దిశ దశ, జగిత్యాల:
దాంపత్య జీవనంలోనూ రాజీ పడి ముందుకు సాగితేనే బంగారు భవిష్యత్తు ఉంటుంది. వైవాహిక బంధంలో వచ్చే విబేధాలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటే ఆదర్శ ప్రాయమైన జీవనం సాగించే అవకాశం ఉంటుంది. అయితే ఇంతకాలం సాధారణ కేసుల్లో మాత్రమే రాజీ కుదర్చుకునేందుకు మాత్రమే ఉపయోగపడిన లోక్ అదాలత్ కార్యక్రమం ఈ సారి రెండు జంటలు దాంపత్య జీవనంలోకి మళ్లీ అడుగుపెట్టేందుకు దోహదపడింది. అత్యంత అరుదైన ఘటనకు వేదికగా నిలిచింది జగిత్యాల జిల్లా కోర్టు. శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో రెండు జంటల మధ్య రాజీ కుదిర్చిన జగిత్యాల జిల్లా జడ్జి రత్న పద్మావతి వారిని కలిపిన తీరు అబ్బురపరిచింది. జిల్లాలోని రాయికల్ మండలం ఇటిక్యాలకు చెందిన వెంకటేశ్, హారిత, జగిత్యాల పట్టణానికి చెందిన ముస్తఫా, షిరిన్ సుల్తానాలు అదనపు కట్నంతో పాటు మెయింటనెన్స్ కేసులు నమోదు చేశారు. ఈ రెండు జంటలకు సంబంధించిన కేసులు కోర్టులో విచారణ దశలో ఉన్నాయి. అయితే వివాహ బంధంతో ఒక్కటైన వీరి మధ్య నెలకొన్న పొరపొచ్ఛాలకు పుల్ స్టాప్ పెట్టే విధంగా జిల్లా జడ్జి ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహించారు. వీరిద్దరు కూడా వైవాహిక జీవితం కొనసాగించేందుకు సుముఖత వ్యక్తం చేయడంతో దంపతులు దండలు మార్చుకున్నారు. లోక్ అదాలత్ సాక్షిగా సాగిన ఈ తంతుతో కోర్టు ఆవరణ అంత చప్పట్లతో మారు మోగింది. ఎంత పెద్ద కలహాలు అయినా రాజీ కుదుర్చుకోవడంతోనే పరిష్కారం దొరుకుతుందని భార్యా భర్తలు కలిసి ఉంటేనే అన్నింటా మంచిదని జడ్జీ సూచించారు.


