మంథని బిడ్డల సరికొత్త సాంప్రాదాయం…
దిశ దశ, మంథని:
ఒకటి కాదు… రెండు కాదు… ఐదు తరాలకు చెందిన వారసులంతా ఒకే చోట కలిశారు. వీరంతా ఏదో వేడుకకు హజరయ్యేందుకు అక్కడకు చేరుకోలేదు… తమ కుటుంబమంతా ఒకే చోట కలవాలన్న తపనతో కలుసుకున్నారు. విదేశాల్లో స్థిరపడ్డ వారు వర్చువల్ ద్వారా తమ రక్త సంబంధీకులతో మాట్లాడగా… స్వదేశంలో ఉన్న వారంతా నేరుగా కలుసుకుని ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. అత్యంత అరుదైన ఈ ఆత్మీయ సమ్మేళనానికి శ్రీకారం చుట్టింది పెద్దపల్లి జిల్లా మంథని వాసులు కాగా… హైదరాబాద్ కొండాపూర్ లోని అపర్ణా సెరేన్ కమ్యూనిటీ వేదికగా నిలిచింది.

పసి బిడ్డల నుండి…
మంథని పట్టణానికి చెందిన కొంతం కిష్టయ్య, అమ్మాయి దంపతుల వారసులు 200 మంది కలుసుకున్న అపురూపమైన సన్నివేశం సాక్షాత్కరించింది. పసి పిల్లల నుండి మొదలు పండుటాకుల వరకు అందుబాటులో ఉన్న వారంతా కలిసి ఆత్మీయతను పంచుకున్నారు. ఆధునిక పోకడలు… పోటీ ప్రపంచంలో భార్య, భర్త, పిల్లలతో గడపేందుకే ప్రాధాన్యత ఇస్తున్న ఈ కాలంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదు తరాల వారు కలుసుకున్న అద్భుత సన్నివేశం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆరు నెలల పసి బిడ్డలు, 80 ఏళ్లపై బడిన వృద్దులంతా ఒకేచోట కలుసుకుని ఉమ్మడి కుటుంబ వ్యవస్థ యొక్క పరమార్థాన్ని చేతల్లో చూపించారు. గురువారం నాడు కలుసుకున్న వీరంతా ఒకరినొకరు పరిచయం చేసుకోవడం, తొలితరం వారి అనుభవాలను తెలుసుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చింది నేటితరం. కొంతం కిష్టయ్య, అమ్మాయి దంపతుల వారసులు కొంతమంది విదేశాల్లో స్థిరపడగా వారు కూడా వర్చువల్ ద్వారా తమ వారితో మాట్లాడి అందరి బాగోగులు అడిగి తెలుసుకున్నారు.

లెటర్ T0 సెల్…
యోగ క్షేమాలు తెలుసుకునేందుకు ఉత్తర ప్రత్యుత్తారలతో కాలం వెల్లదీసిన తరానికి చెందిన వారు… తమ వారు ఉన్న ఊరి నుండి ఎవరైనా వస్తే వారి గురించి తెలుసుకునే అవకాశం ఉంటుందన్న ఆతృతతో ఎదురు చూసిన తరం నుండి మొబైల్ ఫోన్ ద్వారా మాట్లాడుకునే నేటి తరానికి మధ్య చోటు చేసుకున్న విప్లవాత్మకమైన మార్పులను అస్వాదిస్తున్న వారంతా ఒకే చోట చేరి అలనాటి కష్టాలు… కన్నీళ్లు, అప్యాయతల గురించి వివరిస్తుంటే టెక్నాలిజీతో మమేకమైన నేటితరం ఆసక్తితో వింటూ ఉండిపోయింది.
అనురాగం… ఆనందం…
మంథని ఫ్యామిలీ వాట్సప్ గ్రూప్ బృందం ద్వారా ఈ ఆత్మీయ కలయిక వేడుకకు రూపకల్పన చేసిన కొంతం వారసులు ఒకే కుటుంబానికి చెందిన తామంతా ఒకే చోట కలిసిన తీరుతో మురిసిపోయారు. ఈ సందర్బంగా ఒకరినొకరు అనురాగంతో పలకరించుకుంటూ ఆనందంలో తేలియాడారు. ఈ సందర్బంగా కొంతం కిష్టయ్య వంశ వృక్షాన్ని చిత్రరూపంలో ప్రదర్శించడంతో పాటు తమలోని కళలను కూడా ప్రదర్శించి అబ్బురపరిచారు. తమ కుటుంబ సభ్యులందరి ఆత్మీక కలియకు తీపి గుర్తుగా ఫోటోలు, వివరాలతో కూడిన ఒక పుస్తకాన్ని కూడా ముద్రించాలని కొంతం కిష్టయ్య వారసులు నిర్ణయించుకున్నారు.

కలిసుంటే…
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ దాదాపుగా అంతరించిపోతున్న ఈ తరుణంలో నేటికీ వారసులంతా కలిసి ఉంటున్న ఫ్యామిలీల గురించి అత్యంత విచిత్రంగా చర్చించుకుంటున్న రోజులివి. ఎవరికి వారే అన్నట్టుగా తమ ఆకాంక్షలకే అత్యంత ప్రాధాన్యం ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్న ఈ తరుణంలో కుటుంబమంతా ఒక చోట కలిసిన సందర్భాలు అత్యంత అరుదుగా నిలుస్తున్నాయి. బిజీ లైఫ్ లోనూ కొంతం కిష్టయ్యకు సంబంధించిన ఐదు తరాల వారసులు ఒకే చోట కలిసిన తీరు ఆదర్శప్రాయంగా నిలిచింది.

