మతి స్థిమితం లేనిదెవరికి..? జగిత్యాలలో దయనీయ దృశ్యం

దిశ దశ, జగిత్యాల:

మతి స్థిమితం లేనిదెవరికి..? మానసిక పరివర్తన చెందాల్సింది ఎవరూ..? మానసిక వికలాంగులు ఎవరూ..? జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటన పలువురిని కలిచి వేసింది. స్థానిక జిల్లా కేంద్ర ఆసుపత్రి ఆవరణలో ఓ మతిస్థిమితం లేని మహిళ సెద తీరుతూ ఉంటోంది. ఆమెను గమనించిన ఆసుపత్రి సిబ్బంది శనివారం ఆవరణ నుండి బయటకు తీసుకొచ్చి పాత బస్ స్టేషన్ లో ఓ పక్కన పడుకోబెట్టి వెల్లిపోయారు. ఆసుపత్రి ఆవరణలోని ఓ చెట్టు కింద సెద తీరుతన్న మతి స్థిమితం లేని మహిళను బయటకు తీసుకొస్తున్నప్పుడు చాలా మంది అక్కడ ఉన్నారు. అయితే ఆ మహిళ లబోదిబోమని అరుస్తుంటే అక్కడే ఉన్న మతి స్థిమితం లేని మరో మహిళ ఆమెను అక్కును చేర్చుకుంది. ఆమెకు చీర కట్టి, టీ తాగించి ఆమెకు సాంత్వన చేకూర్చే ప్రయత్నం చేసింది. అందరి ముందే ఆసుపత్రి సిబ్బంది మహిళను బయటకు తీసుకొచ్చి దించి వెళ్లిపోతున్నా వారించిన వారు ఎవరూ లేరు. మిన్నంటిన ఆ మహిళ రోధనలు పట్టించుకున్న పాపాన కూడా ఎవరూ పోలేదు. కానీ సాటి మహిళగా మానసిక పరిస్థితి అంతగా లేని మరో మహిళ చొరవ తీసుకున్న తీరు ఆదర్శంగా నిలిచింది. మహిళ అన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఆసుపత్రి యంత్రాంగం వ్యవహరించిన తీరు కూడా సరైంది కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ దృశ్యాలకు సంబంధించిన ఫోటోలను స్థానికులు ఒకరు తీసి నెట్టింట వైరల్ చేయడంతో వెలుగులోకి వచ్చింది.

ఆసుపత్రులెందుకు..?

అనారోగ్యానికి గురైన వారికి చికిత్స అందించేందుకు ఏర్పాటు చేసిన దవాఖానల్లో పని చేస్తున్న వారే ఈ విధంగా వ్యవహరిస్తే ఎలా అన్న ప్రశ్నకు సమాధానం లేకుండా పోతోంది. మతి స్థిమితం లేని మహిళకు చికిత్స జరిపేంచేందుకు చొరవ చూపాల్సిన ఆసుపత్రి వర్గాలు తమకేమి పట్టనట్టుగా ఆరుబయటకు దింపి వెల్లిన తీరు బాధ్యతరాహిత్యంగా వ్యవహరించడమే అవుతుంది తప్ప మరోటి అయితే కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. మానసిక పరివర్తన కోసం అందుకు సంబంధించిన ఆసుపత్రికి అయినా పంపిచినా బావుండేందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మతి స్థిమితం లేని మహిళను ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఆసుపత్రికి కానీ వేరే చోట ఉన్న ఆసుపత్రులకు కానీ తరలించినట్టయితే వారికి వైద్యం అందించే అవకాశం ఉంటుంది. కానీ జగిత్యాల జిల్లా కేంద్ర ఆసుపత్రి సిబ్బంది మాత్రం మతి స్థిమితం లేని మహిళ విషయం తమకేమీ పట్టనట్టుగా తమ దవఖాన ఆవరణ నుండి బయటకు పంపించి చేతులు దులుపుకోవడమే విస్మయానికి గురి చేస్తోంది. గతంలో కూడా జగిత్యాల జిల్లా కేంద్ర ఆసుపత్రి యంత్రాంగం వ్యవహరించిన తీరుపై ఆరోపణలు వచ్చాయి. అయినప్పటికీ ఇక్కడ పని చేసే వారిలో మాత్రం పరివర్తన రావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

You cannot copy content of this page