సర్కారుకు కుచ్చుటోపి పెడుతున్నదెవరూ..?

కేంద్రం వద్ద అలా… రాష్ట్రం వద్ద ఇలా…

దిశ దశ, హైదరాబాద్:

సాధారణ జర్నలిస్టు విషయంలో సవాలక్ష నిబంధనలు చేర్చిన తెలంగాణ పౌర సంబంధాల శాఖ పత్రిక యాజమాన్యాల విషయంలో పట్టించుకోని వైఖరి ఎందుకు అవలంభిస్తోంది..? దశాబ్దాలుగా వృత్తికే అంకితమైన వారికి ఫ్రీలాన్స్, వెటరన్ అక్రిడిటేషన్లు జారీ చేసే విషయంలో గతంలో పనిచేసిన పత్రికలకు సంబంధించి నియామకపు ఉత్తర్వులు, రిలీవింగ్ ఆర్డర్లు పొందు పరచాలంటూ కొర్రిలు పెడుతున్న సమాచార శాఖ పత్రికల కేటగిరిల నిర్ధారణకు సంబంధించి నిబంధనలు ఎందుకు పాటించడం లేదు..?
కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతులు పొందిన పత్రికలను ప్రామాణికంగా తీసుకుంటున్న ఐ అండ్ పీఆర్ విభాగం కేంద్రానికి సదరు పత్రికలు
సమర్పిస్తున్న సమాచారాన్ని సేకరించేందుకు చొరవ తీసుకోకపోవడం వెనక దాగి ఉన్న మర్మమేమిటీ..?

కేంద్ర వద్ద ఉన్న డాటా ఇలా…

DAVP వెబ్ సైట్ లో పొందు పర్చిన గణాంకాలకు, రాష్ట్ర సమాచార సంబంధాల శాఖ నిర్ధారించిన బిగ్ , మీడియం న్యూస్ పేపర్ల విభాగాలకు ఏ మాత్రం పొంతన లేకుండా ఉండడమే విచిత్రంగా ఉంది. ఎడిషన్ల వారిగా ఆయా పత్రికల సర్క్యూలేషన్ డాటా పిజిఐఆర్, ఏబీసీల వద్ద బాజాప్తాగా ఉన్నప్పటికీ ఇక్కడి పత్రిక యాజమాన్యాలు బేజాప్తాగా ఇచ్చిన సర్టిఫికెట్లకు తెలంగాణ పౌర సంబంధాల శాఖ అధికారులు ఎలా ఆమోదం తెలిపారన్నదే అంతు చిక్కకుండా పోతోంది. బిగ్, మీడియం, స్మాల్ కేటగిరీల కూర్పుకు సర్క్యూలేషన్ ప్రామాణికం. అయితే రాష్ట్రంలోని పత్రికలు తెలంగాణ ప్రభుత్వానికి చూపిస్తున్న సర్క్యూలేషన్ కు, కేంద్ర ప్రభుత్వ DAVP విభాగానికి చూపిస్తున్న సర్క్యూలేషన్ కు ఏ మాత్రం సంబంధం లేకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. ABC పరిధిలోకి వచ్చే సర్క్యూలేషన్ చూపిస్తున్న తెలంగాణలోని మీడియా సంస్థలు DAVP విభాగం జాబితాలో ప్రధాన పత్రికలుగా ఎందుకు గుర్తింపు కోసం నమోదు చేసుకోవడం లేదన్నదే మిస్టరీగా మారింది. కేంద్ర ప్రభుత్వ వెబ్ సైట్ లో పొందు పర్చిన వివరాలకు తెలంగాణ ఐఅండ్ పీఆర్ విభాగంలోని వివరాలకు నక్కకు నాగలోకానికి మధ్య ఉన్నంత తేడా ఉంది. తెలంగాణ సమాచార శాఖ పొంతన లేకుండా తీసుకుంటున్న ఈ నిర్ణయాల తీరే పలువురిని విస్మయానికి గురి చేస్తోంది.

ఆ సర్టిఫికెట్ ఉందా..?

చాలా మీడియా సంస్థలు తప్పుడు సర్క్యులేషన్ గణాంకాలను తెలంగాణ సమాచార శాఖకు చూపించినప్పుడు వారు నిజంగా ABC పరిధిలోకి వచ్చినట్టయితే అందుకు సంబంధించిన సర్టిఫికెట్ ఎందుకు తీసుకోలేదన్న విషయాన్ని విస్మరించడం వెనక కారణమేంటీ..? సర్క్యూలేషన్ పరంగా చూసుకున్నట్టయితే ABC టీమ్ వచ్చి తనిఖీలు చేసి ధృవీకరించాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వ నిబంధనలు చెప్తున్నాయి. తెలంగాణాలో ముద్రణకు నోచుకోని పత్రికలు, నామ మాత్రంగా ప్రింట్ అవుతున్న పత్రికలను కూడా ABC ,PGRI నిబంధనల పరిధిలోకి సమాచార శాఖ తీసుకువచ్చినట్టు తేటతెల్లం అవుతోంది. కాబట్టి తెలంగాణ పౌర సంబంధాల శాఖ అధికారులు అక్రిడేషన్లను ఇచ్చే ముందు సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

గణాంకాలతో సహా మరో కథనంతో కలుద్దాం…