ఖైదీలకు కంప్యూటర్ శిక్షణ: జైళ్ళ శాఖ డీజీ సౌమ్య మిశ్రా

దిశ దశ, కరీంనగర్:

ఖైదీలను సంస్కరించేందుకు తెలంగాణ జైళ్ల శాఖ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని జైళ్ళ శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా అన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా జైలుకు ఇండియాన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ సీఎస్సార్ ద్వారా రూ. 21 లక్షల విలువ చేసే వింగర్ వాహనం, 10 కంప్యూటర్లు, ఒక జిరాక్స్, ఆగర్ బత్తీల తయారీ యంత్రాలను విరాళంగా ఇచ్చింది. ఈ సందర్భంగా డీజీ సౌమ్య మిశ్రా మాట్లాడుతూ… జైలు జీవితం గడుపుతున్న ఖైదీల సంక్షేమం కోసం ఐఓసీఎల్ ముందుకు రావడం సంతోషకరంగా ఉందన్నారు. కంప్యూటర్ల ద్వారా ఖైదీలకు డిజిటల్ రంగంపై అవగాహన కల్పించేందుకు దోహదపడుతుందన్నారు. ఆలయాల్లో పూజలకు ఉపయోగించిన పువ్వుల ద్వారా ఆగర్ బత్తీలను తయారు చేసే విధానం ఇప్పటికే కరీంనగర్ జైలులో కొనసాగుతోందని, తాజాగా ఐఓసీఎల్ సంస్థ ఇచ్చిన మిషనరీతో ఉత్పత్తిని మరింత పెంచే అవకాశం ఉందన్నారు. దీనివల్ల ఖైదీలకు ఆదాయం మరింత మెరుగు అయ్యే అవకాశం ఉంటుందని జైల్స్ డీజీ అభిప్రాయపడ్డారు. గత 12 ఏళ్లుగా రాష్ట్ర జైళ్ల శాఖతో అనుబంధం పెనవేసుకున్న ఐఓసీఎల్ సంస్థ పెట్రోల్ బంకులను ఏర్పాటు చేసి ఖైదీలకు ఉపాధి కల్పిస్తోందని తెలిపారు. తాజాగా సీఎస్సార్ ఫండ్స్ ద్వారా జైళ్ల శాఖకు వాహనంతో పాటు మిషనరీలను అందించడం వల్ల వారి ఉపాధికి మరింత దోహదపడుతుందని సౌమ్య మిశ్రా అన్నారు. దీనివల్ల ఖైదీల జీవన ప్రమాణాలను మరింత మెరుగు పరిచేందుకు దోహదపడుతుందని, సంస్థ తీసుకున్న ఈ చొరవ వల్ల ఖైదీల కుటుంబాల ఆర్థిక స్థితిగతులను కూడా మార్చివేయనుందన్నారు. ఈ సందర్భంగా జిల్లా జైలులో ఖైదీలకు అందిస్తున్న భోజన వసతి, వైద్య, న్యాయ సేవలు అందిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జైలు సూపరింటిండెంట్ విజయ్ డేనీ, డాక్టర్ కె వేణుగోపాల్, జైలర్లు పి శ్రీనివాస్, యు పర్శురాం, ఏ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ జైలర్లు ఎస్ సుధాకర్ రెడ్డి, ఎల్ రమేష్, ఎస్ అజయ్ చారీ, కరీంనగర్ సౌత్ రీటేల్స్ సేల్స్ ఏరియా మేనేజర్ షఫిక్ తదితరులు పాల్గొన్నారు.