ఎదురు కాల్పుల్లో ముగ్గురు పోలీసుల మృతి…

ఆర్ఎస్ఐకి తీవ్ర గాయాలు…

దిశ దశ, దండకారణ్యం:

మావోయిస్టు పార్టీ, గ్రేహౌండ్స్ బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు కానిస్టేబుళ్లు చనిపోగా, ఒక ఆర్ ఎస్ఐ తీవ్రంగా గాయపడ్డారు.  తెలంగాణ, చత్తీస్ గడ్ సరిహధ్దు ప్రాంతంలో జరిగిన ఈ ఘటనపై పోలీసుల చెప్తున్న వివరాల ప్రకారం… వాజేడు పోలీస్ స్టేషన్ పరిధిలో మందుపాతరలను గుర్తించేందుకు బుధవారం రాత్రి నుండి పోలీసు పార్టీలు  గాలింపు చర్యలు చేపట్టాయి. ములుగు జిల్లా సరిహధ్దు అడవుల్లో మందుపాతరలు అమర్చామని, అటువైపు ఆదివాసీలు ఎవరూ రాకూదని ఇటీవల మావోయిస్టు పార్టీ పేరిట ఓ లేఖ విడుదలైంది. దీంతో ఆ ప్రాంతంలో  మందుపాతరలను గుర్తించి నిర్విర్యం చేయాలన్న యోచనలో వాజేడు పోలీస్ స్టేషన్ నుండి బుధవారం రాత్రి పోలీసులు కూంబింగ్ చేపట్టారు.  గురువారం తెల్లవారు జామున 6 గంటల ప్రాంతంలో వాజేడు మండల కేంద్రానికి 17 కిలో మీటర్ల దూరంలో ఉన్న పెద్ద గుట్ట సమీపంలోని నూగురు అటవీ ప్రాంతంలో పోలీసులు మందుపాతరలను గుర్తించే పనిలో నిమగ్నం అయ్యారు. అదే ప్రాంతంలో అంబూష్ తీసుకుని ఉన్న మావోయిస్టులు పోలీసులపై కాల్పులు జరపడంతో పాటు మందు పాతరలు కూడా పేల్చారు. దాదాపు 15 నిమిషాల పాటు నిర్విరామంగా మావోయిస్టులు పోలీసు పార్టీలపై కాల్పులు జరుపుతూనే ఉన్నారు. దీంతో పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరపడంతో మావోయిస్టులు ఘటన స్థలం నుండి వెల్లిపోయారు. మావోయిస్టులు 35 నుండి 40 మంది వరకు ఉంటారని భావిస్తున్నారు. ఈ ఎదురు కాల్పుల్లో వడ్ల శ్రీధర్ (JC 4973/ PC 1785), N. పవన్ కళ్యాణ్ (JC 10541/PC), టి సందీప్ (C 4638/PC 8124) లు చనిపోయారు. అలాగే ఈ ఎదురు కాల్పుల్లో ఆర్ఎస్ఐ రణధీర్ కు తీవ్రగాయాలు కాగా అతన్ని హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మంత్రి, డీజీపీ నివాళి…

వాజేడు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఎదురు కాల్పుల్లో మరణించిన కానిస్టేబుళ్ల మృతదేహాలను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించి పోస్టు మార్టం నిర్వహించారు. అనంతరం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ కు తరలించగా రాష్ట్ర మంత్రి సీతక్క, డీజీపీ జితేందర్, గ్రేహౌండ్స్ డీజీ స్టీఫెన్ రవీంద్రలు నివాళులు అర్పించారు.

గ్రేహౌండ్స్ చరిత్రలో…

తెలుగు రాష్ట్రాలలో నక్సల్స్ ఏరివేత కోసం ఏర్పాటు చేసిన గ్రేహౌండ్స్ బలగాల ప్రత్యేకత అంతా ఇంతా కాదు. ప్రతికూల పరిస్థితులను కూడా ఎదుర్కొంటూ ముందుకు పోయే విధంగా శారీరక, మానసిక ధృఢత్వం కల్పించే విధంగా ప్రత్యేకమైన శిక్షణ ఇస్తారు. ట్రెక్కింగ్, కూంబింగ్ తో పాటు ఆహారం అందుబాటులో లేకున్నా ముందుకు సాగే విధంగా వారిని తీర్చిదిద్దుతారు. 1989లో ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన గ్రేహౌండ్స్ విభాగం చేసిన ఆపరేషన్లు సక్సెస్ అయిన దాఖలాలే ఎక్కువ. నక్సల్స్ ఏరివేతలో కీలకంగా పనిచేసిన గ్రేహౌండ్స్ బలగాలు ఆదిపత్యాన్ని ప్రదర్శించిన సందర్భాలు ఎన్నో. అయితే 2008లో ఒడిషాలో మావోయిస్టుల ఏరివేత కోసం కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించుకుని వస్తున్న క్రమంలో బలిమెల వద్ద నది దాటుతుండగా మావోయిస్టులు ముప్పేట దాడి చేశారు. ఒడిషా అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టిన బలగాలు తిరిగి హైదరాబాద్ చేరుకునేందుకు ఉన్న ఏకైక మార్గం ఇదే కావడంతో మావోయిస్టులు అప్పటికే మాటు వేసి ఉన్నారు. ఒకే పడవలో 60 మంది పోలీసులు ప్రయాణిస్తున్నప్పుడు గ్రేనేడ్లు విసరడంతో పాటు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 28 మంది గ్రేహౌండ్స్ పోలీసులు, ఐదుగురు పోలీసు అధికారులు, పడవ నడిపే వ్యక్తి ఒకరు చనిపోగా, 27 మంది గ్రేహౌండ్స్ కమెండోలు ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో ఈదుకుంటూ బయటకు వచ్చారు. గ్రేహౌండ్స్ బలగాలో చరిత్రలోనే ఇదే అతిపెద్ద నష్టం. ఆ తరువాత చత్తీస్ గడ్ లో కూంబింగ్ నిర్వహించిన క్రమంలో ఓ కమెండో మరణించాడు. ఎప్పుడూ అడవుల్లోనే సంచరిస్తే ఉండే గ్రేహౌండ్స్ బలగాలు నక్సల్స్ ఎత్తులు, పై ఎత్తులపై పరిపూర్ణమైన అవగాహన ఉంటుంది. దీంతో గాలింపు చర్యల్లో నక్సల్స్ చేతికి చిక్కిన సందర్భాలే అత్యంత అరుదు. తాజాగా 2025 మే 8న ములుగు జిల్లా వాజేడు పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మరణించారు. గ్రేహౌండ్స్ ఆవిర్భావం అయిన 35 ఏళ్ల చరిత్రలో మూడు సార్లు మాత్రమే ప్రాణాలు కోల్పోయారంటే ఈ కమెండోలు ఏస్థాయిలో శిక్షణ పొంది ఉంటారో అర్థం చేసుకోవచ్చు.

పొరుగు రాష్ట్రాల్లోనూ…

వాస్తవంగా 1989లో తెలంగాణ, ఏపీలలో నక్సల్స్ ప్రాభల్యం తీవ్రంగా ఉండేది. వారిని ఏరివేసేందుకు శాంతి భద్రతల్లో ఉండే పోలీసులతో పాటు ప్రత్యేక దళాలు అవసరమని భావించిన ఐపీఎస్ ఆఫీసర్ వ్యాస్ గ్రేహౌండ్స్ బలగాలను తీర్చిదిద్దాలని నిర్ణయించారు. తెలంగాణా, ఏపీలలో జరిగిన పలు ఆపరేషన్లలో కూడా గ్రేహౌండ్స్ బలగాలదే క్రీయాశీలక పాత్ర. అయితే నక్సల్స్ ఏరివేతలో అత్యంత చురుగ్గా వ్యవహరించే గ్రేహౌండ్స్ కమెండోల సేవలు కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు. ప్రభావిత రాష్ట్రాల్లోనూ వీరి శక్తి సామర్థ్యాలను ప్రదర్శించిన సందర్భాలు చాలా ఉన్నాయి. మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్లపై పట్టు బిగించిన చత్తీస్ గడ్, మహారాష్ట్ర, ఒడిషా రాష్ట్రాల్లోనూ చాలా సార్లు తెలుగు రాష్ట్రాల గ్రేహౌండ్స్ సెర్చింగ్ ఆఫరేషన్లు నిర్వహించారు.

You cannot copy content of this page