మానకొండూరులో మోహరించిన బలగాలు…

కాంగ్రెస్ వర్సెస్… బీఆర్ఎస్…

దిశ దశ, మానకొండూరు:

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో భారీగా పోలీసులను మోహరించారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కట్టడి చర్యలు చేపట్టేందుకు సీపీ గౌస్ ఆలం ముందస్తుగా బలగాలను పంపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన శ్రేణులు అక్కడకు చేరుకోవడంతో గందరగోళం నెలకొంది.

బీఆర్ఎస్ ధర్నా…

అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారని, అర్హులైన వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేపట్టింది. మానకొండూరు మండల కేంద్రంలో నిర్వహించిన ఈ ధర్నాలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాల కిషన్, జిల్లా అధ్యక్షుడు జివి రామకృష్ణారావుతో పాటు పార్టీ నాయకులు హాజరయ్యారు. ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అనర్హులకు ప్రాధాన్యత ఇచ్చారని, అర్హులైన వారిని విస్మరించారని ఆరోపించారు బీఆర్ఎస్ నాయకులు. బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఈ ధర్నాకు కౌంటర్ గా కాంగ్రెస్ పార్టీ కూడా రంగంలోకి దిగింది. స్థానిక కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ ఇంటి లబ్దిదారులను బీఆర్ఎస్ ధర్నా జరుగుతున్న ప్రాంతానికి తరలించారు. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ నాయకులు మానకొండూరుకు చేరుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసు అధికారులు హుటాహుటిన బలగాలను మానకొండూరుకు పంపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల శ్రేణులను ఎక్కడికక్కడ కట్టడి చేసే పనిలో నిమగ్నం అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముందస్తుగానే ధర్నాకు అనుమతి తీసుకున్నారని పోలీసులు చెప్తున్నారు. అయితే అనూహ్యంగా గురువారం ఉదయం కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ లబ్దిదారులను తరలించి బీఆర్ఎస్ ధర్నాకు కౌంటర్ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.