దిశ దశ, జగిత్యాల:
భగభగలాడుతున్న మండుటెండలో ఓ వృద్దురాలు అటవీ ప్రాంతంలో సంచరిస్తోంది. తానెక్కడ ఉందో తెలియదు… ఎటువైపు వెల్తుందో అర్థం కావడం లేదు… ఊత కర్ర సాయంతో గుట్టబోరు పరిసర ప్రాంతంలో తచ్చాడుతోంది. ఆమెను గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో సఖీ కేంద్రానికి తరలించారు. జగిత్యాల జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. జిల్లా కేంద్రంలోని ఇస్లాంపురాకు చెందిన బూదవ్వ అనే పండు ముసలి గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న విషయాన్ని గమనించిన స్థానికులు జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వడంతో సఖీ కేంద్రం నుండి ప్రత్యేకంగా వచ్చిన బృందం బూదవ్వను కేంద్రానికి తరలించింది.
గ్రామంలోనే…
శ్రీరాములపల్లి గ్రామంలోనే రెండు రోజుల క్రితం తిరుగుతున్న ఆమెను గమనించిన స్థానిక యువకడు ఒకరు చేరదీశారు. ఆమె వద్ద ఉన్న ఓ మూటలో వెతకగా ఆధార్ కార్డుతో పాటు ఓ ఫోన్ నంబర్ లభ్యం అయింది. ఆ నెంబర్ కు సదరు యువకుడు ఫోన్ చేస్తే బూదవ్వ కుటుంబ సభ్యుల వివరాలు వెల్లడించలేకపోయారు. అయితే వృద్దురాలికి ఈశ్వరీ అనే కూతురు ఉందని ఆమె నర్సింగాపూర్ లో ఉంటుందన్న సమాచారం ఇచ్చారు. దీంతో బూదవ్వ కూతురు ఆచూకి కోసం ప్రయత్నించినా లాభం లేకపోయిందని ఆ యువడుకు వెల్లడించారు. రాత్రి 11.30 గంటలు అవుతుండడంతో వృద్దురాలికి భోజన ఏర్పాట్లు చేసి తన ఇంట్లోనే సెద తీరాలని చెప్పాడు. అయితే మరునాటి ఉదయం బూదవ్వ అక్కడి నుండి వెళ్లిపోయింది. అప్పటి నుండి సమీపంలోని గుట్టబోరు ప్రాంతంలో సంచరిస్తున్న వృద్దురాలు రెండు రోజులుగా ఆకలికి అలమటిస్తూ కాలం వెల్లదీసింది. ఓ వైపున ఎండలు మండిపోతున్నా తన గమ్యం చేరుకోవాలన్న తపనతో తెలియని దారి వెంట తిరుగుతూనే ఉంది. బూదవ్వను గమనించిన స్థానికులు జిల్లా సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా ఆమెను సఖీ కేంద్రానికి తరలించారు.
కన్న కూతురే…
అయితే బూదవ్వకు నీరు, ఆహారం అందించిన తరువాత అటవీ ప్రాంతం నుండి స్థానికులు ఎత్తుకుని గ్రామ శివర్ల వరకు తీసుకొచ్చారు. ఆమె చెప్తున్న సమాచారాన్ని బట్టి జగిత్యాలలోని ఇస్లాంపురాలో నివాసం ఉంటున్నానని, తనకు ఒక్క కూతురు ఉందని తెలుస్తోంది. ఆమెపై ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను తీసుకున్న కూతురు ఈశ్వరీ శ్రీరాములపల్లి శివార్లలో వదిలేసి వెల్లిపోయిందని బూదవ్వ వెల్లడించింది. బూదవ్వకు రెండు రోజులుగా ఆహారం దొరకకపోవడంతో అచేతనవాస్తకు చేరుకుంది. దీంతో ఆమె నుండి పూర్తి వివరాలు రాబట్టే పరిస్థితి లేకుండా పోయింది. పండు ముసలి కావడం… ఆహారం అందుబాటులో లేకపోవడంతో బూదవ్వ కొంత అనారోగ్యానికి కూడా గురైనట్టుగా కనిపిస్తోంది. బుధవారం రాత్రి శ్రీరాములపల్లి సఖీ కేంద్రానికి తరలించిన అధికారులు వైద్యం అందించేందుకు జగిత్యాల ఆసుపత్రికి తీసుకెళ్లారు.
నాణానికి రెండో వైపు…
బూదవ్వ చెప్తున్న కథనం పట్టి కడుపున పుట్టిన బిడ్డే అనాథను చేసి అడవిలో వదిలేసినట్టుగా స్పష్టం అవుతోంది. పేగు బంధం తెంచుకుని పుట్టిన బిడ్డ తల్లిని చూసుకోకుండా వదిలేసి వెళ్లి మాతృత్వపు మమకారాన్ని చంపేసినట్టయింది. అయితే వణుకుతూ చెట్లు, పొదల్లో సంచరిస్తున్న పండు ముసలిని చూసిన స్థానిక యవత ఆమెను చేరదీసి అధికారులకు సమాచారం ఇచ్చి వారిలోని మానవత్వాన్ని ప్రదర్శించారు. ఏది ఏమైనా కాటికి కాలు చాపిన తల్లిని కంటికి రెప్పలా చూసుకోవల్సిన కూతురు అవ్వను వదిలేస్తే… ఆ అవ్వకు బువ్వ పెట్టిన అక్కున చేర్చుకున్నది మరోకరు కాగా, అక్కడి అటవీ ప్రాంతంలో తిరుగుతున్న ఆమెను క్షేమంగా అధికారులకు అప్పగించి తమలోని మానవత్వాన్ని ప్రదర్శించారు శ్రీరాములపల్లి గ్రామస్తులు.