karimnagar: జలమయమైన కరీంనగర్ రహదారులు…

స్మార్ట్ సిటీలో తీరని కష్టాలు…

దిశ దశ, కరీంనగర్:

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో కరీంనగర్ రోడ్లు జలమయం అయ్యాయి. నగరంలోని ప్రధాన రహదారులు, జ్యోతినగర్ తో పాటు పలు కాలనీలన్ని కూడా వాన నీటి ప్రవాహాంతో నదులను తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. జగిత్యాల రహదారిలోని వర్క్ షాప్ సమీపంలో భారీగా వరద నీరు ప్రవహిస్తుండడంతో ఇబ్బందులు తప్ప లేదు. సిరిసిల్ల రహదారిలోని రాంనగర్ సమీపంలో, ఆర్టీసీ బస్ స్టేషన్ సమీపంలో వర్షపు నీరు ఉధృతంగా ప్రవహించడంతో దాదాపు గంట సేపు వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. వర్షం ఇలాగే కొనసాగితే విపత్కర పరిస్థితులు ఎదుర్కొవల్సి వస్తుందన్న ఆందోళన నగర వాసుల్లో వ్యక్తం అవుతోంది.

గతంలోనూ…

గతంలో కూడా భారీ వర్షాలు పడినప్పుడు నగరంలోని పలు ప్రాంతాల్లోని రోడ్లన్ని జలమయం అయ్యాయి. వరద నీరు దిగువ ప్రాంతానికి చేరేవరకూ ఎక్కడిక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. బల్దియా అధికారులు వర్షాకాలం ఎదురవుతున్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం లేదన్న ఆవేదన నగర వాసుల్లో వ్యక్తం అవుతోంది. తరుచూ వర్షం నీరు రహదారుల మీదుగా ప్రవహిస్తుండడం వల్ల నివాస ప్రాంతాల్లోని వారు బయటకు వెళ్లలేని పరిస్థితులు ఎదురవుతున్నాయి.

డ్రైనేజీ వ్యవస్థ…

మురికి నీరు ప్రవహించేందుకు డ్రైనేజీ వ్యవస్థను బాగు పర్చడంపై ప్రత్యేక చొరవ తీసుకోవలసిన అవసరం ఉంది. వానాకాలనికి ముందు నామమాత్రంగా డ్రైనేజీల్లో సిల్ట్ తొలగించి చేతులు దులుపుకుంటున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే డ్రైనేజీల్లో ప్రవహించాల్సిన వర్ఫపు నీరు రోడ్ల మీదుగా పారుతోందని స్థానికులు అంటున్నారు. బల్దియా అధికారులు భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో వరద నీరు దిగువ ప్రాంతానికి వెల్లేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.