ఆ దేవుడు కరుణిస్తే మన ఎమ్మెల్యేకు మంచి గొప్ప పదవి రావాలి… మంచిర్యాల ఆర్డీఓ

మంచిర్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి ఆకాంక్ష…

దిశ దశ, మంచిర్యాల:

ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు నడుచుకునే తీరుకు పరిపాలనా పరమైన అంశాల్లో నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవల్సిన అధికారుల వ్యవహరించే తీరుకు చాలా భిన్నంగా ఉంటుంది. ప్రజా స్వామ్య వ్యవస్థలో ఐదేళ్ల పాటు అధికారంలో ఉండే నేతలు వేరు… పదవి విరమణ పొందే వరకు బాధ్యతల్లో మెదలాల్సిన ప్రభుత్వ యంత్రాంగం వేరు. అధికారంలో ఉన్న ప్రజా ప్రతినిదులు ఐదేళ్ల కోసారి ప్రజా తీర్పును కోరాల్సి ఉంటుంది. కానీ అధికార యంత్రాంగం మాత్రం పదోన్నతులు పొందుతూ 61 ఏళ్ల వరకు విధి నిర్వహణలోనే తల మునకలు కావల్సి ఉంటుంది. ప్రజా సంక్షేమం కోసం దిశానిర్దేశం చేసే ప్రజా ప్రతినిధులకు ఉన్న అధికారాలకు, అధికార యంత్రాంగానికి ఉండే అధికారాలకు చాలా తేడా ఉంటుంది. అయితే వ్యక్తిగతంగా ప్రజా ప్రతినిధులపై తమ అభిమానాన్ని చాటుకునేందుకు అధికారులు ఇచ్చే ప్రాధాన్యత బాహ్య ప్రపంచానికి తెలియకుండా జరుగుతూ ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో అధికారులు బహిరంగంగానే తమ అభిప్రాయాలను కుండ బద్దలు కొడుతున్న తీరే చర్చకు దారి తీస్తోంది. బీఆర్ఎస్ హయాంలో కలెక్టర్లు సీఎం కాళ్లు మొక్కారన్న అంశంపై జాతీయ స్థాయిలో చర్చకు వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే అప్పటి పాలకులు చెప్పు చేతల్లో వ్యవహరించిన అధికారులు ప్రజా క్షేత్రంలో విమర్శలు ఎదుర్కొన్న సందర్బాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కొంతమంది అధికారులు తమలోని భావాలను పంచుకునేందుకు అధికారికంగా నిర్వహించే వేదికలనే ఆలంబనగా చేసుకుంటున్న తీరు విస్మయానికి గురి చేస్తోంది. తాజాగా మంచిర్యాల జిల్లాలో అక్కడి రెవెన్యూ డివిజనల్ అధికారి సమీక్షా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు నెట్టింట్ వైరల్ అవుతున్నాయి. స్థానిక ఆర్డీఓ శ్రీనివాస రావు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

ఏం అన్నారంటే..?

ఆదివారం మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రసంగించిన ఆర్డీఓ శ్రీనివాస్ రావు వ్యాఖ్యలు అధికార వర్గాల్లో, రాజకీయ పార్టీల్లో సరికొత్త చర్చకు దారి తీశాయి. ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక విషయంలో పారదర్శకత పాటించాలని స్థానిక ఎమ్మెల్యే వివేక్ ఆదేశించారని అదే విధానంతో ముందుకు సాగుతామని వ్యాఖ్యానించారు మంచిర్యాల ఆర్డీఓ శ్రీనివాస రావు. దేవుడు కరుణిస్తే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ మంచి గొప్ప పదవిలో చేరుతారని, వారి ద్వారా ఇంకా కొన్ని స్సెషల్ గా రావాలని కోరుకుంటున్నానని అన్నారు. వారు రావాలని వస్తే నియోజకవర్గానికి మరిన్ని నిధులు వస్తాయని ఆకాంక్షిస్తున్నాని ఆర్డీఓ అన్నారు. నియోజకవర్గ అభివృద్ది గురించి ఎమ్మెల్యే విజన్ ఎలా ఉంది అని వివరించడం కానీ, ఆయన ఉన్నత పదవులు రావాలని ఆకాంక్షిస్తున్నానన్న వ్యాఖ్యలు చేయడం కానీ ఎక్కువగా రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేల అనుచరులు పార్టీ కార్యకర్తలు చెప్తుంటారు. కానీ ఆర్డీఓ స్థాయి అధికారి ఎమ్మెల్యే గొప్ప పదవిలో ఉండాలని కోరుకుంటున్నట్టు రివ్యూ సమావేశంలో బహిరంగంగా ప్రకటించడం చర్చనీయాంశం అయింది. ఆర్డీఓ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండడంతో సరికొత్త చర్చకు దారి తీస్తోంది.

మంచిర్యాల ఆర్డీఓ స్పీచ్ గురించి ఈ కింది లింక్ పై క్లిక్ చేయండి…

You cannot copy content of this page