దిశ దశ, జగిత్యాల:
జిల్లాలోని ధర్మపురి పుష్కర ఘాట్ సమీపంలో లభ్యమైన పల్సర్ బైక్ కరీంగనర్ నగల షోరూంలో దోపిడీకి పాల్పడిన ముఠానే వాడి ఉంటుందని అనుమానిస్తున్నారు. చెట్ల సమీపంలో పడేసి వెళ్లిపోయి ఉంటారని స్పష్టం అవుతోంది. మంగళవారం ఉదయం గుర్తించిన ఈ బైక్ నంబర్ తెలంగాణ రాష్ట్రానికి చెందినదిగా ఉండడంతో దోపిడీ ముఠా వాడింది కాదేమోనని భావించారు. అయితే బైకుకు సంబంధించిన చాసిస్, ఇంజన్ నెంబర్ల ఆదారంగా అది ఢిల్లీకి చెందినదిగా గుర్తించాడంతో అది ఖచ్చితంగా దోపిడీ ముఠా వాడిందేనని భావిస్తున్నారు. నగల షోరూంలో దోపిడీ చేసిన ముఠా సభ్యులు ఐదుగురు తెలుపు, నలుపు రంగు బైకులపై సంచరించారన్న విషయం గుర్తించిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఒక బైక్ ధర్మపురి పుష్కరఘాట్లలో దొరకడంతో మరో బైక్ ఏమై ఉంటుందో తెలుసుకునే పనిలో నిమగ్నం అయ్యారు పోలీసులు.
హైదరాబాద్…
ధర్మపురి వద్ద లభ్యమైన బైక్ నంబర్ TS 09F G6876గా ఉంది. అయితే ఆ నంబర్ హైదరాబాద్ లోని ఓ బెలోనా కారుకు సంబంధించినదిగా పోలీసుల విచారణలో తేలింది. దీంతో ఇంజిన్, ఛాసిస్ నంబర్లను సేకరించిన పోలీసులు ఆనంబర్లత్ కంపెనీ నుండి బయటకు వచ్చిన తరువాత ఏ షోరూంలకు అలాట్ అయ్యాయి..? అవి ఎవరు కొనుగోలు చేశారు..? అన్న వివరాలు సేకరిస్తున్నారు. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం అయితే బైక్ ఢిల్లీ షోరూం ద్వారా విక్రించినట్టుగా గుర్తించారు. ఈ బైకును కొనుగోలు చేసింది ఎవరూ..? కరీంనగర్ నగల షోరూంలో దోపిడీకి పాల్పడిన ముఠాకు ఏమైనా సంబంధం ఉందా అన్నవివరాలను సేకరిస్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా ఢిల్లీలో బైక్ పోయినట్టుగా పోలీసులకు ఫిర్యాదు అందిందా..? అది ఏప్రాంతంలో చోరీ అయింది..? అన్న వివరాలు సేకరించినట్టయితే దోపిడీ ముఠాకు సంబంధించిన మరిన్ని ఆనవాళ్లు లభ్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. మరో బైకుపై వెల్లిన వారు జగిత్యాల జిల్లా బీర్పుర్ అటవీ ప్రాంతంలోని కొల్వాయి, తుంగూరు, కమ్మునూరు వైపునకు వెళ్లినట్టుగా అనుమానిస్తున్నారు. మరో బైక్ కూడా ఇదే ప్రాంతంలో పడేశారా లేక దానిని తీసుకెళ్లారా అన్న కోణంలో కూడా ఆరా తీస్తున్నారు పోలీసులు.
ఏమయ్యారు..?
ఆదివారం ఉదయం 11.12 గంటలకు కరీంనగర్ నగల షోరూంలో దోపిడీకి పాల్పడిన ముఠా 12.30 గంటల సమయంలో ధర్మపురి ప్రాంతానికి చేరుకుని ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన మద్యాహ్నం వరకే గోదావరి తీరానికి చేరుకున్న దొంగలు బైక్ ను అక్కడే పడేసి ఎటువైపు వెళ్లారు..? ఎప్పుడు వెళ్లారోనన్న వివరాలు సేకరిస్తున్నారు. రాత్రి వరకూ ధర్మపురి పరిసర ప్రాంతాల్లోనే ఉండి చీకటి పడిన తరువాత గోదావరి నది మీదుగా నడుచుకుంటూ దండెపల్లి అటవీ ప్రాంతానికి చేరుకున్నారా లేక మరో వాహనంలో వెల్లిపోయారా అనే విషయంపై స్పష్టత లేకుండా పోయింది. లేక గోదావరి నది నుండి రాయపట్నం వైపునకు నడుచుకుంటూ వెళ్లి ఆటోలో కానీ, ఇతర వాహనాల్లో కానీ సాధారణ ప్రయాణీకుల వలె వెల్లిపోయారా అన్న విషయం తెలుసుకుంటున్నారు. లేనట్టయితే వీరి కోసం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ముఠా సభ్యులు సిద్దంగా ఉంచిన వాహనాల్లో తప్పించుకున్నారా అన్న విషయంపై క్లారిటీ రావల్సి ఉంది.

