గోదావరి తీరంలోనే భూ ప్రకంపనలు…

దిశ దశ, హైదరాబాద్:

తెలంగాణ రాష్ట్రంలో తరుచూ భూమిలో ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. గత ఆరు నెలల్లో వరసగా ఇది రెండో సారి కావడంతో భారీ ముప్పు పొంచి ఉందా అన్న ఆందోళన మొదలైంది. ప్రకృతి వైపరిత్యాలకు ఆమడ దూరంలో ఉంటుందని భావించే తెలంగాణలో తరుచూ భూ ప్రకంపనలు చోటు చేసుకోవడం వల్ల ప్రమాదం పొంచి ఉందా అన్న విషయంలో నిపుణులు ఏం చెప్తున్నారంటే…

తీవ్రత ఇలా…

తెలంగాణాలో సంభవించిన భూకంపం వివరాలు పరిశీలించినట్టయితే తీవ్రమైన ప్రభావాన్ని చూపేంతగా చోటు చేసుకోలేదని స్పష్టం అవుతోంది. 1969 జూలై 5న భద్రాచలంలో రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రతతో నమోదైన భూకంపమే అతిపెద్దది. ఆ తరువాత హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్ లో 1983లో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేల్ పై 4.8 తీవ్రతతో నమోదయింది. 2024 డిసెంబర్ 4న ములుగు జిల్లా మేడారం అడవుల్లో వచ్చిన భూకంపం రిక్టర్ స్కేల్ పై 5.0గా నమోదయింది. ఈ మూడు సార్లు తప్పితే మిగతా సమయాల్లో ఎప్పుడూ కూడా ఈ స్థాయిలో భూకంప తీవ్రత సంభవించలేదని పరిశోధకులు చెప్తున్నారు. తెలంగాణలో సాధారణంగానే భూ ప్రకంపనలు చోటు చేసుకుంటాయని రిక్టర్ స్కేల్ పై 2.0 నుండి ఆపై వరకు తరుచూ నమోదు అవుతూనే ఉంటుందని అంటున్నారు.

గోదావరి తీరంలోనే…

అయితే గోదావరి తీరంలో మాత్రమే ఎక్కువగా భూప్రకంపనలు, లేదా భూకంపాలు సంభవిస్తుండడం గమనార్హం. 1969, 2024లో రెండు సార్లు రికార్డ్ అయిన భూ కంపాలు గోదావరి
తీరంలోనే కావడం గమనార్హం. భూమిలో టెక్టోనిక్ ప్లేట్లలో వచ్చే మార్పుల వల్ల కదలికలు తరుచూ జరుగుతూనే ఉంటాయని దీనివల్ల భూమిలో సహజంగానే ప్రకంపనలు చోటు చేసుకుంటాయని తెలుస్తోంది. అయితే తాజాగా కొమురం భీం ఆసిఫాబాద్ కేంద్రీకృతంగా వచ్చిన భూకంపం వల్ల మూడు ఉమ్మడి జిల్లాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. 2025 మే
4న సాయంత్రం 6.47 నుండి 6.50 గంటల ప్రాంతంలో పలు ప్రాంతాల్లో 3 నుడి 5 సెకన్ల పాటు భూ ప్రకంపనలు జరిగాయి. రిక్టర్ స్కేల్ పై 3.8గా నమోదు అయిన ఈ భూకంప తీవ్రత వల్ల భారీగా ఆస్థి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ జరిగే అవకాశం లేదని పరిశోధకులు తేల్చి చెప్పారు. అత్యంత ముఖ్యమైన అంశాన్ని గమనించినట్టయితే మాత్రం ఉత్తర తెలంగాణాలోని గోదావరి నది తీరంలోనే ఎక్కువగా భూమిలో కదలికలు జరుగుతుండడం గమనార్హం. దక్షిణ తెలంగాణ మీదుగా ప్రవహిస్తున్న కృష్ణ నది తీరంలో మాత్రం భూకంపాలు సంభవించిన దాఖలాలైతే వెలుగులోకి రాలేదు. ఇప్పటి వరకు స్వల్పంగా అయినా భారీగా అయినా భూ ప్రకంపనలు  గోదావరి పరివాహక ప్రాంతంలోనే నమోదు అవుతున్న తీరును బట్టి గమనిస్తే… ఈ నదీ తీరంలోనే ఎక్కువగా టెక్టోనిక్ ప్లేట్లలో కదలికలు సంభవిస్తున్నాయని అర్థం అవుతోంది. ఈ నది పరివాహక ప్రాంతంలో  ఖనిజ సంపదను వెలికి తీస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో భూకంపాలు తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉంటుందా అన్న ఆందోళన అయితే  నెలకొంది.

కారణమేంటీ..?

ఇప్పటి వరకు పరిశోధకులు దక్కన్ పీఠభూములుగా గుర్తించబడిన తెలంగాణ ప్రాంతం అత్యంత సురక్షిత ప్రాంతాల్లో ఒకటిగా గుర్తించారు. ఇక్కడ ప్రమాద ఘంటికలు మోగించేంతగా భూకంపాలు చోటు చేసుకునే అవకాశం లేదని తేల్చారు. ఫాల్ట్ రియాక్టివేషన్ వల్ల తరుచూ భూ ప్రకంపనలు చోటు చేసుకుంటాయని, భూమి పొరల్లో జరిగే సర్దుబాటు ప్రక్రియలో ఒత్తిళ్లకు లోనయినప్పుడు ఇలా జరుగుతూ ఉంటుందని చెప్తున్నారు. టెక్టోనిక్ ప్లేట్లలో ఉన్న పగుళ్లు సర్దుబాటు జరగడం వల్ల భూకంప తీవ్రతను తగ్గించే విధంగా భూమి పొరలు సర్దుకుంటాయని
అంటున్నారు. మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిన భారతీయ టెక్టోనిక్ ప్లేట్లు అత్యంత పురాతనమైనవి కావడం వల్ల బౌగోళిక ఒత్తిళ్లకు గురవుతూ ఉంటాయని కూడా వివరిస్తున్నారు. దీనివల్ల రాతి నిర్మాణాలో ఉన్న పగుళ్ల లోపాలను సక్రియం చేసేందుకు దోహదపడుతుందని ఇలాంటి సమయాల్లో సాధారణమైన భూకంపాలకు దారి తీసే అవకాశం ఉంటుందని
చెప్తున్నారు.
సోమవారం తెలంగాణాలో సంభవించిన భూప్రకంపనల ప్రభావానికి సంబంధించిన వీడియో…

 

You cannot copy content of this page