దైవ దర్శనం చేయించి… కానరాని లోకాలకు పంపించి…

సంతానం కలగ లేదన్న సాకుతో భార్యను చంపిన భర్త

దిశ దశ, జగిత్యాల:

ఆలి మెడలో పసుపు తాడు కట్టిన జాలి లేని భర్త కాటికి పంపించాడు.  చేసిన అప్పులు తీర్చే మార్గం లేక సంతానం కలగలేదన్న సాకు చూపించి ఆమెను కడతేర్చాడు. 20 ఏళ్ల క్రితం పెళ్లయితే అప్పుడు కట్నం చాలినంత ఇవ్వలేదని వేధింపులకు గురి చేస్తూ ఉరివేసి చంపేశాడు. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. జగిత్యాల డీఎస్పీ రఘు చందర్ మీడియాకు హత్య వివరాలను వెల్లడించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మల్లాపూర్ కు చెందిన మమతకు, జగిత్యాల జిల్లా కొడిమ్యాలకు చెందిన ఆవుదుర్తి మహేందర్ కు 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇప్పటి వరకు సంతానం కల్గకపోవడంతో మమతను వేధింపులకు గురి చేసేవాడు. పెళ్లి సమయంలో కట్నం తక్కువగా ఇచ్చారని కూడా మమతను ఇబ్బందులు పెడుతున్న మహేందర్ తాగుడుకు బానిసై అప్పుల పాలయ్యాడు. భర్తతో పాటు అత్తింటి వారి వేధింపులను తట్టుకుంటూ జీవనం సాగిస్తున్న మమత గత కొంతకాలంగా కరీంనగర్ లోని ఓ షాపింగ్ మాల్ లో ఉద్యోగం చేస్తోంది. తాను చేస్తున్న ఉద్యోగం ద్వారా వచ్చిన జీతం డబ్బులు కూడా భర్తకు ఇచ్చేది మమత. అప్పుల ఊబిలో చిక్కుకున్న మహేందర్ మమతను హింసిస్తుండడంతో 20 రోజుల క్రితం మల్లాపూర్ లో పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా జరిగింది. భార్యను బాగా చూసుకుంటానని చెప్పిన మహేందర్ భార్య మమతను తొడ్కొని కరీంనగర్ లోని అద్దె ఇంటికి వెళ్లాడు. అయితే తాను చేసిన అప్పులు తీర్చేందుకు మమత మెడలో ఉన్న బంగారు పుస్తెల తాడు ఇవ్వాలని మళ్లీ పేచీ పెట్టడం మొదలు పెట్టాడు. తన పుట్టినింటి వారు ఇచ్చిన పుస్తెల తాడు ఇవ్వనని మమత తేల్చి చెప్పడంతో ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.

దైవ దర్శనాలకు వెల్లి…

అయితే ముందుగా వేసుకున్న పథకం ప్రకారం మహేందర్ తన భార్య మమతను ఏప్రిల్ 26న వేములవాడలోని రాజన్న, నల్లగొండ నృసింహ స్వామి ఆలయాలకు తీసుకెళ్లి దైవ దర్శనం చేయించాడు. అక్కడి నుండి కొడిమ్యాలలోని ఇంటికి తీసుకెళ్లిన మహేందర్ నైలాన్ తాడుతో మమత మెడకు ఉరివేసి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఇంటి పైకప్పుకు ఉన్న ఇనుప హుక్కుకు తగిలించి ఇంటికి తాళం వేసుకుని పరార్ అయ్యాడు. మమత మెడలో ఉన్న పుస్తెల తాడును తీసుకుని వెల్లిన మహేందర్ గంగాధరలోని ముత్తూట్ ఫైనాన్స్ లో తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో అప్పులు తీర్చుకున్నాడు. మమత పుట్టినింటి వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు ఆవుదుర్తి మహేందర్ ను శనివారం అరెస్ట్ చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో నిందితులుగా మహేందర్ కుటుంబ సభ్యులు ఆవుదూర్తి వజ్రవ్వ, లక్ష్మణ్, అనిల్, వెంకటష్ లపై కూడా కేసు నమోదు చేశామని డీఎస్పీ రఘు చందర్ తెలిపారు.

You cannot copy content of this page