దిశ దశ, కరీంనగర్:
నరెడ్ల శ్రీనివాస్… ఈ పేరు వినగానే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని బాధితులంతా ఒక్కసారిగా కన్నీటి పర్యంతం అవుతారు. యూనియన్ సామాన్యుల హక్కుల కోసం పోరాటాలు చేసిన గొప్ప వ్యక్తి. బాధితులకు బాసటగా నిలిచి అక్రమార్కుల భరతం పట్టడంలో ఏ మాత్రం వెనకాడని తీరు ఆయనకే దక్కుతుంది. ఎన్ శ్రీనివాస్ కోవిడ్ కారణంగా మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఆయన విగ్రహాన్ని కరీంనగర్ ఫిలిం సొసైటీ భవన్ లో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిలు ఆవిష్కరించారు.
వినియోగదారుల…
వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించడమే కాకుండా కరీంనగర్ వినియోగదారుల మండలి ఏర్పాటు చేసి బాధితుల పక్షాన పోరాటం చేశారు నరెడ్ల శ్రీనివాస్. కన్జ్యూమర్ రైట్స్ యాక్ట్ పై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. బ్యాంకు అధికారిగా పదవి విరమణ చేసిన తరువాత కూడా బాధితుల పక్షాన పోరాటం చేసేందుకే మొగ్గు చూపారు. రాష్ట్రంలో సంచలనం కల్గించిన ఏఎస్ఐ మోహన్ రెడ్డి అక్రమ వడ్దీ వ్యాపారం విషయంలో బాధితుల పక్షాన నిలబడ్డారు. అధిక వడ్డీలతో అక్రమ ఫైనాన్స్ నడుపుతున్న తీరుపై బాధితులు వెల్లినప్పుడు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయించడంలో ఎన్ శ్రీనివాస్ పాత్ర కీలకం. అప్పుడు పోలీసు అధికారులు సైతం అతనితో పెట్టుకోవడం అవసరమా అని బాధితులను ప్రశ్నించిన సందర్భాలు ఉన్నా కూడా శ్రీనివాస్ మాత్రం బాధితులకు బాసటగా నిలిచారు తప్ప వెనక్కి తగ్గలేదు. స్కూల్ కరస్పాండెంట్ ప్రసాద్ రావు ఆత్మహత్య చేసుకున్న తరువాత అక్రమ ఫైనాన్స్ కు వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు. ఏకంగా ఏఎస్ఐ మోహన్ రెడ్డి బాధితుల సంఘం ఏర్పాటు చేయించిన నిరసనలు చేపట్టడమే కాకుండా న్యాయ పోరాటం చేసేందుకు కూడా ఎన్ శ్రీనివాస్ వెనుకాడలేదు. సాదాసీదాగా కనిపించే శ్రీనివాస్ బాధితుల కోసం ప్రత్యేకంగా ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి వారికి అవసరమైన దరఖాస్తులు కూడా సిద్దం చేసి సంబంధిత శాకల అధికారుల వద్దకు పంపించిన సందర్భాలు కోకొల్లుగా ఉన్నాయి. లోకసత్తా ఉద్యమ సంస్థతో పాటు పలు సంఘాల్లో శ్రీనివాస్ అందించిన చేయూత ఆదర్శప్రాయంగా నిలుస్తోంది.
బొమ్మకల్ భూ దందా…
ఇకపోతే కరీంనగర్ సమీపంలోని బొమ్మకల్ భూ దందా విషయంలో నరెడ్ల శ్రీనివాస్ తనదైన రీతిలో పోరాటం చేశారు. సర్కారు భూములు, చెరువులు, కుంటలు అంతర్థానం కావడంపై ఫిర్యాదులు చేయించారు. బొమ్మకల్ శ్రీనివాస్ బాధితుల సంఘాన్ని కూడా ఏర్పాటు చేసి బాధితుల పక్షాన నిలబడ్డారు. దీంతో అప్పటి అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు అప్పటి జిల్లా యంత్రాంగం భూముల వివరాలను సేకరించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించింది. మిడ్ మానేరు భూసేకరణ అవకతవకల విషయంలోనూ ఆయన జోక్యం చేసుకని అక్రమాలకు చెక్ పెట్టారు. నరెడ్ల శ్రీనివాస్ సామాజిక అంశాలపై స్పందించే మనస్తత్వం కలవారని కరీంనగర్ పరిసర ప్రాంత అంటుంటారు. సమస్య ఉందని వెల్తే చాలు పరిష్కారం చూపించేందుకు ఎంతో చొరవ చూపించే నరెడ్ల శ్రీనివాస్ వద్దకు వేలాది మంది వెల్లి తమ గోడు వెల్లబోసుకునేవారు.
అరుదైన గౌరవం…
కరీంనగర్ ఫిలిం సొసైటీలో కూడా క్రియాశీలక భూమిక పోషించిన ఉద్యమనేత నరెడ్ల శ్రీనివాస్ యొక్క స్పూర్తిని భావితరాలకు అందించేందుకు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఉద్యమాల గడ్డపై జన్మించిన ఉద్యమకారున్ని గుర్తిస్తూ ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో విగ్రహాన్ని ఆవిష్కరించడం విశేషం.