అన్యాయం చేసిన పార్టీ న్యాయం చేసిందా…
పదవి దక్కకున్నా బీజేపీలో చేరడం వెనక..?
దిశ దశ, కరీంనగర్:
అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన ఓ విద్యా సంస్థల నిర్వాహకుని అనూహ్య నిర్ణయాలు చర్చనీయాంశంగా మారాయి. కీలకమైన పదవిని ఆశించిన ఆయన చివరి వరకూ విఫల యత్నం చేసి భంగపడ్డారు. ఇప్పుడు ధిక్కరించిన పార్టీ కండువా కప్పుకోవడం హాట్ టాపిక్ గా మారింది.
ఎన్నికలకు నేపథ్యంలో…
దశాబ్దాల కాలంగా కరీంనగర్ లో విద్యా సంస్థలు ఏర్పాటు చేసిన సౌగాని కొమురయ్య వైవిద్యమైన నిర్ణయాలు సంచలనంగా మారాయి. మునిసిపల్ ఎన్నికలకు ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారు. పదో డివిజన్ నుండి పోటీ చేసి, మేయర్ అవుతారన్న ప్రచారం కూడా విస్తృతంగా సాగింది. అయితే పార్టీ సమీకరణాల నేపథ్యంలో మాజీ మేయర్ డి శంకర్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది బీజేపీ. దీంతో కోమురయ్య తనకు అన్యాయం జరిగిందని భావించి రెబెల్ అభ్యర్థిగా పోటీ చేసి కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. ఎన్నికల సమయంలో తనకు బీజేపీ నాయకత్వం మాట ఇచ్చిందని తీరా వేళకు అన్యాయం చేసిందని చెప్పుకుంటూ ప్రజా క్షేత్రంలో ఓట్లు అడగడం మొదలు పెట్టారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కొమురయ్య గెలుపొందిన తరువాత తనకు మేయర్ పదవి ఇచ్చే పార్టీకే మద్దతు ఇస్తానని ప్రకటించారు. అయితే బీజేపీ మాత్రం ఆయన ప్రతిపాదనకు తలొగ్గకుండా పార్టీ బీఫామ్ పై గెలిచిన వారికే అవకాశం కల్పిస్తానని ప్రకటించింది. ఆ తరువాత క్యాంపు రాజకీయాలు మొదలు కావడం, స్వతంత్రుల మద్దతుతో కార్పొరేషన్ కైవసం చేసుకునే ప్రయత్నాల్లో నిమగ్నం అయింది.
పోటీ శిబిరం…
అయితే కరీంనగర్ కార్పొరేషన్ లో 34 మంది మద్దతు ఉన్న వారే జెండా ఎగురవేసే అవకాశం ఉండడంతో కూటమి నేతృత్వంలో బీజేపేతర పార్టీలన్ని ఏకమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యాంపునకు పదో డివిజన్ కార్పొరేటర్ సౌగాని కొమురయ్య కూడా వెళ్లారు. సమీకరణాలు అనుకూలిస్తే మేయర్ అవుతానన్న అంచనాలతో ఆయన ఈ శిబిరంలో చేరిపోయారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరగనున్న 16వ తేది తెల్ల వారు జాము వరకూ కూడా కూటమి పార్టీలన్ని సఫలం అవుతాయని భావించారంత. అయితే కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు కూడా మేయర్ అభ్యర్థిగా తామే ఉంటామన్న ప్రతిపాదనను తెరపైకి తీసుకరావడం, 30 స్థానాలు గెలిచిన బీజేపీని ఓడించాలన్న లక్ష్యంగా భావ సారూప్యత లేని పార్టీలన్ని ఏకమయ్యాయన్న ప్రచారం జరగడంతో పోటీ శిబిరం విఫలం అయింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ తరుపున గెలిచిన తొమ్మిది మంది కార్పొరేటర్లు ఎన్నికల ప్రక్రియలో తటస్థంగా ఉండాలని నిర్ణయించారు. ఫలితంగా కూటమి పార్టీలు ఏర్పాటు చేసుకున్న శిబిరం ఫెయిల్ అయింది. ఓ దశలో స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న కొమురయ్యకు మద్దతు ఇచ్చే ప్రతిపాదన తెరపైకి వచ్చినప్పటికీ మరికొంత మంది పేర్లు తెరపైకి రావడం కూడా పోటీ శిబిరం ఫెయిల్ కావడానికి మరో కారణమని చెప్పవచ్చు. దీంతో కరీంనగర్ కార్పొరేషన్ ను బీజేపీ కైవసం చేసుకోవడంతో ఉత్కంఠతకు తెరపడింది. చివరకు ఆయన బీజేపీ కండువా కప్పుకోవడం మరో సంచలనంగా మారింది. తనను మేయర్ గా చేసే పార్టీకే మద్దతు ఇస్తానని ప్రకటించిన కొమురయ్య ఇప్పుడు సాదారణ కార్పొరేటర్ గానే మిగిలిపోగా ఇప్పుడు తనను మోసం చేసిందని చెప్పుకున్న పార్టీ పంచన చేరడం గమనార్హం. అయితే బీజేపీ నాయకులు కూడా కొమురయ్యను పార్టీలో చేర్పించుకునేదే లేదన్న సంకేతాలు పంపించి ఇఫ్పుడు ఆయనకు ఏకంగా రాష్ట్ర అధ్యక్షుని సమక్షంలో పార్టీలో చేర్పించుకోవడమూ చర్చకు దారి తీసింది. ఏది ఏమైనా ఎవరూ ఊహించని విధంగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కొమురయ్య విజయం సాధించడం ధిక్కరించిన పార్టీలోనే తిరిగి చేరడం విశేషం.

