దిశ దశ, చొప్పదండి:
అదృష్టం కలిసొస్తే జాక్ పాట్ కొట్టినట్టు… లేదంటే కొద్ది పాటి డబ్బులు పోయినట్టన్న ఉద్దేశ్యంతో లక్కీ డ్రా ద్వారా ఆస్తులు సంపాదించుకోవచ్చని ఆలోచించే వారు బహుపరాక్… సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతున్న వీటిపై అన్ని వివరాలు తెలుసుకున్న తరువాతే ముందడుగు వేయండి. నిబంధనలకు విరుద్దంగా సాగతున్న లక్కీ డ్రాల విషయంలో అప్రమత్తంగా లేనట్టయితే నష్టపోయే ప్రమాదం ఉందన్న విషయం మరిచిపోకండి. కరీంనగర్ జిల్లాలోని పలు వాట్సప్ గ్రూపుల్లో వైరల్ అవుతున్న ఓ పోస్టుపై లోతుగా తెలుసుకుంటే అసలు విషయం బయట పడింది.
వైరల్ పోస్ట్…
కరీంనగర్, చొప్పదండి, గంగాధర, రామడుగుతో పాటు పలు ప్రాంతాల్లోని వాట్సప్ గ్రూపుల్లో ఓ పోస్ట్ షేర్ అవుతోంది. చొప్పదండి మండలం రుక్మాపూర్ లోని చాకుంట ఎక్స్ రోడ్డులోని మెయిన్ రోడ్ బిట్ ఒకటి విక్రయానికి సిద్దంగా ఉ:దని దీనిని లక్కీ డ్రా ద్వారా విక్రయిస్తున్నామని అందులో పేర్కొన్నారు. రూ. 1516 చెల్లించినట్టయితే మొదటి బహుమతిగా 150 గజాల స్థలం, రెండో బహుమతిగా రూ. లక్ష, మూడో బహుమతిగా రూ. 50 వేలు, నాలుగో బహుమతి ఇద్దరికి రూ. 25 వేల చొప్పున ఐదో బహుమతి రూ. 10 వేల చొప్పున 10 మందికి ఇస్తామని వివరించారు. 2800 కూపన్స్ మాత్రమే విక్రయిస్తున్నామని, భూమి గెల్చుకున్న వారే రిజిస్ట్రేషన్ ఖర్చులు భరించాల్సి ఉంటుందని, కరీంనగర్ రైల్వే గేట్ వద్ద ఉన్న రంగినేని గార్డెన్స్ లో, ఈ నెల 25న 11న డ్రా తీయనున్నామని అందులో వివరించారు.
ట్విస్ట్ ఇక్కడే…
అయితే వైరల్ అవుతున్న ఈ పోస్ట్ లో మార్పింగ్ చేసి ఓ కాంటాక్ట్ నంబర్ యాడ్ చేశారు. 8639610704 అనే నంబరు కూడా ఇందులో ఇచ్చారు. అయితే ఈ నంబర్ కు చాలా మంది కాంటాక్ట్ చేస్తే రెస్పాన్స్ ఇవ్వడం లేదని స్థానికంగా ప్రచారం జరిగింది. దీంతో ‘దిశ దశ’ కూడా సదరు నంబర్ కు కాల్ చేయగా మొదట లిఫ్ట్ చేయలేదు. ఆ తరువాత దాదాపు 15 నిమిషాలకు 9951874588 అనే నెంబర్ నుండి రిటర్న్ కాల్ వచ్చింది. ఫలనా నంబర్ కు ఎవరండి కాల్ చేసిందని అడగగా కరీంనగర్ జిల్లా రుక్మాపూర్ భూమి లక్కీడ్రా గురించి అడగడం జరిగింది. అయితే రిటర్న్ కాల్ చేసిన వ్యక్తి తాము ఏపీలోని చింతలపుడికి చెందిన వారమని చెప్పారు. కరీంనగర్ సమీపంలోని రుక్మాపూర్ చాకుంట ఎక్స్ రోడ్ భూమి లక్కీ డ్రా గురించి ఏపీకి చెందిన వారి కాంటాక్ట్ నంబర్ ఇచ్చినట్టుగా దీంతో స్పష్టం అవుతోంది. అయితే కావాలనే ఎవరైనా ఆకతాయిలు మార్ఫింగ్ చేసి ఇలా ప్రచారం చేస్తున్నారా లేక నిర్వాహకులే సంబంధం లేని కాంటాక్ట్ నంబర్ ఇచ్చారా అన్న విషయంపై స్పష్టత లేదు.
చట్టబద్దమేనా..?
అయితే లక్కీ డ్రా విధానమే చట్ట విరుద్దమని పోలీసు అధికారులు చెప్తున్నారు. రియల్ ఎస్టేట్ భూం గణనీయంగా పడిపోయిన నేపథ్యంలో ఆస్తులు విక్రయించుకోవాలనుకున్న వారు లక్కీ డ్రా విధానాన్ని ఎంచుకుంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగి కేసులు కూడా నమోదు చేస్తున్నారు. యాదాద్రి జిల్లాలో, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో లక్కీ డ్రా విధానం ద్వారా ఆస్తులు అమ్ముకునేందుకు ప్రయత్నించారు. అయితే సంబంధిత స్టేషన్ ల పోలీసులు ఎంట్రీ ఇచ్చి లక్కీ డ్రా విషయంలో కఠినంగా వ్యవహరించారు. తాజాగా చొప్పదండి మండలానికి చెందిన భూమి విషయంలో వైరల్ అవుతున్న లక్కీ డ్రా ప్రచార పోస్టులో ఏకంగా ఏపీకి చెందిన వారి కాంటాక్ట్ నంబర్ ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది.

