టాలన్న యోచనలో అధినేత కేసీఆర్ ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా ఒకప్పుడు జగిత్యాలలో ప్రత్యర్థులుగా ఉన్న ముగ్గురు నాయకులు ఇప్పుడు ఒకే పార్టీలో కలిసి తమ గళాన్ని వినిపించనున్నారు.

