దిశ దశ, దండకారణ్యం:
బస్తర్ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ నుండి విముక్తి కల్పించేందుకు చొరవ తీసుకోవాలని నక్సల్స్ బాధితులు గవర్నర్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులకు వినతి చేశారు. ఈ మేరకు చత్తీస్ గడ్ రాష్ట్ర గవర్నర్ కు వినతి పత్రం పంపించిన బాధితులు ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి, డిప్యూటీ సీఎం, హోం మంత్రి విజయ్ శర్మలను కలిశారు.
బాధితుల వాదన…
నక్సల్స్ రహిత బస్తర్ ప్రాంతంగా తయారు చేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న ఆపరేషన్లను యథావిధిగా కొనసాగించాలని, వీరితో్ పాటు మద్దతుదారులపై ఉపా వంటి కఠినమైన చట్టాలను అమలు చేయాలని బాధితులు తమ వినతి పత్రంలో కోరారు. నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టుల హింసాకాండ, బీభత్సంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, నక్సలిజం కారణంగా వేలాది మంది అమాయక బస్తర్ వాసుల ప్రాణాలు కోల్పోగాచ వందలాది గ్రామాల ప్రజలు నిర్వాసితులు అయ్యారని వివరించారు. లెక్కకు మించిన కుటుంబాలను తమ వారిని కోల్పోయారని, నక్సల్స్ హింస వల్ల సాధారణ జీవనానికి తీవ్ర అంతరాయం కల్గిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నక్సల్స్ బీభత్సం తీవ్రంగా ఉన్నప్పుడు సాధారణ పౌరులు ఇండ్ల నుండి బయటకు వెళ్లాలంటే ప్రమాదకర పరిస్థితులు నెలకొని ఉంటున్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బలవంతంగా పిల్లలను నక్సల్స్ చేర్పించుకుంటున్నారని, యువతకు ఆయుధాలు ఇచ్చి హింసాత్మక చర్యలు పూనుకునే విధంగా ప్రలోభపెడుతున్నారని, నిరసనలు తెలిపిన వారిని దారుణంగా హత్య చేస్తున్నారని బస్తర్ ప్రాంత నక్సల్స్ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న కార్యక్రమాల వల్ల పరిస్థితుల్లో మార్పు చో్టు చేసుకుంటోందని, భద్రతా బలగాల నిరంతర చర్యల మూలంగా బస్తర్ ప్రాంతంలోని మారుమూల ప్రాంతాలు కూడా అభ్యున్నతి వైపు ముందుకు సాగుతున్నాయని వెల్లడించారు. దీని ఫలితంగా బస్తర్ ‘‘బస్తర్ ఒలంపిక్స్’’ ‘‘బస్తర్ పండూమ్’’ వంటి కార్యక్రమాల్లో స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్న విషయాన్ని కూడా గుర్తు చేశారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ది జరుగుతుండడంతో మావోయిస్టు పార్టీ బలహీనపడుతోందని స్పష్టం అవుతోందన్నారు. ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహధ్దు ప్రాంతాల్లోని కర్రె గుట్టలపై భద్రతా బలగాలు ఇటీవల జరిపిన ఆపరేషన్ చేపట్టడం అత్యంత నిర్ణయాత్మకమైన చర్య అని, దీనివల్ల బస్తర్ ప్రాంతం మావోయిస్టుల నుండి శాశ్వత విముక్తి లభించే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. అయితే అత్యంత కీలకమైన ఈ తరుణంలో PUCL, NAPM, CDRO, PUDR తదితర అర్బన్ ఏరియా సంస్థలు స్వయం ప్రకటిత మానవ హక్కుల సంఘాల ప్రతినిధులు, బేలా భాటియా వంటి మేధావులుగా చెప్పుకునే వర్గాలు బస్తర్ లోని సామన్య గిరిజనులను తప్పుదోవ పట్టించి వారిలో నక్సలిజాన్ని నూరిపోస్తున్నారని బాధితులు ఆరోపించారు. తీవ్రవాద భావజాల మద్దతుదారులను తయారు చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను తిప్పికొడుతున్న ఈ సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బస్తర్ ప్రాంతంలో నక్సల్స్ దాడుల్లో మరణించిన అమాయక గ్రామస్థులు, అపహరణకు గురైన పిల్లలు, నిర్వాసితులైన కుటుంబాలు, వారి హింసలో ప్రాణాలు కోల్పోయిన టీచర్లు, ఆరోగ్య కార్యకర్తలపై సానుభూతి చూపని సంస్థలు నేడు లేఖలు రాయడం, మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం విడ్డూరంగా ఉందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నక్సల్స్ బాధితులమంతా కలిసి చేస్తున్న వినతిని దృష్టిలో పెట్టుకున్ని కర్రె గుట్టల్లో చేపట్టిన ఆపరేషన్ ను కొనసాగించాలని అభ్యర్థించారు. ప్రకృతితో ముడిపడి ఉన్న బస్తర్ ప్రాంత వాసుల జీవన విధానంపై ప్రణాళికబద్దమైన దాడి జరుగుతోందని, దానిని అంతం చేయనట్టయితే విముక్తి సాధ్యం కాదని గమనించాలని కోరారు. నిర్ణయాత్మకంగా చేపట్టిన ఆపరేషన్లలో పాల్గొంటున్న బలగాలకు అండగా నిలవాల్సిన ఆవశ్యకత ఉందని, వారిపై ఉపా వంటి కఠినమైన చట్టాలను అమలు చేయాలని నక్సల్స్ బాధితులు ఆ వినతి పత్రంలో గవర్నర్ ను అభ్యర్థించారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి విష్షు దేవ్ సాయి, హోమంత్రి విజయ్ శర్మలను కూడా కలిసిన బాధితులు మావోయిస్టుల చర్యల వల్ల జరిగిన నష్టాన్ని వివరించారు.